బైబిల్ నుండి 2 తిమోతికి 2:21వ వచనమును తీసుకొనబడినది. తనను తాను శుద్ధపరచుకొనువారు, ప్రభువుకు సమర్పించుకుంటారో, వారు ఘనమైన కార్యాల కొరకు ఉపయోగపడే పాత్రగా ఉంటారని ప్రభువు వాగ్దానం చేయుచున్నాడు. అందుకే ఆ వచనములో, "...తన్నుతాను పవిత్రపరచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును'' ప్రకారం దేవుని చేత వాడబడు ఘనత నిమిత్తమైన పాత్రయై ఉంటారని ప్రభువు వాగ్దానం చేయుచున్నాడు. పవిత్రతకు మొదటి మెట్టు ఒప్పుకోలు. అందుకే బైబిల్ నుండి 1 యోహాను 1:9వ వచనములో మనము చూచినట్లయితే, "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును'' ప్రకారము మన పాపాలను మనము ఒప్పుకున్నప్పుడు, యేసు నమ్మదగినవాడు మరియు నీతిమంతుడు అని మనకు ఉత్తరవాదము ఇవ్వబడియున్నది. అంతమాత్రమే కాదు, ఆయన మనలను సమస్త దుర్నీతి, పాపం మరియు వ్యసనాల నుండి క్షమించి, మనలను పవిత్రులనుగా చేస్తాడు. మనం ఆయన రూపాంతరపరచబడు శక్తి యొక్క ప్రత్యేకతను అంగీకరిస్తూ, మన బలహీనతలను విధేయతతో మనలను మనము తగ్గించుకొని, ఆయన యెదుట సమర్పించుకోవాలి. మనం ఇలాగున చేసినప్పుడు, యేసు, మత్తయి 5:8వ వచనములో ఇలాగున అంటున్నాడు, "హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు'' ప్రకారము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొనబడిన హృదయమును మనము కలిగి ఉండాలని ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు. కనుకనే, నేడు మనము కూడా హృదయశుద్ధిగలవారమై ఉండుటకు ప్రయత్నించాలి. అప్పుడు ఆయన వాడుకొను అర్హమైన పాత్రలుగా ఉండగలము.
నా ప్రియులారా, మనం ఇతరులతో పంచుకునే సమాధానములో కూడా పవిత్రత ప్రత్యక్షపరచబడుతుంది. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 12:14వ వచనములో మనము చూచినట్లయితే, "అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు'' అని చెప్పబడినట్లుగానే, మనలను అందరితో సమాధానముగా జీవించమని గుర్తు చేయుచున్నది. ఎందుకంటే, సమాధానము లేకుండా మన హృదయాలు పవిత్రంగా ఉండలేవు. తరచుగా, కుటుంబ సభ్యులతో లేదా తోటి విశ్వాసులతో సమాధానపడటానికి తగ్గింపు మరియు త్యాగం పొందుకొనవలసి ఉండవచ్చును. కానీ, మనం క్షమించవలసి ఉండవచ్చును, మనలను మనం తగ్గించుకోవలసి ఉండవచ్చును లేదా సమాధానమును పునరుద్ధరించడానికి ఏదైనా ఇవ్వవలసి ఉండవచ్చును. ద్వేషాన్ని మనస్సులో ఉంచుకోవడం వలన దేవుడు మన ప్రార్థనలు వినకుండా ఉంటాడని యెషయా 1:15 మరియు 1 యోహాను 3:15 హెచ్చరిస్తున్నాయి. నిజమైన పవిత్రత అనేది మనం సమాధానమును నెలకొల్పుకొని, సమాధానపరచుకుని, మన హృదయాల నుండి చేదును తొలగించుకున్నప్పుడు వస్తుంది. అలా చేయడం ద్వారా, మనలను మనం శుద్ధి చేసుకోవడమే కాకుండా, మన చుట్టూ ఉన్నవారి పట్ల దేవుని ప్రేమను మనము ప్రత్యక్షపరచెదము.
చివరగా, నా ప్రియులారా, మనం పవిత్రత మరియు సమాధానముతో జీవించినప్పుడు, దేవుడు ఇతరులను ఆశీర్వదించడానికి మనకు అధికారమునిస్తాడు. బైబిల్ నుండి యోహాను 20:22-23వ వచనములలో చూచినట్లయితే, ఆత్మతో నిండిన వారికి పాపాలను క్షమించి, ఆయన కృపను పరిచర్య చేయుటకు అధికారం ఉంటుందని వాగ్దానం చేయబడియున్నది. ఆలాగుననే, నా ప్రియులారా, మనం పవిత్రత, సమాధానము మరియు విధేయతతో నడుచుకున్నప్పుడు, దేవుడు మనలను మంచి కార్యముల కొరకు మరియు తన రాజ్యాన్ని విస్తరింపజేయడానికి ఉపయోగించుకోగలడు. పవిత్రత మన వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే కాదు; ఇది ఇతరులకు సేవ చేయడానికి, విరిగిన స్థితిని స్వస్థపరచడానికి మరియు దేవుని ప్రేమను ఆచరణాత్మక మార్గాల్లో ప్రదర్శించడానికి ఒక పిలుపు. మన జీవితంలోని ప్రతి భాగంలో ఆయన హృదయాన్ని ప్రతిబింబిస్తూ, పవిత్రంగా, ఉపయోగకరంగా మరియు సమాధానమును సృష్టించేవారిగా ఉండటానికి దేవుడు మనకు ఈ కృపను అనుగ్రహించును గాక. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలకోమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, మా యొక్క ప్రతి పాపం మరియు బలహీనత నుండి మా హృదయాన్ని కడిగి పవిత్రపరచుము. దేవా, మా పాపములను మరియు దోషములన్నిటిని నీ సన్నిధిలో ఒప్పుకుని అప్పగించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ సన్నిధిని చూడటానికి మాకు పవిత్రమైన హృదయాన్ని అనుగ్రహించుము. దేవా, మా జీవితంలోని ప్రతి ఒక్కరితో మాకు శాంతి సమాధానమును అనుగ్రహించుము. యేసయ్యా, మేము నీ వలె మమ్మును బాధించిన వారిని క్షమించుటకు మాకు సహాయం చేయుము. దేవా, మా యొక్క విడిపోయిన సంబంధాలను పునరుద్ధరించడానికి మాకు విధేయతను మరియు తగ్గింపును నేర్పుము. ప్రభువా, ఇతరుల పట్ల మేము మంచి కార్యములు చేయడానికి మమ్మునందరిని నీ ఆత్మ శక్తితో మమ్మును నింపుము. దేవా, మమ్మును నీ చేతులలో పవిత్రంగా మరియు ఉపయోగకరంగా చేయుము. ప్రభువా, మా జీవితం నీ ప్రేమ మరియు కృపను ప్రతిబింబించునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


