నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మీతో మాట్లాడి, తన ఆనందముతో మిమ్మును నింపి, దీవించును గాక. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 14:26వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనములో, "ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆలాగుననే, బైబిల్ నుండి యోహాను 14:16వ వచనమును మనము చూచినట్లయితే, " నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును'' అని చెప్పబడినట్లుగానే, ఎల్లప్పుడు మనతో ఉండుట కొరకు మన పరలోకపు తండ్రి, వేరొక ఆదరణకర్తను మనకు అనుగ్రహించుచున్నాడు. మా కుటుంబములో ప్రభువు తన మహా కృపను బట్టి, మమ్మల్ని తన శక్తితో నింపియున్నాడు. ప్రారంభ దినములలో నా భర్తగారైన సహోదరులు డి.జి.యస్. దినకరన్‌గారు దేవుని శక్తితో నింపబడ్డారు. అంతమాత్రమే కాదు, యేసు పిలుచుచున్నాడు పరిచర్య కూడా ఆయనకు ఇవ్వబడినది. ఆ తర్వాత, కొంతకాలమునకు నేను దేవుని శక్తిని పొందుకున్నాను. ఆలాగుననే, ఒకరి తర్వాత, ఒకరము మా కుటుంబమంతయు దేవుని శక్తిని పొందుకున్నాము. ఈ రోజు కూడా మా యొక్క మనవ సంతానము అందరు కూడా దేవుని శక్తిని పొందుకొని అనుభవించుచున్నారు. తద్వారా, దేవుని శక్తిని పొందుకున్నప్పుడు, మేము ఎంతగానో సంతోషించియున్నాము. ఇంకను ప్రభువునందు ఆనందించుచున్నాము.

ఈ రోజున, మే నెల 21వ తారీఖున మా కుమార్తెను మేము పోగొట్టుకున్నాము. మా యొక్క ప్రశస్తమైన కుమార్తె అయిన ఏంజల్‌ను మేము కోల్పోయాము. ఒకరోజు మేము ఎంతో దుఃఖముతో ఉన్నప్పటికిని, యధావిధిగా, మేము ఉదయకాలపు ప్రార్థన చేయుటకు కూర్చుచున్నాము. మేము ప్రార్థించుచుండగా, ఆ రోజున ప్రభువు తన అధికమైన శక్తితో మమ్మును నింపుతూనే ఉన్నాడు. దుఃఖించడానికి బదులుగా మేము ప్రభువునందు ఆనందించాము. ఆ సమయములో, ఆయన మా మధ్యలోనికి వచ్చి, "నేను ఎల్లవేళల మీకు తోడుగా ఉన్నాను, మీరు దేనిని గురించి కూడా చింతించనక్కరలేదు, మీ కుమార్తె నాతో కూడా ఉన్నది. తద్వారా మీకు అనేకమంది పిల్లలను అనుగ్రహిస్తాను. నేను మీకు ముందుగా వెళ్లి, మిమ్మును ఎప్పుడు ఆనందింపజేస్తాను'' అని సెలవిచ్చియున్నాడు. ఆ తర్వాత, మేము ఎల్లప్పుడు, ఆనందించుచునే ఉన్నాము. ఆలాగుననే, వేలకొలదిమంది ప్రజలు, వారు కూడా తమ జీవితములలో ఆనందించియున్నారు. హల్లెలూయా!

అందుకే బైబిల్ నుండి యెషయా 40:29వ వచనములో మనము చూచినట్లయితే, "సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే'' అని చెప్పబడినట్లుగానే, అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు మీ ప్రియులను కోల్పోయి, ఎంతగానో దుఃఖించుచున్నారా? అయితే, మీరు దేవుని శక్తితో నింపబడండి. పరిశుద్ధాత్ముడు మీ హృదయమును బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క ఆనందముతో ప్రభువు మిమ్మును నింపుతాడు. దుఃఖానికి బదులుగా ప్రభువులో మీరు ఎప్పుడు ఆనందిస్తూ ఉండవచ్చు ను. మేము మా కుమార్తెను పోగొట్టుకున్న తర్వాత, అప్పటి నుండి ఇంతకాలము ప్రభువు మాకు అన్నిటిలో సమృద్ధిని మరియు ఇన్ని సంవత్సరములలో దేవుడు మాకు అనేకమంది పిల్లలను యేసు నామములో అనుగ్రహించియున్నాడు. ప్రభువు మిమ్మును కూడా తన శక్తితో నింపి, తన మహిమార్థమైన వాడుకొనును గాక. దుఃఖమునకు బదులుగా పరిశుద్ధాత్మ యొక్క ఆనందముతో మిమ్మును నింపును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
అమూల్యమైన మా ప్రేమగల తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క అద్భుత సన్నిధానమునకై నీకు వందనములు. ప్రభువా, నీ యొక్క శక్తి అంతటితో దిగివచ్చి, దుఃఖించుచున్న మా హృదయాలను నీ యొక్క పరిశుద్ధాత్మ ఆనందముతో నింపుము. ప్రభువా, మేము కోల్పోయిన వాటన్నిటిని గురించి చింతించకుండా, ఆనందించడానికి మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. దేవా, మా యొక్క దుఃఖమునకు బదులుగా మేము అన్నిటియందు ఆనందించునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, మా యొక్క ప్రతి దుఃఖ సమయంలో కూడా నీ ఆదరణనిచ్చు నీ సన్నిధిని మేము అనుభూతి చెందునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, మా బలహీనమైన హృదయాన్ని బలపరచి, మాలోని ప్రతి భయమును, భారాన్ని తొలగించుము. ప్రభువా, మా జీవితంలో నీ ఆనందం పొంగి ప్రవహించునట్లుగాను మరియు మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడునట్లుగా చేయుము. దేవా, అనేకమంది జీవితములకు నిరీక్షణను తీసుకురావడానికి మా బాధను ఒక సాక్ష్యంగా ఉపయోగించుము. ప్రభువా, మా దుఃఖాన్ని ఆనందంగా మార్చి, మేము కోల్పోయిన వాటన్నిటిని రెండంతలుగా తిరిగి పొందుకొనుటకు మాకు నీ కృపను అనుగ్రహించుమని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.