నా ప్రియమైనవారలారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకందరికిని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున ప్రత్యేకమైన శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి న్యాయాధిపతులు 6:12వ వచనమును ఇవ్వబడియున్నది. ఆ వచనము, "యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనెను '' ప్రకారముగానే, సర్వశక్తిమంతుడైన యేసయ్యను మనకు తోడుగా కలిగియున్నప్పుడు, నా ప్రియమైన బిడ్డలారా, మనము కూడా అటువంటి అనుభవమును కలిగియుంటాము. పరాక్రమముగల బలాఢ్యులుగా మీరు కూడా మార్చబడగలుగుతారు. అందుకే బైబిల్ నుండి జెకర్యా 10:7వ వచనములో కూడా అదే విషయమును చెప్పబడియున్నది, "ఎఫ్రాయిమువారు బలాఢ్యులవంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించునట్లు వారు మనస్సున ఆనందింతురు, వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు, యెహోవాను బట్టివారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు'' అని చెప్పబడినట్లుగానే, మీరు బలాఢ్యులవంటి వారు కావాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. మీరు బలహీనులని చెప్పకండి, దేవుడు మిమ్మును బలవంతులనుగా మార్చుచున్నాడు. మీరు ఆయన చేతిలో బలవంతులై యున్నారు.
అందుకే బైబిల్ నుండి 1 సమూయేలు 16:18వ వచనములో చూచినట్లయితే, "చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. '' ఆ ప్రకారముగానే, దావీదు బహు శూరుడును మరియు యుద్ధశాలియై యున్నాడని చెప్పబడియున్నది. దావీదు ఎవరండి? అతడు ఒక సాధారణమైన గొఱ్ఱెల కాపరియై యున్నాడు. అతడు తన జీవితములో ఎంతో దీనుడుగా ఉండియున్నాడు. అయితే, దేవుడు అతనిని పరాక్రమముగల శూరునిగా చేసియున్నాడు. అందుకే బైబిల్ నుండి 1 సమూయేలు 17:50వ వచనమును చూచినట్లయితే, " దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను'' అని చెప్పబడినట్లుగానే, గొల్యాతు ఎంతో బలమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అతనికి అనేకమైన యుద్ధోపకరణములు ఉండినవి. అతని యొద్ద అనేకమైనటువంటి ఆయుధములు ఉండినవి. కానీ, దావీదు యొద్ద ఆయుధములు ఏమియు కూడా లేవు. అతని దగ్గర కేవలము ఒక వడిసెల రాయి మాత్రమే ఉండియున్నది. అయితే, దేవుని యొక్క శక్తి దావీదుతో ఉండియున్నందున, అతడు ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఆ విజయాన్ని చేకూర్చింది దావీదు బలం కాదు, అతని ద్వారా కార్యము చేసిన దేవుని శక్తియే. చూడండి ఎంత గొప్ప దేవునిని మనము కలిగియున్నాము కదా!
నా ప్రియ స్నేహితులారా, మీరు యేసయ్యను మీతో కలిగియున్నప్పుడు, మీరు బలాఢ్యులుగాను మరియు శక్తిమంతులుగా మారిపోతారు. ఎంత దీవెనకరమైన దేవునిని మనము కలిగియున్నాము కదా! అందుకే దావీదు ఈలాగున అంటున్నాడు కదా! "యెహోవా నా కాపరి'' అని చెప్పబడినట్లుగానే, మీరు యేసయ్యను మీ కాపరిగా కలిగియుండడము ఎంతో ప్రాముఖ్యమై యున్నది. ఆయన ఎల్లవేళల మీతో ఉన్నప్పుడు, మీరు దేవుని యొక్క సకల ఆశీర్వాదములను కలిగియుంటారు. అప్పుడు మీరు బలాఢ్యులైన పరాక్రమముగలవారుగా మారిపోతారు. నా ప్రియులారా, మీరందరు కూడా అటువంటి ఆశీర్వాదమును ఇప్పుడు పొందుకోవాలని ప్రార్థన చేద్దాము. అయితే, నా ప్రియులారా, మీరు ఒకవేళ, ' మేము అన్ని విషయాలలో ఎంతో బలహీనులముగా ఉన్నాము ' అని అంటున్నారేమో? అయితే, మిమ్మును మీరు ఈ రోజు ప్రభువునకు సమర్పించుకున్నట్లయితే, ఆయన మిమ్మును దావీదు వలె బాలాఢ్యులుగాను మరియు పరాక్రమముగలవారినిగా మిమ్మును మారుస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా జీవితములో మేము ఎంతో బలహీనమై యున్నాము. యేసయ్యా, మా యొద్ద ధనము లేదు, శరీరములో బలము లేదు, మాకు ఏమియు కూడా లేదు. అయితే, మేము నిన్ను కాపరిగా కలిగియుండునట్లుగా, నీవు మాకు బలముగా ఉండి, నీవే మాకు ఆశీర్వాదముగాను, నీవే మాకు సమస్తముగా ఉండి, మమ్మును బలాఢ్యులనుగా మార్చుము. దేవా, నీ మహిమార్థము మేము బలాఢ్యులుగా మార్చబడునట్లుగాను మాకు సహాయము చేయుము. ప్రభువా, మా అవసరతలు ఏమైయున్నవని ఒక తండ్రివలె నీవు ఎరిగియున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, అద్భుత రీతిగా ఇప్పుడే మా యొక్క అవసరతలన్నిటిని తీర్చుము. యేసయ్యా, నీవే మా కాపరిగాను, మాకు బలముగాను, మరియు మా ఆశ్రయంగా ఉన్నందుకు నీకు వందనములు. దేవా, మేము బలహీనులమని, అసమర్థుడమని భావించినప్పటికిని, నీ సన్నిధి చేత మమ్మును బలవంతులనుగా చేయడానికి చాలునని మేము నమ్ముచున్నామము. ప్రభువా, నీ శక్తితో మమ్మును నింపి, నీ మహిమ కొరకు మమ్మును పరాక్రమముగల బలాఢ్యుల వలె మమ్మును మార్చుము. దేవా, మా యొక్క ప్రతి సవాలును అధిగమించడానికి మా హృదయమును బలపరచుము, మరియు మా జీవితము నుండి ప్రతి భయమును, నిరుత్సాహామును తొలగించు. యేసయ్యా, నీ మహిమైశ్వర్యమునుబట్టి మా అవసరాలన్నిటిని తీర్చుము మరియు మేము ఎదుర్కొనే ప్రతి పోరాటములో మాకు విజయమును అనుగ్రహించుము. దేవా, నీ యొక్క బలమైన హస్తము మా మీద ఉండునట్లుగాను మరియు అన్ని పరిస్థితులలో నిన్ను పరిపూర్ణముగా నమ్మడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము ప్రతిరోజు నీ బలముతో నడుచుచున్నప్పుడు, మా జీవితం నీ నామమునకు మహిమను తీసుకొనివచ్చునట్లుగా మమ్మును మార్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


