నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 4:20-22వ వచనములను మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుట నుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసికొనుము. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అవును, దేవుని వాక్యము మనకు దొరికినప్పుడు, అవి మనకు జీవమును కలిగించుచున్నవి. అంతమాత్రమే కాదు, ఆరోగ్యమును కూడా అనుగ్రహించుచున్నది.
అవును, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని వాక్యమును తప్పకుండా చదవాలి. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే, బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 8:3, మత్తయి 4:4, మరియు లూకా 4:4వ వచనములలో, లేఖనము స్పష్టంగా ఇలాగున చెబుతుంది, "అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.'' మరియు కీర్తనలు 119:105వ వచనములో, అది ఇలాగున చెబుతుంది, "నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది'' ప్రకారం దేవుని వాక్యం వెలుగును ఇచ్చుట మరియు మార్గమును చూపుట మాత్రమే కాదు. కానీ, అది ఆనందాన్ని, జ్ఞానాన్ని కూడా మనకు అనుగ్రహిస్తుంది. బైబిల్లో కీర్తనలు 119:92వ వచనములో చెప్పబడినట్లుగానే, "నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని యెడల నా శ్రమయందు నేను నశించియుందును,'' ప్రకారం దేవుని వాక్యము మనకు సంతోషమును కలిగిస్తుంది. మరియు కీర్తనలు 119:99వ వచనములో చూచినట్లయితే, "నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేష జ్ఞానము కలదు.'' ఎందుకు? ఎందుకంటే, నేను దాని గురించి ఎంత ఎక్కువగా ధ్యానిస్తానో, నా అవగాహన అంతగా ఎక్కువగా పెరుగుతుంది. అవును, నా ప్రియులారా, దేవుని వాక్యమును మనము ఎక్కువగా ధ్యానించినప్పుడు మనకు విశేషమైన జ్ఞానము కలుగుతుంది.
నా ప్రియులారా, బైబిల్లో చూచినట్లయితే, కీర్తనలు 119:107వ వచనము నుండి ఇంకొక చక్కటి వచనాన్ని ఉదహరించబడినది. అది ఇలాగున చెబుతుంది, "యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రదికింపుము'' అవును! ఓహ్, దేవుని వాక్యం గొప్ప ఉజ్జీవమును కలుగజేస్తుంది. ఇంకను మీ ప్రాణాత్మక మరియు దేహములో పునరుజ్జీవనాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి, నా ప్రియమైన స్నేహితులారా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం ఎంతోప్రాముఖ్యమైనది. మరియు మీ శరీరమునకు ఆరోగ్యమును కలుగజేస్తుంది. ఆ వాక్యము మీకు ఆరోగ్యం, శాంతి, జ్ఞానం మరియు ఆనందాన్ని తీసుకొనివస్తుంది. కనుకనే, నేడు మీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకొనండి. మీకు మీ స్వంత బైబిల్ ఉన్నదా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడానికి మీరు ఎంత సమయమును కేటాయించుచున్నారు? ప్రభువు మీలో ప్రతి ఒక్కరి గమనించుచున్నాడు.
నా ప్రియులారా, మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుచున్నట్లయితే, ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు మరియు మీరు ఎంతోధన్యమై న జీవితాన్ని గడుపుతారు! మరియు మీరు చదువుటకు ఇంకా ప్రారంభించక పోయినట్లయితే, ఈరోజే చదువుటకు ప్రారంభించండి. ఇది మీరు కొత్త పేజీని తిప్పే రోజుగా భావించండి. నా ప్రియులారా, ఈరోజు నుండి మీరు ప్రభువు యొక్క జీవముగల దేవుని వాక్యం చదువుట ద్వారా మంచి ఆరోగ్యం, శాంతి మరియు ఆనందాన్ని పొందుకొందురు గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నీ వాక్కును బట్టి నీకు వందనాలు. దేవా, మా జీవితాలను ఒకసారి పరిశీలించి చూడుము. ప్రభువా, నీ వాక్యము వలన అత్యధికమైన మేలులను మేము పొందుకొనునట్లుగా మాకు కృపను దయచేయుము. ప్రభువా, నీ వాక్యమును ప్రతిరోజు చదువుటకు మా హృదయములో మాకు ఆసక్తిని కలుగజేయుము. ప్రభువా, నీ యొక్క దయగల, సజీవమైన, శక్తివంతమైన మరియు చురుకైన నీ వాక్యం యొక్క వరములకై మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, ఈ రోజు, మేము మా హృదయాన్ని తెరిచి, నీ స్వరానికి మా చెవులను నీవైపునకు త్రిప్పుచున్నాము. ప్రభువా, నీ మాటలను మా హృదయంలో లోతుగా దాచుకోవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము రొట్టె ద్వారా మాత్రమే జీవించాలని కోరుకొనకుండా, నీ నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మేము జీవించాలనుకుని నిర్ణయించుకున్నాము. ప్రభువా, నీ వాక్యం మా పాదములకు దీపంగా మరియు మా మార్గానికి వెలుగుగా ఉండనట్లుగా చేసి, ఆ వాక్యము మమ్మును నడిపించునట్లుగాను, మమ్మును బలపరచునట్లుగాను మరియు మమ్మును ఆనందంతో నింపునట్లుగా చేయుము. దేవా, నీ వాక్యం మా శరీరానికి స్వస్థతను, మా మనసుకు శాంతిని మరియు మా ఆత్మకు జ్ఞానాన్ని తీసుకొని వచ్చునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, దయచేసి నీ వాక్యాన్ని ప్రతిరోజు చదవడానికి మాకు క్రమశిక్షణ మరియు ఆకలిదప్పులను దయచేయుము. తద్వారా మా జీవితాన్ని ఫలవంతం చేసి, ఆశీర్వదించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.