నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 60:3వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు'' ప్రకారం ఇది మీ కొరకు మరియు నా కొరకు ఇవ్వబడిన దేవుని వాగ్దాన వచనము. ఈ రోజున మా యొక్క వివాహ వార్షికోత్సవం గనుకనే, నేడు ఒక ప్రత్యేకమైన రోజు. దేవుడు, 36 సంవత్సరాలుగా నాతో కూడాను మరియు నా ప్రియ సతీమణి ఇవాంజెలిన్తో కూడా ఉన్నాడు మరియు దేవుని యందున్న విశ్వాసం ద్వారా ఆయన మా జీవితము పట్ల తన కృపను కొనసాగింపజేయుచున్నాడు. నేటి వరకు దేవుడు మా పట్ల కృపాసహితునిగా ఉన్నాడు. ప్రభువు కృపతో మమ్మల్ని హృదయంలోను, సేవాపరిచర్యలోను, కుటుంబంలోను మరియు ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుటలోను మమ్మును ఐక్యపరచి ఉంచాడు. ఇంకను మా నిమిత్తము మీ యొక్క ప్రేమను బట్టియు మరియు మీ యొక్క ప్రార్థనలను బట్టి మేము హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ఈ విధంగా, మమ్మును ఐక్యంగా సమకూర్చడానికి దేవుని యొద్ద నుండి నడిపింపును పొందియున్న మా తల్లిదండ్రులను నేడు మేము ఘనపరచుచున్నాము. నిజంగా, వారి యొక్క నీతిమార్గం మా కుటుంబ జీవితానికి స్థిరమైన పునాదిగా నిర్మించబడియున్నది. మరియు ఈ రోజు, మా తర్వాత రెండు తరాలు యేసుతో నడుస్తున్నందున, మేము అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాము. ఇంకను మా తాతగారితో కలిపి, ఇప్పటికిని మేము ఐదు తరాలుగా ప్రభువును అనుసరిస్తున్నందున మేము దేవునికి వందనాలు చెల్లించుచున్నాము. దేవుడు మా పట్ల ఎంతో కృపాసహితునిగా ఉన్నాడు. కనుకనే, ప్రభువు యందు మేము నిత్యము ఆనందించుచున్నాము. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, యెషయా 60:1వ వచనములో బైబిల్ ఏమని ప్రకటించుచున్నదగా, "నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను'' మరియు యెషయా 60:2వ వచనములో చూచినట్లయితే, " చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది'' ప్రకారం దేవుడు మా యొక్క కుటుంబ జీవితములో మాకు ఆయన మహిమగా ఉండియున్నాడు. దేవుని యొక్క మహిమ ఇశ్రాయేలీయుల సైన్యపు వెనుకటి భాగమునకు కావలి కాయుచు, వారిని వాగ్దాన భూమికి తీసుకొని వెళ్లినట్లుగానే, నేడు మనకు కూడా అలాగుననే జరిగిస్తాడు. అందుకే బైబిల్లో యోహాను 2:11వ వచనములో చూచినట్లయితే, " గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి'' ప్రకారం ప్రభువైన యేసు యొక్క మహిమ కానాలో జరిగించిన మొదటి అద్భుతం ద్వారా బయలుపరచబడినది. ఆయన నీటిని మధురమైన ద్రాక్షారస పానీయంగా మార్చిన అద్భుత కార్యము ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడినది. ముందు ఉన్న దానికంటె అత్యంత మధురమైన ద్రాక్షారసంగా మార్చబడినది. అవును, అదే దేవుని యొక్క మహిమ కుటుంబ సమేతముగా మమ్మును ఆవరించియున్నది. మా జీవితాలలో ఉన్న నీటినంతటిని కూడా మధురమైన ద్రాక్షరస పానీయముగా మార్చినది. ఎవరైనను రుచిచూచిన దానికంటె అతి శ్రేష్టమైనదిగా, పరిశుద్ధాత్మ ద్వారా మధురముగా మార్చబడిన దేవుని మహిమను బట్టి, దేవునికి వందనములు చెల్లించుచున్నాము.
బైబిల్ నుండి యెషయా 58:8వ వచనములో ఇలాగున చెబుతుంది, " నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును'' ప్రకారం దేవుడే స్వయముగా మీ వెనుక కవచం వలె ఉంటాడు. నా ప్రియులారా, మీ యొక్క పేరును, అభిషేకమును, దేవుని సన్నిధిని మీ జీవితాలలో భద్రపరచి ఉంచునట్లుగా మరియు మా యొక్క పేరును భద్రపరచునట్లుగా దేవుడు మన వెనుకటి భాగమును కావలి కాయును. అపవాదియు మరియు దుష్టప్రజలు మా పేరును పాడు చేయుటకు ఎంతగానో ప్రయత్నించినప్పటికిని, ప్రభువు మా యొక్క వెనుకటి భాగమును కావలి కాయువానివలె ఉన్నాడు. మా యొక్క పేరును తన బిడ్డలుగా ఆమోదించుకొనుచున్నాడు. మమ్మును ఆయన చిత్తమును జరిగించునట్లుగా మమ్మును తన సేవలో వాడుకొనుచున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదములను అనుభూతి చెంది ఆనందించునట్లుగా చేయుచున్నాడు.
నా ప్రియులారా, ఒకరి యొక్క కుటుంబం ఆశీర్వదింపబడినప్పుడు, కేవలం అది ఒక వ్యక్తిగత విజయం కాదు; అది దేశానికి ఒక ఆశీర్వాదంగా మారుతుంది. ఒక దైవిక కుటుంబం యొక్క ఐక్యత మరియు సాక్ష్యం ద్వారా యేసు యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. తద్వారా, కుటుంబ ఆశీర్వాదము, జీవము, పేరు, యేసు ఆశీర్వాదము కొరకై దేశమునకు ద్వారము తెరువజేయుబడుతుంది. ఆలాగుననే, నేటి వాగ్దాన వచనముగా యెషయా 60:3 ప్రకారం నెరవేరునట్లుగా మీ కుటుంబము ద్వారా వెలుగు ఉదయిస్తుండగా, రాజులు అట్టి ఉదయకాంతికి వచ్చెదరు. దేవుడు ఇట్టి కుటుంబ ఆశీర్వాదము చేత అదే మహిమ మరియు ఐక్యతతో మీ కుటుంబమును కూడా దీవించును గాక. మిమ్మును ఐశ్వర్యవంతముగా ఘనపరచును గాక. మిమ్మును మీ దేశానికి వెలుగుగా చేయును గాక, ఇప్పుడును మరియు ఎల్లప్పుడు మీ పేరును ఆయన తన వెనుక కాపలాగా ఉంచును గాక. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహిమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నేటి వాగ్దానము ద్వారా జనములు వెలుగులోకి వచ్చునట్లుగాను, మా ఉదయకాంతికి రాజులు వచ్చునట్లుగా నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ప్రభువా, నీ మహిమ మా కుటుంబము మీద పరిపాలన చేయునట్లు చేయుము. దేవా, నీ మహిమ మమ్మును మరియు మా కుటుంబమును భద్రపరచి, మా వెనుక కావలి కాయునట్లుగా చేయుము. దేవా, మా ఇంటిపై మరియు మా తరంలోని ప్రతి ఒక్కరిపై నీ మహిమ ఉదయించునట్లుగా చేయుము. యేసయ్యా, నీ ప్రేమలో మా కుటుంబాన్ని ఐక్యపరచుము. దేవా, నీ యొక్క నీతి, శాంతి మరియు ఉద్దేశ్యంలో మమ్మల్ని స్థిరపరచుము. ప్రభువా, క్రీస్తు వెలుగు మాలో ప్రకాశించునట్లుగా చేయుము, అది అలసిపోయిన, కోల్పోయిన మరియు విరిగిపోయిన వారిని నీ కృప వైపు ఆకర్షించునట్లుగా చేయుము. ఓ ప్రభువా, మా వెనుకటి భాగమున కాపలా కాయుము, మా పేర్లను, మా పిలుపును మరియు నీతో మా నడకను కాపాడుము. దేవా, మా యొక్క ప్రతి ఎండిన ప్రాంతమును సమృద్ధిగా మార్చుము. యేసయ్యా, మా కుటుంబ మరియు వ్యక్తిగత జీవితములో ప్రతి శోధనను మరియు సాక్ష్యంగా మార్చుము. ప్రభువా, మా కుటుంబం నీ సన్నిధి యొక్క ప్రకాశంతో ప్రకాశింపజేయుము మరియు నీ పరిశుద్ధాత్మ యొక్క మాధుర్యాన్ని ఎల్లప్పుడూ ప్రతిబింబించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు మధురమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.