నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీరు ఇంతటి గొప్ప ఆశీర్వాదం పొందడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. నేడు బైబిల్ నుండి దేవుడు 2 సమూయేలు 7:9వ వచనము నుండి వాగ్దానం చేయుచున్నాడు. ఆ వచనము, "నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసియున్నాను'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇది ఎంతటి అద్భుతమైన వాగ్దానము ఇది! దేవుడు మనకు మంచి పేరును ఇవ్వగలడు మరియు మనలను ఘనపరచి, పైకి లేవనెత్తగలడు. కానీ, ఆయన తమ సొంత పేరు లేదా ఖ్యాతిని నిలుపుకోవడానికి ప్రయత్నించే వారి కొరకు కాదు, కానీ తమ జీవితాలను ఆయనకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నవారి కోసం ఇలాగున జరిగిస్తాడు. ప్రజలు ఏమి చెబుతారో లేదా సమాజం మనలను ఎలా చూస్తుందో అని మనం ఆందోళన చెందినప్పుడు, దేవుని మాట వినడానికి నిరాకరించి పెద్ద మత్స్యము కడుపులో పడవేసిన యోనావలె అవుతాము. కానీ, మనం దేవునికి విధేయత చూపి, ఆయనను పూర్తిగా విశ్వసించినప్పుడు, ఆయనే మన పేరును కాపాడి దానిని ప్రకాశింపజేస్తాడు.
నా ప్రియమైన స్నేహితులారా, ఈలోకంలో అనేకమంది పేరు ప్రఖ్యాతి కొరకు ఎంతో ఘనులైన వారిని వెంబడిస్తారు మరియు తమకంటూ ఒక పేరును ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు. అవును, ఆలాగున కొంతకాలం వారు గొప్ప పేరును సంపాదించుకోవచ్చును, కానీ ఏదైనా రహస్య పాపం లేదా బలహీనత బయటపడినట్లయితే, వారి పేరు పతనమై కూలిపోతుంది. వారు తమ సొంత పేరును నిత్యము కాపాడుకోలేరు. కానీ, 'ప్రభువా, నీవు నన్ను రక్షించుము, నీవు నన్ను గొప్పవానిగా చేయుము, నేను నీకు మాత్రమే లోబడాలనుకుంటున్నాను' అని చెబుతూ, తమ జీవితాలను దేవుని హస్తాలకు అప్పగించుకునేవారు దేవునిచే ఘనపరచబడతారు. అందుకు పౌలు మనకు ఒక ఉదాహరణగా ఉన్నాడు. కొట్టబడినా, చెరసాలలో వేయబడినను, చంపుతామని బెదిరించబడినను, అతను సువార్తను ప్రకటిస్తూనే ఉండెను. అతను ఎప్పుడూ కూడా తన సొంత పేరు గురించి పట్టించుకోలేదు, కానీ యేసు నామాన్ని హెచ్చించడం గురించి మాత్రమే అతని తలంపులలో నిండిపోయినది. అందుకే అతని పేరు ఇప్పటికీ విశ్వాస చరిత్రలో వెలుగువలె ప్రకాశించుచున్నది.
నా ప్రియులారా, అదేవిధంగా, భక్తులైన పౌలు మరియు యోనా నుండి కూడా మనం నేర్చుకుందాం. ప్రజలు ఏమనుకుంటారో అని చింతించడానికి బదులుగా, మన స్వంత పేరు మరియు ఘనతను యేసు హస్తాలకు అప్పగించుకుందాము. ఆయనే దానిని కాపాడగల సమర్థుడు. కనుకనే, నా స్నేహితులారా, మనం ఆయనను నమ్మకంగా అనుసరించినప్పుడు, ఆయన మన ద్వారా తన నామాన్ని గొప్పగా చేయడమే కాకుండా, మనుష్యులందరి యెదుట మన పేరును ఘనపరుస్తాడు. మన స్వంత పేరు ప్రఖ్యాతి కొరకు కాదు, ఆయన మహిమ కొరకు జీవిద్దాం. అప్పుడు ఆయన తగిన కాలంలో, ఆయన మనలను ప్రకాశింపజేస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ అమూల్యమైన వాక్కుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మా పేరు ప్రఖ్యాతిని నీ హస్తాలకు అప్పగించుకొనుచున్నాము. ప్రభువా, మా ఘనతను, కీర్తిని కాపాడుకొనుటకు మాకు నీ కృపను దయచేయుము. దేవా, ఘనులేమి, పురుషులేమి చెప్పినను మేము ఎవరికి భయపడకుండా ఉండుటకు మాకు సహాయం చేసి, పౌలు వలె నిన్ను అనుసరించడానికి మాకు ధైర్యమును అనుగ్రహించుము. ప్రభువా, మా హృదయం నుండి యోనా ఆత్మను తొలగించు ము. అందుకు బదులుగా నీ చిత్తాన్ని మరియు నీ ప్రణాళికను మాత్రమే విలువైనదిగా మాకు నేర్పుము. దేవా, నీ మహిమ కొరకు మా పేరును గొప్ప చేసి, నీ కొరకు మమ్మును ప్రకాశింపజేయుము. ప్రభువా, మా జీవితం లోకానికి నీ నామమును ప్రతిబింబించునట్లుగా చేయుము. దేవా, మేము పోవు చోట్లనెల్లను నీవు మాకు తోడుగా నుండి మా శత్రువులనందరిని మా యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరును మాకును కలుగజేయుమని యేసు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.