నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 92:12వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఈ చక్కటి వాగ్దానమును ప్రభువు మన కొరకు అనుగ్రహించియున్నాడు. ఆ వచనము, "నీతిమంతులు ఖర్జూర వృక్షమువలె మొవ్వ వేయుదురు లెబానోను మీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు'' ప్రకారం మనము ఎల్లప్పుడు ఆయనలో ఎదగాలని ప్రభువు మన పట్ల కోరుకుంటున్నాడు. ఒక నీతిమంతుడు ఖర్జూర వృక్షమువలెను మరియు దేవదారు వృక్షమువలెను కనబడతారు అని కీర్తనాకారుడైన దావీదు వ్రాసియున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? అని మనము చూచినట్లయితే, ఎప్పుడైతే, నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు మనపై ప్రకాశిస్తాడో, అప్పుడు మనము ఆయనలో ఎదిగి వర్థిల్లుతూ ఉంటాము. మనము ఖర్జూరపు చెట్టును చూచినట్లయితే, అది అనేక ఉపయోగకరమైన విషయాలను మనకు అనుగ్రహిస్తుంది. అది చూడటానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఇంకను బైబిల్ నుండి పరమగీతములలో, 'నీ ఎత్తు ఖర్జూరపు చెట్టు వలె ఉన్నదని' సొలొమోను రాజు వర్ణించియున్నాడు. అనేక రకములైన ఖర్జూరపు చెట్లు ఉంటాయి. ఇశ్రాయేలు దేశమునకు మనము వెళ్లి చూచినట్లయితే, రోడ్డుకు ఇరుప్రక్కల అనేక ఖర్జూర చెట్లు నాటుతారు. అది ఎంతో అందంగా కనబడుతుంది. ఖర్జూరపు చెట్టు నుండి ఖర్జూరపు కాయలు క్రిందకు పడినప్పుడు, మనము అక్కడికి వెళ్లినప్పుడు, వాటిని తీసుకొని మనము తినవచ్చును. ఖర్జూరపు చెట్లు ఎంతో అందంగా కనబడతాయి. ఖర్జూరపు చెట్టు ఆకర్షణీయమైనది మాత్రమే కాకుండా, అర్థవంతమైనదిగా కూడా ఉంటుంది.
నా ప్రియులారా, అందుకనే, బైబిల్‌లో 1 రాజులు 6:29వ వచనమును చూచినట్లయితే, "మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపల నేమి వెలుపల నేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను'' ప్రకారం సొలొమోను మందిరపు గోడల లోపలను మరియు వెలుపలను ఖర్జూరపు వృక్షములను చెక్కించెను. ఖర్జూరపు వృక్షములు సంపదను కూడా సూచిస్తాయి. ఈ చెట్టు ఎన్నో ఉపయోగకరమైన విషయాలను అది మనకు ఇస్తుంది. ఖర్జూరపు పండ్లను మనకు ఇచ్చుచున్నది. ఇంకను పీచు, నార పదార్థములను మరియు భవమునముల నిర్మాణములకు అవసరమైన వస్తువులను మనకు ఇచ్చుచున్నది. మందులు తయారీలో కూడా ఉపయోగపడతాయి. ఎన్నో ఉపయోగకరమైన వస్తువులను అవి మనకు ఇస్తాయి. మట్టలాదివారపు దినమున శత్రువుపై విజయమును సూచిస్తూ, ఖర్జూరపు మట్టలను ్రకైస్తవులు ఉపయోగిస్తారు. యేసుక్రీస్తు యొక్క విజయోత్సవమైన ప్రవేశమును వేడుకగా జరుపుకుంటారు. అందుకనే, 'నీవు ఖర్జూరపు వృక్షమువలె వర్థిల్లుతారు' అని వ్రాయబడియున్నది.
సాధారణముగా, ఒక దేవదారు వృక్షము యొక్క గొప్పతనము ఏమిటి? దాని వేర్లు ఎంతో లోతుగా ఎదుగుతాయి. అందుకే అది 50 అడుగుల కంటె ఎక్కువ వెడల్పుగా వ్యాప్తిచెందుతుంది. ఇంకను 120 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుగా అది ఎదుగుతుంది. అది ఎంతో ఎత్తుగాను, బలంగాను ఉంటుంది. అందుకే ఇది అన్ని చెట్లుకంటె రాజుగా పిలువబడుతుంది. ఆలాగుననే, నా ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము ఈ చెట్టు వలె పిలువబడుచున్నాము. మనము కూడా దేవుని యొక్క సత్యములో నాటబడియున్నాము. అందుకే బైబిల్ నుండి యెషయా 65:22వ వచనములో చూచినట్లయితే, "వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతయగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు'' ప్రకారం, 'వృక్షాయుష్యమంత నా జనుల ఆయుష్షు అగును' అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ చెట్లు వెయ్యి సంవత్సరములకంటె అధికముగా పెరుగుతాయి మరియు అవి ఎంతో ఎక్కువగా వర్థిల్లుతాయి. ఆలాగుననే, మీరు కూడా ఖర్జూర వృక్షమువలె మరియు దేవదారు వృక్షమువలె ఉంటారు అని దేవుడు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. నా ప్రియులారా, ఈ చెట్లువలె ప్రభువు మిమ్మును వర్థిల్లింపజేయును గాక. యేసుక్రీస్తు అంతగా మీరు ఎదురుగుదురు గాక. నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, నీలో మేము ఎదిగి ఫలించునట్లుగా చేస్తావని నీవు ఎంత అద్భుతమైన వాగ్దానమును మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు. ప్రభువా, మేము నేటి నుండి నీలో ఎదుగునట్లుగా నీ హస్తము మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, నీ గొప్పతనము మా మీదికి దిగివచ్చి, నీ చేతిలో వాడబడే ఆయుధముగా మేము ఉండునట్లుగా కృపను దయచేయుము. దేవా, నీ ఆత్మ వరములన్నిటితో మమ్మును నింపుము. ప్రభువా, మేము మంచి కార్యములన్నిటిని చేయుటకును, నీ కృప మా మీద కుమ్మరించబడునట్లుగా సహాయము చేయుము. దేవా, పరిశుద్ధాత్మ వరములన్నిటిని కలిగియుండుటకు యోగ్యులనుగా మమ్మును చేయుము, నీ హస్తములోనికి మమ్మును తీసుకొని, నీ మహిమార్ధమై మమ్మును వాడుకొనుము. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ వరములన్నియు మాలో పనిచేయుచునట్లుగాను, నీ తలాంతులను మరియు సంపదలను మాకు దయచేయుము. దేవా, నీ రాజ్యము కొరకు మమ్మును ఉపయోగించుకొనుటకు, నీ యొక్క నీతియందు మేము ఎదిగి ఫలించునట్లుగా కృపను మాకు దయచేయుము. దేవా, అందం, ఉపయోగం మరియు జయూత్సవంతో నిండిన ఖర్జూరపు చెట్టులా మేము వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. ప్రభువా, మా జీవితం ప్రతి ఋతువుల ప్రకారం ఫలించునట్లుగాను మరియు అనేకులకు ఆశీర్వాదంగా ఉండునట్లుగాను చేయుము. ప్రభువా, దేవదారు చెట్టువలె మేము లోతుగా వేరుపారునట్లుగా చేయుము. దేవా, మా విశ్వాసం నీలో బలంగా, కదలకుండా, నీ సత్యంలో సమృద్ధిగా ఎదుగునట్లుగా చేయుము. ప్రభువైన యేసయ్యా, నీతి సూర్యునివలె మా మీద ప్రకాశించుము. దేవా, దయచేసి మేము నీ కృపలో ఎత్తుగా నిలబడటానికి, నీ ప్రేమలో వర్ధిల్లడానికి మరియు నీలో సుదీర్ఘమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి మాకు అటువంటి కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.