నా ప్రియ స్నేహితులారా, మీరు ప్రతిరోజు ప్రభువుతో కలిసి నడుస్తున్నందుకు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఈ రోజు కూడా, ఆయన మీ పట్ల ఒక ప్రత్యేకమైన వాగ్దానమును కలిగియున్నాడు. అందుకే నేటి వాగ్దాన వచనముగా బైబిల్ నుండి కీర్తనలు 145:18వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "తనకు మొఱ్ఱపెట్టు వారికందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.'' అవును, ఇది ఎంత ఆదరణ పూరితమైన వాగ్దానము కదా! నా ప్రియులారా, దేవుడు మీకు దూరంగా లేడు. మీరు విశ్వాసంతో ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు, ఆయన మీకు సమీపముగాను, మీ ప్రక్కనే ఉంటాడు. కనుకనే, నేడు మీ హృదయం భారముతో నిండి ఉన్నప్పుడు, మీ కళ్లలో కన్నీళ్లు ప్రవహించుచున్నప్పుడు మరియు మీ బలం క్షీణించిపోయినప్పుడు, మీ మొర ఆలకించడానికి ప్రభువు మీకు యొద్దకు దిగివస్తాడు మరియు ఆయన మీ ప్రక్కనే ఉంటాడు. నేడు మీరు మీ బాధలలో మరియు మీ వేదనలలో కూడా, మీ మొఱ్ఱను వినడానికి మరెవరూ లేరని మీరు భావించినప్పుడు కూడా ఆయన మీకు సమీపముగా ఉంటాడు. ఒకవేళ నేడు మీరు విడువబడిన స్థితిలో ఉన్నప్పుడు, ప్రభువు ఇలా అంటున్నాడు, 'నేను మీకు సమీపముగా ఉన్నాను.' కారణము, ఆయన మీకు దూరమున ఉండు దేవుడు కాదు; ఆయన ప్రేమతో మిమ్మును హత్తుకొని, ఎన్నటికిని విడిచిపెట్టని ప్రేమామయుడైన తండ్రిగా మీ ప్రక్కనే ఉన్నాడు.

మా కుటుంబములో ఒక సంఘటన నాకు గుర్తుంది - మా పిల్లలు ఏడుస్తున్నప్పుడు నా భార్య ఎలా స్పందించేదో చూసిన ప్రతిసారి ఆశ్చర్యపోతాను. మా కుమారుడు లేదా కుమార్తె మెల్లగా ఏడ్చినా, ఆమె అన్నింటిని విడిచిపెట్టి వారి దగ్గరికి పరుగెత్తి వెళ్లిపోయేది. తల్లి తన బిడ్డ ఏడుపును తట్టుకోలేదు. ఆలాగుననే, చిన్న పిల్లల యొక్క ఏడుపును చూచిన ఆమె అన్నిటిని మర్చిపోతుంది, ఆమెలో తన బిడ్డను ఓదార్చటం తనకున్న ఒక్కటే లక్ష్యం. ఇలాంటి ప్రేమను ప్రభువు మన పట్ల చూపుచున్నాడు. నా ప్రియులారా, నేడు మీరు ఆయనను పిలిచిన తక్షణమే, ఆయన మీ వైపు పరుగెత్తుకుంటూ వస్తాడు. ఆయన ఆలస్యం చేయడు. ఆయన మీ సమీపముగా వస్తాడు, అంతమాత్రమే కాదు మిమ్మును ఓదార్చుతాడు మరియు మీ మొఱ్ఱలకు జవాబును మరియు సమాధానమును ఇస్తాడు. అనేకమంది, కేవలం సమస్యలలో ఉన్నప్పుడు మరియు ప్రతి ద్వారము మూయబడినట్లుగా అనిపించినప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారు. కానీ, దేవుడు మనలను ఆయనతో కూడ లోతుగా సంబంధం కలిగి జీవించాలని ఆహ్వానించుచున్నాడు. కేవలం ఆపత్కాలములో కాదు, ప్రతిరోజు కూడా, యథార్థతగా, విశ్వాసపూర్వకంగా ఆయనకు మొఱ్ఱపెట్టమని మీ పట్ల కోరుచున్నాడు. అదే నిజమైన విశ్వాసయాత్ర. బైబిల్ నుండి యాకోబు 4:8వ వచనములో చూచినట్లయితే, " దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును...'' అని వ్రాయబడినట్లుగానే, నేడు మీరు ఉన్న పక్షమున దేవునికి యొద్దకు రండి, అప్పుడు ఆయన కూడా మీ యొద్దకు వస్తాడు. మీ మనస్సు యథార్థతతో నింపబడినపుడు, మీ ఆత్మ ఆయన కొరకు తృష్ణగొనినప్పుడు, ఆయన ఇదివరకు ఎన్నడు లేనివిధంగా, ఇంకను ఆయన అత్యధికముగా మీకు సమీపముగా మీ యొద్దకు వస్తాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

అవును, నా ప్రియులారా, మనం ఎల్లప్పుడు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఆయన సాన్నిహిత్యం మన బలం అవుతుంది. దానియేలు అనుదినము మూడుసార్లు ప్రార్థించాడు, అతను కష్టాలలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, అనుదినము ఒక అలవాటుగా అనుసరించాడు. అతను ప్రభువును ఎంతో లోతుగా ప్రేమించాడు. ఇంకను ఆయనను ఎంతో జాగ్రత్తగా వెదికాడు. కనుకనే, సింహాల గుహలో కూడా దేవుని సన్నిధి దానియేలును చుట్టుముట్టింది. దేవునితో సమీపముగా నడిచే వారి రహస్యం ఇదియే. వారు ప్రతిరోజు ఆయన సన్నిధిని, ఆయన జవాబులను మరియు ఆయన కటాక్షమును అనుభవిస్తారు. కుటుంబ ప్రార్థనలో నేను దీనిని అనేకసార్లు వ్యక్తిగతంగా అనుభవించాను. మేము అందరు కలిసి ప్రార్థించుచున్నప్పుడు, మేము 'ఆమేన్' అని చెప్పకముందే, ఫోన్ కాల్ ద్వారా, సందేశం ద్వారా లేదా తలుపు వద్ద ఎవరైనా శుభవార్త చెప్పడం ద్వారా జవాబును పొందుకున్న సందర్భాలు ఎన్నో కలవు. అవును, మన ప్రభువు మనకు అంత సమీపముగా ఉన్నాడు! తనను నిజంగా మొఱ్ఱపెట్టే తన పిల్లలకు సమీపముగా ఉండడానికి ఆయన ఆనందిస్తాడు. అవును, నా ప్రియులారా, ఈ రోజు, ప్రభువు మీకు సమీపముగా ఉండాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. కనుకనే, మీరు ఒంటరి వారు కాదు. మీరు ఆయనను చూడలేకపోయినా, ఆయన మీ పక్కనే ఉన్నాడు, మీరు ఊహించిన దానికంటే అత్యధికముగా మీకు జవాబు ఇవ్వడానికి మరియు మిమ్మును ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి, నా ప్రియులారా, నేడు మీ ప్రార్థనలకు జవాబు రాలేదు, దేవుడు మమ్మును విడిచి దూరముగా ఉన్నాడని చింతించుచున్నారా? అయితే, దిగులుపడకండి. మీరు ఆయనకు మొఱ్ఱపెట్టండి, నిశ్చయముగా ఆయన మీ ప్రార్థనలకు జవాబుగా మీ యొద్దకు వచ్చి, మీ ప్రక్కనే నిలిచి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా ఆశీర్వదిస్తాడు.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ మాకు సమీపముగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మా మొఱ్ఱలను మరియు నిట్టూర్పులు విన్నందుకై నీకు కృతజ్ఞతలు. దేవా, ప్రతిరోజు నీ కొరకు దాహం గల హృదయాన్ని మాకు దయచేయుము. ప్రభువా, కష్టాలలోనే కాకుండా ప్రేమలో కూడా నిన్ను వెదకడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును నీ యొద్దకు వచ్చునట్లుగాను మరియు మేము ఎప్పుడు కూడా నిన్ను విడిచి దూరంగా వెళ్ళకుండా నీకు సమీపముగా ఉండే కృపను మాకు దయచేయుము. దేవా, నీ సన్నిధి మా ఇంటిని మరియు మా హృదయాన్ని నింపునట్లుగా సహాయము చేయుము. యేసయ్యా, మేము మాట్లాడటం పూర్తి చేయకముందే మా ప్రార్థనలకు జవాబును దయచేయుము. దేవా, మేము ఎల్లప్పుడు నిన్ను విశ్వసించునట్లుగాను మా జీవితంలో అద్భుతాలు జరిగించుము. ప్రభువా, మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నను సరే, నీకు నిజముగా మొఱ్ఱపెట్టడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, ఈ రోజు మాకు శుభవార్త మరియు వర్థిల్లతను పొందుకొనునట్లుగా మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయుము. ప్రభువా, నీవు మా యొద్దకు వచ్చునట్లుగా మేము నీకు సమీపముగా వచ్చుటకు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.