నా ప్రియమైన స్నేహితులారా, నేడు శుభ శుక్రవారమున మీకందరికి నా ప్రేమ పూర్వక శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు మనము మంచి శుక్రవారమును జరుపుకుంటున్నాము. అనగా, యేసుక్రీస్తు మన కొరకు మరణించిన దినము. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి గలతీయులకు 5:24వ వచనమును మనము ధ్యానించుకుందాము. ఆ వచనము, "క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు'' అని చెప్పబడిన ప్రకారము అవును, మనము యేసుక్రీస్తు యొక్క సంబంధులుగా ఉన్నాము. యేసయ్య మన కొరకు చనిపోయిన రీతిగానే, మన పాపపు స్వభావమును మరియు దురాశలను మనము సిలువవేయవలసియున్నాము. కనుకనే, యేసు ప్రభువు మనతో ఈలాగున అంటున్నాడు, "ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను'' అని చెప్పబడిన ప్రకారము మనలను మనము ఉపేక్షించుకోవడము అనగా ఏమిటి? అందుకే బైబిల్ నుండి రోమీయులకు 6:6వ వచనములో చూచినట్లయితే, " ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము'' అని చెప్పబడిన ప్రకారము అనగా, ఎటువంటి పాపమునైనను, మనము కాదు లేక వద్దు అని నిరాకరించాలి. నా భర్తగారైనటువంటి డా. పాల్ దినకరన్‌గారు ఒక పాటను ఈ విధంగా పాడియున్నారు. ఆ పాట, 'నీ బలహీనతలలో నీవు శోధింపబడినట్లయితే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ధైర్యము తెచ్చుకొని, వద్దు అని చెప్పవలెను.' ఆలాగుననే, అపవాది ఎల్లప్పుడు మనలను శోధింపజేయుచూ, మనము పాపమునకు ఒప్పుకొను విధంగా ప్రయత్నిస్తాడు. అయితే, వద్దు అని చెప్పడానికి ధైర్యము వహించండి. మీరు ఇకను పాపమునకు దాసులు కారు. ప్రభువు ఆ సిలువ మీద మీ పాపములన్నిటిని కూడా సిలువ వేసియున్నాడు. మీ పాపములన్నిటిని ఆయన కొట్టి వేసియున్నాడు. మీ పాపములన్నిటిని ఆయన తన వీపు మీద మోపుకున్నాడు. కనుకనే, మీరు ధైర్యము వహించండి.

చూడండి, బైబిల్ నుండి తీతుకు 2:12వ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, "మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండ వలెను'' అని చెప్పబడినట్లుగానే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధ మైన దురాశలను విసర్జించాలి అని దేవుని వాక్యము మనకు చెబుతుంది. అనగా, దేవుని కృప మనము పాపమును నిరాకరించాలని మనకు నేర్పించుచున్నది. ఈ ప్రస్తుత యుగములో ఆశానిగ్రహము కలిగి, నీతియుక్తమైన భక్తి కలిగి జీవించాలని మనకు నేర్పించుచున్నది. మనము శోధింపబడిన ప్రతిసారి పౌలు భక్తుడు చేసిన విధంగా మనము కూడా చేయవలెను. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 9:27వ వచనములో చూచినట్లయితే, "గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను'' అని పౌలు భక్తుడు చెప్పియున్నాడు. అతడు కూడా పాపమును నిరాకరించియున్నాడు. కనుకనే, అతడు 'నా శరీరమును ఇకను పాపము చేయకుండా ఉండునట్లుగా, నా శరీరమును క్రమశిక్షణను కలిగియుండుటకు నేను నేర్చుకొనుచున్నాను' అని ఈ వచనము ద్వారా మనకు తెలియజేసియున్నాడు. నా ప్రియులారా, పాపము చేయకుండా, మన శరీరములో ఏ విధంగా క్రమశిక్షణ మనము కలిగియుండగలము? దేవుని వాక్యము మూలముగా మనలను మనము పరిశుద్ధముగా ఉంచుకొనుట ద్వారానే కదా. మనము ప్రతిరోజు బైబిల్ గ్రంథములోని వాక్యములను మనము చదివినప్పుడు, దేవుని వాక్యము మనలను పరిశుద్ధపరచుచున్నది. దేవుడు మనయందు నివసించునట్లుగా, మన దేహమును మనము ఆయనకు అర్పించినప్పుడు, ఆయన మనము పాపము చేయకుండా కాపాడుతాడు. అందుకే బైబిల్ నుండి గలతీయులకు 5:16వ వచనములో చూచినట్లయితే, "నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు'' అని చెప్పబడినట్లుగానే, మనము మన శరీరేచ్ఛను నేరవేర్చకుండా ఉండాలంటే, మనము ఆత్మానుసారులుగా జీవించాలి. కనుకనే, పరిశుద్ధాత్ముడు మన బలహీనతలలో మనకు సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అవును, మన దేహమునందు పాపపు స్వభావమును కలిగియుంటూ, జీవించడము ఎంతో కష్టతరము. కనుకనే, ఈ శుభశుక్రవారమున మీ పాపపు స్వభావమును సిలువకు అప్పగించి, సిలువ ద్వారా వచ్చిన ఆశీర్వాదములను పొందుకొనండి.

రాజమండ్రి నుండి ఒక ప్రియ సహోదరి ఈ విధంగా తన సాక్ష్యమును పంచుకొనెను. తన పేరు స్వర్ణ. 13 సంవత్సరముల నుండి తన భర్త త్రాగుడుకు బానిస అయ్యాడు. అందును బట్టి, అనేక కుటుంబ సమస్యలను వారు ఎదుర్కొన్నారు. తన భర్త ఆ దుర్‌వ్యసనముల నుండి బయటకు రావలని ఆశించేవాడు. అయితే, అతడు చేయలేకపోయేవాడు. దేవునికి దూరంగా మరలిపోవుచుండెను. అందువలననే, వారిద్దరు ఒకరినొకరు వేరైపోవాలని నిర్ణయించకున్నారు. ఆర్థికంగాను మరియు మానసికంగాను కూడా వారిద్దరు ఎంతగానో హింసను అనుభవించారు. అటువంటి పరిస్థితులలో ఫిబ్రవరి 2025 వ సంవత్సరములో ఏలూరు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయబడియుండెను. ఆ కూడికలలో భార్యభర్తలిద్దరు హాజరయ్యారు. ఆ కూడిక అనంతరము ప్రజలందరికి వ్యక్తిగతంగా ప్రార్థన చేశాము. ఈ దంపతులు ఇద్దరు కూడా ప్రార్థన కొరకు మా కుమారుడైన శామ్యేల్ వద్దకు వెళ్లి ప్రార్థించుకున్నారు. ప్రార్థనా అనంతరము ప్రభువు ఆశ్చర్యకరమైన రీతిలో తన భర్తను తాకి విడుదల చేసియున్నాడు. వారు ఇంటికి తిరిగి వెళ్లుచుండగా, ఒక ప్రమాదము జరిగినది. ఆ ప్రమాదములో ప్రభువు తన కృపను బట్టి వారిద్దరి ప్రాణములను కాపాడియున్నాడు. ఆ తదనంతరము తన భర్త దేవుని యందు విశ్వసించడము ప్రారంభించియున్నాడు. ఇక పడిపోవడము లేకుండా దేవుడు అతనిని రక్షించాడు. అంతమాత్రమే కాదు. పాపమును అతడు నిరాకరించియున్నాడు. ఆ తర్వాత, వారు ప్రభువు వెంబడించియున్నారు. ఇప్పుడు ప్రభువు తన భర్తను ఘనపరచి, ఒక కళశాలలో ప్రొఫెసర్ ఉద్యోగమును అనుగ్రహించియున్నాడు. ఆలాగుననే, ఇప్పుడు వారిద్దరు ఒక చక్కని దాంపత్య జీవితమును జీవించుచున్నారు. అవును, నా ప్రియులారా, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును, దాని యిచ్ఛలను దురాశలతోను సిలువ వేసియున్నారు. కనుకనే, నేడు మీరు కూడా ఆ విధంగా చేయడానికి ప్రభువు మీకు సహాయము చేయును గాక. మందును మరియు మధ్యమును, పాపమును నిరాకరించండి మరియు శోధనలను నిరాకరించండి. మీ పాపపు స్వభావములన్నిటిని కూడా, ' వద్దు' అని నిరాకరించండి. ఈ రోజు ప్రభువే మీకు వాటన్నిటి నుండి మిమ్మును దూరంగా ఉంచుటకు మీకు సహాయము చేసి, సిలువలో ఉన్న శక్తిని మీకు అనుగ్రహించును గాక. కనుకనే, ధైర్యము వహించండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా జీవితంలో సిలువ శక్తిని ఇచ్చినందుకు మీకు వందనాలు. దేవా, ఈ రోజు, మేము ప్రతి పాపానికి మరియు శోధనకు 'కాదు' వద్దు అని చెప్పాలని ఎంపిక చేసుకొనుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనములు. యేసయ్యా, మేము శరీరములో ఉన్నాము, మా శరీరము బలహీనమైనది, కానీ, నీ శక్తి చేత మా ఆత్మ ఎంతో శక్తివంతముగా ఉండుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మా బలహీనతలలో మేము ఉచ్చరింపశక్యముకానీ మూలుగులతో నీ సన్నిధిలో ప్రార్థించుటకు నీవు మాకు నేర్పుము. పరిశుద్ధాత్మ దేవా, నీవు మా హృదయములోనికి ప్రవేశించి, మమ్మును నీ ఆత్మ శక్తిచేత నింపుము. ప్రభువా, పాపపు అలవాట్లన్నిటిని మేము నిరాకరించుటకు మాకు నీ కృపను అనుగ్రహించి, ఇకను ఆ పాపపు అలవాట్లు మా యొద్దకు రాకుండా సహాయము చేయుము. దేవా, మా స్వార్ధాన్ని విడిచిపెట్టి, నిన్ను మా పూర్ణహృదయంతో అనుసరించే సంకల్పాన్ని మాకు దయచేయుము. ప్రభువా, నీ వాక్యం ద్వారా ప్రతిదినం మమ్మును శుద్ధులనుగా చేసి, మమ్మును పవిత్రంగా మార్చుము. పరిశుద్ధాత్మ దేవా, మా బలహీనతలలో మమ్మును నడిపించి, బలపరచుము. ప్రభువా, మా శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచి, నీతి మార్గంలో నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మమ్మును తిరిగి పాపంలోకి ఆకర్షించుటకు ప్రయత్నించే ప్రతి సంకెళ్ళను తెంచివేయుము. ప్రభువా, ప్రతిదినం మా జీవితం నీ కృపను, సత్యాన్ని ప్రతిబింబించచునట్లుగా చేఉయము. యేసయ్యా, ప్రతిరోజు మా హృదయములో నీవుంటూ, నీవు, నీ రక్తము ద్వారా మమ్మును కడిగి పరిశుద్ధపరచుము. దేవా, మేము మా కోరికలను విడిచిపెట్టి, అన్నిటికంటె ఎక్కువగా నీ చిత్తమును జరిగించునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, ఈ లోకములో మమ్మును ఏదియు తాకకుండా, నీ యందు భయభక్తులు కలిగియుండుటకు మాకు సహాయము చేయుమని యేసు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.