నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 107: 37,38వ వచనములు మన కొరకు ఇవ్వబడియున్నది. ఆ వచనములలో, "వారు అచ్చట నివాస పురము ఏర్పరచుకొనునట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలికొనిన వారిని అచ్చట కాపురముంచెను'' అని చెప్పబడిన ప్రకారముగా సస్యఫల సమృద్ధిని అనుగ్రహించుటకు దేవుడు మన పట్ల వాంఛ కలిగియున్నాడు. అయితే, మనము దేవుని దీవెనలను ఏ విధముగా పొందుకొనగలము? అందుకు జవాబుగా మనము బైబిల్ నుండి కీర్తనలు 107వ అధ్యాయములో చూచినట్లయితే, 'నిరంతరము ఆయనను స్తుతించాలని' ఆ ఆధ్యాయమంతటిలోను చెప్పబడియున్నది.
ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 107:1వ వచనములో చూచినట్లయితే, " యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును'' అని చెప్పబడిన ప్రకారము మనకు దీవెనలను అనుగ్రహించు దేవునికి మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలని వాక్యము మనకు సెలవిచ్చుచునది. మనము నిత్యము దేవుని స్తుతించవలెను. కనుకనే, బైబిల్ నుండి కీర్తనలు 107:31,32వ వచనములలో చూచినట్లయితే, "ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. జనసమాజములో వారాయనను ఘనపరచుదురు గాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక'' అని చెప్పబడినట్లుగానే, ఆయన కృప నిరంతరము నిలుచును గాక. నా ప్రియ స్నేహితులారా, మీరు ఎంత సమయమును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఇచ్చుచున్నారు. దేవుని యొక్క సమృద్ధియైన దీవెనలను పొందుకోవడము మాత్రమే కాదు, నిత్యము మీరు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి.
నా ప్రియులారా, అన్ని విషయములందు దేవునికి స్తుతులు అర్పించాలని దేవుని వాక్యము మనకు బోధించుచున్నది. అది తినడానికి ముందు ప్రతిసారి కూడా ఆయన మనకు ఇచ్చిన ఆహారమునకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆలాగుననే, మా తల్లిగారు ఒక పని చేసేవారు. నా కొరకు ఏ వస్తువు తీసుకొని వచ్చినను సరే, లేక క్రొత్తగా కొన్నను కూడా, అది ఏ వస్తువైనను సరే, అది మొదటగా దేవుని సన్నిధిలో ఉంచి వందనములు చెల్లించాలని తను మాకు నేర్పించేవారు. అది ఒక పెన్సిలైన సరే, లేక పెన్నైనను సరే, అది ఏదైనను సరే, అది మా తల్లిగారి యొక్క విశ్వాసము. అక్కడ మేము దానిని ప్రభువుకు అర్పించి, దేవుడు దానిని ఆశీర్వదిస్తాడని నమ్ముతూ దానిపై ప్రార్థన చేసేవారము. అది ఆమె విశ్వాసానికి ఒక సరళమైన ఇంకా శక్తివంతమైన భావము. ప్రతి బహుమానము దేవుని యొద్ద నుండి వస్తుందని, దానిని కృతజ్ఞతా స్తుతులతో పొందుకోవాలని ఆమె విశ్వసించేవారు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధముగా, మనము ప్రభువు యొద్ద నుండి పొందుకున్న ప్రతి విషయమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందును బట్టి, ప్రభువు మనలను ఎలా దీవిస్తాడు? అని చూచినట్లయితే, బైబిల్ నుండి కీర్తనలు 107:41వ వచనమును చూచినట్లయితే, " అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను'' అని చెప్పబడినట్లుగానే, మీ హృదయములోతులలో నుండి మీరు ప్రభువును స్తుతించినట్లయితే, ప్రభువు మిమ్మును గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రభువు తనయందు విశ్వాసముంచువారిని ఉన్నత స్థితికి హెచ్చించి, వారి జీవితాలను తన మేలులతో నింపుతాడు. కృతజ్ఞతతో నిండిన హృదయం దేవుని సమృద్ధియైన కృపకు మరియు దయకు మార్గం తెరుచుచున్నది.
అదేవిధముగా, అబ్రాహాము యొక్క జీవితమును చూచినట్లయితే, అబ్రాహాము అనేక సంవత్సరములు సంతానము లేకుండా ఉన్నాడు. అయితే, అతడు ప్రభువు మీద ఆధారపడినప్పుడు, దేవుడు అతనిని సమృద్ధిగా దీవించాడు. అయినను, అబ్రాహాము దేవుని స్తుతించియున్నాడు. ఇంకను దేవుడు అతనికి ఇచ్చిన ఏకైక కుమారుని బట్టి, అతనిని స్తుతించియున్నాడు. తద్వారా, బైబిల్ నుండి మత్తయి సువార్త 1:1-17వ వచనములలో మనము చూచినట్లయితే, అబ్రాహాము సంతానము తరతరములు అభివృద్ధినొందుచూనే ఉన్నది. అబ్రాహాము నుండి యేసయ్య వరకు అభివృద్ధి పొందుచూ వచ్చినది. అబ్రాహాము దేవునిపై ఆధారపడటం కొనసాగించడము వలన, ఒక వాగ్దాన పుత్రునితో ప్రారంభించిన,ఆ విషయం గొప్ప వంశంగా మార్చబడినది. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు కూడా ప్రతి చిన్న విషయమును బట్టి, ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ప్రభువు మిమ్మును సమృద్ధిగా దీవిస్తాడు. కనుకనే, మీ హృదయాంతరంగములో నుండి దేవుని స్తుతిస్తూ, ప్రార్థించుదాము. నా ప్రియమైన స్నేహితులారా, ప్రతి ఆశీర్వాదానికి, జవాబు ఇవ్వబడిన ప్రతి ప్రార్థనకు, ప్రతి ఏర్పాటుకు, మరియు ఆయన కృప ద్వారా జరిగియున్న కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడము నేర్చుకుందాము. నా ప్రియులారా, నేటి నుండి మనం కృతజ్ఞతా హృదయాన్ని పెంపొందించుకున్నప్పుడు, ప్రభువు మన జీవితములను ఫలించునట్లుగా చేసి, మనలను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రశస్తమైన ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మా జీవితములలో కృపతో కుమ్మరించిన దీవెనలన్నిటికి మేము నీకు నిత్యము కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకు మాకు నేర్పించుము. ప్రభువా, ప్రతిరోజు మమ్మును పోషించే నీ యొక్క మంచితనమునకు, కనికరముగల మరియు కృతజ్ఞతా హృదయముతో మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, మా హృదయారంతరంగములో నుండి చెల్లించు, కృతజ్ఞతలను అంగీకరించి, నీ ప్రేమ మరియు విశ్వసనీయతపై లోతైన అవగాహనతో మా హృదయములను నింపుము. ప్రభువా, నీ యొక్క పరిపూర్ణ చిత్తానుసారంగా మా యొక్క ప్రతి అవసరమును తీర్చి, మా జీవితములను ఫలించునట్లుగా మరియు దీవించబడినట్లుగాను మరియు సస్యఫల సమృద్ధిగా ఉండునట్లుగా మమ్మును మార్చుము. దేవా, మేము నిరంతరం నీయందు ఆనందించి, మేము చేయు ప్రతి పనిలో నీ యొక్క పరిశుద్ధమైన నామము మహిమపడునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితములు నీ మేలులకును మరియు నీవనుగ్రహించిన కృపకు సాక్ష్యముగా నిలిచి ఉండునట్లుగా మాకు సహాయము చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


