నా ప్రశస్తమైన స్నేహితులారా, ఈ 2026వ సంవత్సరములో, దేవుడు మిమ్మును లేవనెత్తి మీరు మరల కట్టబడునట్లుగా చేయును గాక. దేవుడు మీ కొరకు సమస్తమును నిర్మిస్తాడు. అందుకే ఈ నూతన మాసములోనికి అడుగు పెట్టిన మీ కొరకు దేవుని వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 29:5వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు ఈ నూతన మాసములోను మరియు సంవత్సరములోను మీ కొరకు ఒక ఇంటిని కట్టించి, దాని ఫలములను అనుభవించునట్లుగా చేయుచున్నాడు. ఆలాగుననే, మరొక వాగ్దానముగా బైబిల్ నుండి 2 సమూయేలు 7:11 వ వచనములో ప్రభువు ఇలాగున అంటున్నాడు, "ఆయన మీ హృదయాన్ని తన నివాసంగా, మీ ఇంటిని తన గృహంగా మరియు మీ కుటుంబాన్ని తన మందిరముగా స్థాపించుచున్నాడు. ఆలాగుననే, బైబిల్‌లో భక్తుడు గృహమును ఈలాగున ఆశీర్వదించియున్నాడు. అది ఓబేదేదోమును, అతని ఇంటివారందరిని, అతనికి ఉన్న సమస్తమును దేవుడు ఆశీర్వదించినట్లుగానే, నేడు దేవుడు మీ ఇంటిని కూడా ఆశీర్వదిస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీకు ఒక మందిరమును స్థిరపరస్తాడని వాగ్దానము చేయుచున్నాడు. మొట్టమొదటగా, ఆయన మీ పిల్లలను స్థిరపరుస్తాడని బైబిల్‌లో 2 సమూయేలు 7:13వ వచనములో దేవుడు దావీదుతో తన కుమారుడైన సొలొమోను గురించి మాట్లాడినట్లుగా మనము చూడగలము, "అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను'' అని సెలవిచ్చినట్లుగానే, నేడు మీ పిల్లలు కూడా దేవుని మందిరమును నిర్మించడానికి రూపాంతరపరచబడతారు. వారి హృదయాలు దేవుని వైపు తిరుగుతాయి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వారి ఆత్మ దేవుని ఆత్మతో ఏకము చేయబడుతుంది. మరియు దేవుడు వారిని ఉన్నత స్థానములకు ఎక్కించి, వారిని ఆశీర్వదిస్తాడు. వారికి తండ్రిగా ఉంటాడు మరియు వారు ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను ఉంటారు. కనుకనే, మీరు దేనికిని భయపడకండి.
నా ప్రియులారా, దేవుడు ఎలాంటి ఇల్లు కడతాడు? ఆయన ఒక పునాది వేస్తాడు మరియు ఆ పునాది యేసు క్రీస్తు మాత్రమే. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 3:11వ వచనములో చూచినట్లయితే, ఆ పునాది ఎవరని మనము చూచినట్లయితే, పునాది యేసుక్రీస్తే అని చెప్పబడియున్నది. కాబట్టి, మీ ఇల్లు, మీ హృదయం, మీ జీవితం మరియు మీ కుటుంబం నిత్యము కదిలించబడలేవు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 16:8వ వచనములో దావీదు ఇలాగున అంటున్నాడు, " సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను'' మరియు కీర్తనలు 46:4,5వ వచనములలో చూచినట్లయితే, " ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు'' అని దావీదు అంటున్నాడు. కనుకనే, నా ప్రియులారా, మీరు దేవుని హృదయానికి ఆనందాన్ని కలిగించుచున్నారు. ఈ పరిచర్యలో భాగస్థులుగా ఉన్న మీ ద్వారా, వేలాది మంది దేవుని ఆలయాలుగా మారుచున్నారు మరియు పశ్చాత్తాపపడే ఒక్క పాపి విషయంలో పరలోకం కూడా సంతోషించుచున్నది. కాబట్టి, మీరు కదిలించబడరు.
ఒకసారి జపాన్‌లో ఒక గొప్ప భూకంపం సంభవించి, అనేక భవనాలు కూలిపోయాయి. కానీ, ఒక కోట కదలకుండా నిలిచింది. పరిశోధకులు దాని పునాదిని పరిశోధన చేసినప్పుడు, కోటలోని ఒక నమ్మకమైన సేవకుని యొక్క శరీరమును దానికి మూలస్తంభంగా వేసి, అతనిపై బంగారు నాణ్యములను పోశారని, ఆ కోట పైకి లేవడానికి అతను తన ప్రాణమును త్యాగం చేశాడని చరిత్ర ద్వారా వెల్లడి చేయబడినది. ఇది చరిత్రగా ఉన్నది. కానీ, నా ప్రియ స్నేహితులారా, నిజం అంతకంటే ఎంతో గొప్పది. మనం దేవుని ఆలయంగా నిర్మించబడటానికి, దేవుడే స్వయంగా క్రిందికి వచ్చి మనకోసం తనను తాను బలిగా సమర్పించుకున్నాడు. అందుకే బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:20వ వచనములో చూచినట్లయితే, మనం అపొస్తలులు మరియు ప్రవక్తల పునాదిపై కట్టబపడియున్నాము. మన పునాదికి యేసుక్రీస్తు మూలరాయిగా ఉన్నాడు, ఇంకను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలో నివసించడానికి మనం కలిసి కట్టబడుచున్నాము. కాబట్టి, నా ప్రియమైనవారలారా, మీ కుటుంబమంతా పరిశుద్ధాత్మ ద్వారా కలిసి నిర్మించబడినప్పుడు, దేవుడు సజీవమైన రాళ్లతో నిర్మిస్తాడు. అందుకే బైబిల్ నుండి 1 పేతురు 2:6వ వచనములో చూచినట్లయితే, "ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.'' ఆలాగుననే, యేసు ఇలాగున అన్నాడు, "అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును'' (యోహాను 11:25). నా ప్రియులారా, మీ జీవితములో ఎన్నో తుఫానులు రావచ్చును, అగ్ని రావచ్చును, కానీ మీలో ఉన్న జీవము ఎన్నటికిని ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఎందుకంటే, అది యేసు నుండి వచ్చిన జీవము. అందుకే బైబిల్ నుండి యోహాను 6:63వ వచనములో చూచినట్లయితే, "ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని '' ప్రకారము దేవుని ఆత్మ చేత మనము జీవింపజేయబడుచున్నాము. కనుకనే, చింతించకండి.
నా ప్రియులారా, మీలో ఉన్న దేవుని ఆత్మ, జీవమును మరియు పునరుత్థానాన్ని తీసుకువచ్చును అని దేవుని వాక్యాన్ని స్పష్టముగా తెలియజేయుచున్నది. అనేక సంవత్సరాల క్రితం, నాకు కేవలం 23 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, క్యాన్సర్‌తో చనిపోతున్న ఒక స్త్రీ కొరకు ప్రార్థించడానికి నేను నా స్నేహితురాలి కుటుంబంతో కలిసి వెళ్ళాను. పాస్టర్ ఆమెకు చివరి దివ్యసమావేశం ఇవ్వవలసి ఉన్నది. కనుకనే, ఆమె బాధతో మూలుగుచున్నది, ఆమె భర్త మరియు పిల్లలు ఏడ్చుచున్నారు. అకస్మాత్తుగా, దేవుని వాక్యాన్ని పంచుకోమని నన్ను అడిగారు. ఎటువంటి సిద్ధపాటు లేకుండా ఉన్నప్పటికిని బైబిల్ నుండి యాకోబు 5:14-15 వచనాలను ప్రకటించమని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించెను. మేము ఆమెకు నూనె రాసి, ఆమె స్వస్థత కొరకు విశ్వాసముతో ప్రార్థన చేశాము. యేసు నామంలో, ' నేను ఆ వ్యాధిని శపించాను' తక్షణమే, ఆమె తన వ్యాధి పడక నుండి లేచి, స్వస్థతను పొందుకొని, ఆనందంతో నాట్యం చేయుచూ, తన పిల్లలను కౌగిలించుకుంది. చూడండి, నా ప్రియులారా, అదే దేవుని ఆత్మకు గల శక్తి, అది నేడు మిమ్మును కూడా అటువంటి జీవముగల రాళ్లుగా మారుస్తుంది. కాబట్టి, భయపడకండి.
చివరగా, దేవుడు మీ చుట్టూ సమాధాన ప్రాకారాన్ని నిర్మిస్తాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 147:14 వ వచనములో చూచినట్లయితే, "నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే '' అని చెప్పబడినట్లుగానే,ఆయన మీ సరిహద్దులకు సమాధానమును అనుగ్రహిస్తాడు మరియు మిమ్మును ఉన్నతమైన దీవెనలతో తృప్తిపరుస్తాడు. ఇంకను బైబిల్ నుండి యోబు 1:10వ వచనములో చూచినట్లయితే, సాతాను దేవునికి మొరపెడుతూ, ఇలా అంటున్నాడు: " నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.'' అవును, దేవుడు మీ చుట్టూ కూడా అగ్ని ప్రాకారాన్ని కంచెలాగా నిర్మించినప్పుడు, మిమ్మల్ని చూసి సాతాను ఆ విధంగానే ఏడుస్తాడు. అనేక సంవత్సరాల క్రితం, వేలాది మంది ప్రజల కొరకు వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించుచున్నప్పుడు, దగ్గరలో ఉన్న ఒక స్త్రీ, ఇతని చుట్టూ అగ్ని మండుచున్నది అని కేకలు వేసింది. అది కాలిపోతోంది! నేను ఆమె యందు జాలిపడి, 'నేను యేసు నామంలో ఆమె విడుదల కొరకు' భారముతో ప్రార్థించాను మరియు ఆమెను తాకకుండానే, ఆమె కింద పడిపోయింది, దురాత్మ నుండి విడుదల పొందుకొనెను మరియు సంపూర్ణంగా స్వస్థత పొందుకొని, సమాధానమునుతో పైకి లేచి నిలువబడినది. అవును, నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును రక్షించడానికి నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. అందుకే బైబిల్ నుండి 2 సమూయేలు 7:29వ వచనములో చూచినట్లయితే, " దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము; యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు; నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక'' అని చెప్పబడినట్లుగానే, కాబట్టి, భయపడకండి. కనుకనే, నా ప్రియులారా, దేవుడు తన ఆశీర్వాదాలతో మిమ్మును నింపుతాడు. దేవుని చిత్తం చేయడానికి ఈరోజే మీరు ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన మిమ్మును ఉన్నత స్థితికి లేవనెత్తి, మరల కట్టబడునట్లుగా చేసి, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానముగా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రేమగల ప్రభువా, మా హృదయాన్ని, మా ఇంటిని, మా కుటుంబాన్ని నీ ప్రేమగల చేతులకు అప్పగించుకొనుచున్నాము. యేసయ్య, నీవు మా జీవితానికి, మా కుటుంబానికి నీవు బలమైన పునాదిగా ఉండి, మమ్మును కాపాడుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన సజీవ రాళ్లవలె మమ్మును నిర్మించుము.ప్రభువా, నీవు వాగ్దానం చేసినట్లుగానే, దయచేసి మమ్మును అగ్ని ప్రాకారముతో చుట్టుముట్టి, నీ సమాధానముతో మమ్మును నింపి, తృప్తిపరచుము. దేవా, మా జీవితములలో నీవు స్థాపించిన దానిని ఏదియు కదల్చబడకుండా మమ్మును స్థిరపరచుము. యేసయ్యా, నీ నామానికి మహిమ తీసుకురావడానికి మమ్మును వాడుకొనుము. దేవా, కృతజ్ఞతతో మేము నీ యొక్క ఆశీర్వాదాలను పొందుకొనుటకు కృపను చూపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


