నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీకందరికి నా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 11:1వ వచనమును నేడు మన కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, "యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును'' అని చెప్పబడినట్లుగానే, యెష్షయి అనగా, దావీదు యొక్క తండ్రి. బబులోను చెర తర్వాత, పడిపోయినటువంటి దావీదు యొక్క రాజరికపు వంశావళిని ఇక్కడ మొద్దు అని సూచిస్తున్నట్లుగా మనము చూడగలుగుచున్నాము. మొద్దు అనగా చనిపోయిన వాటిని సూచించుచున్నదని అర్థము. అయితే, చనిపోయినవాటిలో నుండి జీవమును తీసుకొనిరాగల శక్తిగలవాడు మన దేవుడు. అనేక తరములైన తర్వాత, ఒక పాకలో యేసయ్య మరియకు జన్మించియున్నాడు. యేసయ్య, జీవమును మరియు సమృద్ధిగల జీవమును ఇవ్వడాని కొరకు ఈ లోకములోనికి వచ్చియున్నాడు. యెష్షయి మొద్దు నుండి వచ్చినటువంటి అనేక సంవత్సరాలు వేచియున్నటువంటి చిగురు యేసుప్రభువై యున్నాడు. దావీదు యొక్క రాజరికపు వంశావళి తగ్గిపోతూ వచ్చినది. అయితే, దేవుడు మరల యేసయ్యకు దావీదు యొక్క సింహాసనమును ఇచ్చియున్నాడు.
యేసు ప్రభువు ఈ లోకమునకు జీవమును ఏ విధముగా తీసుకొని వచ్చియున్నాడు అని మనము చూచినట్లయితే, చిగురైనటువంటి, మెస్సీయ సిలువపై వ్రేలాడియున్నాడు. సమస్త లోక పాపమును ఆయన సిలువలో కొట్టి వేసియున్నాడు. పాపము యొక్క జీతము మరణము అని బైబిల్ గ్రంథము మనకు తెలియజేయుచున్నది. అయితే, మరణమైన వాటి నుండి జీవమును తీసుకొని వచ్చియున్నాడు నా ప్రియ స్నేహితులారా. మొద్దు ఒక కొమ్మగా మారియున్నది. ఆయన ఫలించియున్నాడు. ఫలము యేసు యొక్క రూపాంతరపరచు పరిచర్యను మనకు సూచించుచున్నది. ఎండిపోయినటువంటి దావీదు యొక్క మొద్దు నుండి చిగురు వచ్చి, కొమ్మలు వచ్చి, ఆకులు వలన సమస్త దేశములకు స్వస్థతను చేకూర్చు విధముగా, దేవుడు జీవింపజేసి యున్నాడు. మొద్దు నుండి చిగురు రావడము అనగా, మనకు శారీరక దృష్టితో ఒక పరిస్థితి మృతమై పోయినట్టుగా మనకు కనిపించవచ్చును. కానీ, అటువంటి పరిస్థితిలో నుండి జీవమును తీసుకొని రాగలడు. నా ప్రియులారా, మీ జీవితము ప్రస్తుతము ఎలాగున కనిపించినప్పటికిని, మీరు ఇంకను జీవమును పొందగలరు. కనుకనే, మీరు దేనిని గురించి నిరాశ చెందకండి. ఎప్పుడు విడిచిపెట్టకండి, నాకు విడుదల కలిగించే మార్గము లేదు అని మీరు అనుకుంటున్నారేమో? శత్రువు గెలిచియున్నాడని భావించుచున్నారేమో? కానీ, నా ప్రియ స్నేహితులారా, దేవుడు ఇంకను ముగించేయలేదు. ఆయన ఇంకను పనిచేయుచున్నాడు. మృతమైనటువంటి ప్రతి విషయమును ఆయన తిరిగి జీవింపజేయుచున్నాడు. మీ స్వస్థత సమృద్ధి జీవముతో మీ యొద్దకు రానైయున్నది. అది దేవుని వలన త్వరగా జరుగును అని బైబిల్ గ్రంథము అంటున్నది. అంతా ముగిసిపోయి ఉన్నది అని మీరు ఎన్నడును అనకండి. దేవుడు ఇంకను మీ జీవితములో పని చేయుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, అందుకొరకే యేసయ్య ఈ లోకములోనికి వచ్చియున్నాడు.
మీ యొక్క ప్రోత్సాహము నిమిత్తమై ఒక సాక్ష్యమును మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. తిరుపూర్ పట్టణము నుండి సహోదరులు సెల్వరాజ్ మరియు తన భార్యయైనటువంటి అన్నాళ్ వళ్లియమ్మాల్ అను వారు తమ యొక్క సాక్ష్యమును ఈ విధముగా పంచుకొనియున్నారు. 2018వ సంవత్సరములో సహోదరి అన్నాళ్ వళ్లియమ్మాల్ తీవ్రమైన గుండె నొప్పి కలిగియుండెను. వారు ఒక ప్రవైటు హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు, తన గుండెలో రక్తము స్రవించుచున్నది మరియు మీకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. అయితే, ఈ ఆపరేషన్ చేసినా కూడా మీరు బ్రతుకుతారో, లేదో అని మేము ఖచ్చితముగా చెప్పలేము అని వైద్యులు తెలియజేసియున్నారు. కానీ, కొన్ని నెలల మాత్రమే ఆమె బ్రతకగలదు అని వారు నిర్థారించి చెప్పారు. ఆ మాటలు విన్న వారు ఎంతగానో నిరుత్సాహము పొందిన వారి హృదయము బ్రద్ధలైపోయినది. ఇప్పుడు వారు మరొక హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ కూడా వారు నిరీక్షణ ఇవ్వలేకపోయారు. కానీ 8 లక్షలు మీరు ఖర్చు పెట్టాలి అని చెప్పారు. భయముతో ఆ సహోదరి కేవలము 6 సంవత్సరములు మందులు వేసుకుంటూ ఆలాగనే గడిపారు. అనేకమైన ఆరా«ధన స్థలములకు వారు వెళ్లుతూ ఉండేవారు. అయితే, ఎవ్వరు కూడా ఆమెకు సహాయము చేయలేకపోయారు. ఒకసారి ఆమె తన స్నేహితురాలిని కలుసుకున్నారు. తాను, నీవెందుకు బేతెస్ద ప్రార్థన గోపురమునకు వెళ్లకూడదు అని ఆ సహోదరి చెప్పియున్నారు. ఆమె అక్కడికి వెళ్లినప్పుడు, ఒక ప్రార్థన యోధురాలు ఆమె కొరకు ఎంతో భావముతో ప్రార్థన చేశారు. ఆ తర్వాత వారు హాస్పిటల్‌కు వెళ్లి, స్కాన్ తీసుకోవడము జరిగియున్నది. ఆశ్చర్యకరమైన రీతిలో లోపల ఉన్న వాపు నెమ్మది, నెమ్మదిగా కొంచెము తగ్గడము జరిగినది. వైద్యులు అది చూచి ఎంతగానో ఆశ్చర్యపోయారు. అస్సలు మీకు ఎటువంటి హాని లేదు అని వైద్యులు చివరిగా చెప్పారు. మీ భార్య ఇప్పుడు చక్కగా ఆరోగ్యముగా ఉన్నారు అని చెప్పారు. దేవుని కృపను బట్టి, ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఆ సహోదరి పరిపూర్ణంగా స్వస్థతను నొందారు. తన కుటుంబమంతయు ఇప్పుడు దీవించబడినది. వారు ప్రార్థన గోపురమునకు వచ్చి, ఎంతగానో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించారు. దేవునికే మహిమ కలుగును గాక. చెప్పనశక్యమైనటువంటి దేవుని బహుమానమైన యేసుక్రీస్తును బట్టి దేవునికి వందనాలు కలుగును గాక. చిగురైనటువంటి మెస్సీయ మనకు స్వస్థతను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క పునరుత్థానపు శక్తి ఈ రోజు మీ మీదికి దిగివచ్చును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మెస్సీయయైన యేసు, యెష్షయి వంశమైన మొద్దు నుండి వచ్చిన కొమ్మగా ఉన్న నీకు మేము కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. యేసయ్యా, నీ జననమును మేము సంబరముగా జరుపుకుంటున్న మాలో ఉన్న అస్వస్థతను తొలగించి, మమ్మును పునరుద్ధరీకరించుము. తండ్రీ, మాలోను మరియు మా ప్రియులలోను మృతమైనటువంటి ప్రతి అవయవములు యేసు నామమున తిరిగి పునరుద్ధరీకరించబడునట్లుగా చేయుము. దేవా, బలహీనమైన కనుదృష్టిని కలిగియున్న మమ్మును ఇప్పుడే, యేసు నామమున తాకి స్వస్థతను మరియు చూపును దయచేయుము. దేవా, మృతమైన ప్రతి అవయవము యేసు నామమున తిరిగి జీవింపబడునట్లుగా చేయుము. ప్రభువా, మా చేతులు, కాళ్లు ఇప్పుడే మరల పనిచేయునట్లుగా కృపను దయచేయుము. మా శరీరములో ఉన్న కష్టము అంతయు తొలగిపోయి, స్వస్థతను పొందుకొనునట్లుగాను మరియు సమృద్ధి జీవమును మాకు అనుగ్రహించుము. దేవా, మా ఎముకలు మరియు గుండె అన్నియు స్వస్థతను దయచేయుము. ప్రభువా, ఈ రోజు మా జీవితంలోనికి నీ పునరుత్థానపు శక్తి ప్రవహించునట్లుగా చేయుము. దేవా, దయచేసి మా విరిగిన హృదయాన్ని మరియు అలసిపోయిన ప్రాణమును పునరుద్ధరించుము. ప్రభువా, మా నిరాశ క్షణాలను మరోసారి నాట్యంగా మార్చుము. ప్రభువా, మమ్మును మరియు మా ప్రియులైన వారి యొక్క ప్రతి వ్యాధులను స్వస్థపరచుము. దేవా, మాలో ఉన్న కోరికను పునరుద్ధరించుము మరియు నీపై మా విశ్వాసాన్ని పునరుద్ధరించుము. ప్రభువా, నీ కృప మరియు స్వస్థత యొక్క ఫలం మాలో వికసించునట్లుగా చేయుము. దేవా, మా జీవితం నీ యొక్క శాశ్వతమైన ప్రేమకు సాక్ష్యంగా మారునట్లుగా కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు గొప్ప మహిమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


