నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు దేవుని వాక్యమునుండి ఒక అద్భుతమైన వాగ్దానమును మనము ధ్యానించబోవుచున్నాము. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కొలొస్సయులకు 1:27 వ వచనమును మనము చదువుదాము. ఆ వచనము, "...మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడు...'' ప్రకారం దావీదు తన జీవితములో ఈ మహిమను అనుభవించియున్నాడు. మనము బైబిల్ నుండి కీర్తనలు 3:3వ వచనమును చదివినట్లయితే, ఈ విధంగా వ్రాయబడియున్నది, "యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు '' ప్రకారం దావీదు తన జీవితములో ఇంతటి గొప్ప అనుభవమును అనుభవించియున్నాడు. ఇంకను కీర్తనలు 8:5వ వచనమును చూచినట్లయితే, "దేవునికంటె వానిని కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసియున్నావు'' ప్రకారం మనలను కూడా దేవుడు తన యొక్క మహిమా ప్రభావములతో కిరీటమును ధరింపజేస్తాడు.

అయితే, నా ప్రియులారా, మీరు ఈ మహిమా కిరీటములను ఎప్పుడు ధరించుకుంటారు? బైబిల్ నుండి కీర్తనలు 50:23 మరియు 69:30 వ వచనములను మనము చూచినట్లయితే, "స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను మరియు కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతా స్తుతులతో నేనాయనను ఘనపరచెదను'' ప్రకారం దేవునికి స్తుతులు అర్పించబడినప్పుడు, మీరు మహిమతో నింపబడుదురు. మీరు దేవుని మహిమతో నింపబడినప్పుడు ఏమి జరుగుతుంది? బైబిల్ నుండి యెషయా 60:1-2వ వచనములలో చూచినట్లయితే, "నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, యెహోవా మహిమ మీ మీద ఉదయించునని సెలవియ్యబడియున్నది. కనుకనే, ప్రభువునందు ఆనందించండి.

నా ప్రియ స్నేహితులారా, కనుకనే, ఇంతటి గొప్ప అనుభవమును పొందుకోవాలంటే, మీ సమయమును దేవుని పాదాల సన్నిధిలో ఎలా గడుపుచున్నారు? దేవుని పాద సన్నిధిలో మీ సమయమును గడపనంత వరకు మీరు ఈ మహిమను అనుభవించలేరు. అయితే, మీరు ఈ మహిమను పొందుకున్నప్పుడు, మీ జీవితములో ఏమి జరుగుతుంది? బైబిల్ నుండి యెషయా 61:3వ వచనములో చూచినట్లయితే, "యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును'' ప్రకారం మీరు నీతియను మస్తకి వృక్షములనియు పిలువబడెదరు. మరియు 1 పేతురు 4:14వ వచనములో చూచినట్లయితే, "క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన యెడల మహిమా స్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు'' అని చెప్పబడిన ప్రకారం మహిమా స్వరూపియైన దేవుని ఆత్మ, మీ మీద నిలుచును. అవును నా ప్రియులారా, దేవుని మహిమతో మీరు నింపబడినప్పుడు, ఆయన మహిమార్థమై మీరు ప్రకాశించెదరు. ఆయన యొక్క దైవీకమైన సమాధానముతో మీరు నింపబడెదరు. ఇంకను మిమ్మును ఈ రోజంతా ప్రతి క్షణము ఆయనే మీకు ముందు వెళ్లుచూ, మిమ్మును నడిపిస్తాడు. నా ప్రియ స్నేహితులారా, మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడా? ఆలాగున లేనట్లయితే, ఇప్పుడే, మిమ్మును మీరు దేవుని సన్నిధిలో తగ్గించుకొని, 'ప్రభువా, ఇటువంటి మహిమా స్వరూపముతో మమ్మును నింపుమని' ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా, దేవుని యొక్క మహిమా ప్రభావములతో మిమ్మును నింపి, తన మహిమతో మిమ్మును కిరీటమును ధరింపజేసి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు మాలో నివసిస్తున్నాడనే మహిమాన్విత సత్యానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, ఇటువంటి గొప్ప అద్భుతమైన అనుభవమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, మేము చదివిన వాక్యము ద్వారా మేము ఇటువంటి అనుభవమును పొందుకొనునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. దేవా, మేము నీ మహిమార్థమై ప్రకాశించునట్లుగాను మా హృదయాలను, మా జీవితాలను నీ సన్నిధితో తాకి, నీ మహిమ, ప్రభావములతో మమ్మును నింపుము. ప్రభువా, ఇప్పుడు కూడా, మేము నిన్ను హృదయపూర్వకంగా స్తుతిస్తూ, వెదకుచున్నప్పుడు, నీ దైవిక సన్నిధితో మమ్మును నింపుము. దేవా, నీ మహిమ యొక్క ఆత్మ మా మీద నిలిచి, మా జీవితం నుండి చీకటి ఛాయలను తొలగించుము. ప్రభువా, నీ మహిమ మా మీద లేచి ప్రకాశింపజేస్తుందనియు మరియు నీ మహిమ మా మీదికి దిగివచ్చియున్నదని మేము నమ్ముచున్నాము. దేవా, నీ మహిమ మరియు ప్రభావములతో మమ్మును కిరీటం ధరింపజేయుము. ప్రభువా, ఇంకను తద్వారా మేము నీతియను మస్తకి వృక్షంగా నీలో లోతుగా పాతుకుపోగలుగునట్లుగా చేయుము. ప్రభువా, మేము ప్రతిరోజు నీ పాదాల వద్ద నివసించి, నీ సన్నిధి మరియు ఉద్దేశ్యాన్ని ప్రసరింపజేయాలని కోరుకొనుచున్నాము. దేవా, దావీదు వలె నీ సన్నిధి ద్వారా మేము ఒక ఉన్నత అనుభవమును పొందుకొనునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.