నా ప్రియమైన స్నేహితులారా, ఈ దినమున దేవుని పాదముల చెంత ఆయన ఆశీర్వాదముల కొరకు వేచి ఉన్నాము. కనుకనే, నిరుత్సాహము చెందకండి. ఏ మాత్రము నిరీక్షణను కోల్పోకండి. దేవుడు మీ పక్షమున ఉన్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 65:24వ వచనము నుండి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆ వచనము, "...వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను'' ప్రకారం మీరు వేడుకొనక ముందే ఆయన మీకు జవాబు ఇస్తాడు. ఈ వాక్యము ఎంత గొప్ప ఆదరణ కదా! మీరు ఆయనను పిలువక మునుపే, దేవుడు మీకు జవాబిస్తాడు అని తెలియజేయుచున్నాడు. ఇంకను మనము ఇంకను మనవి చేయుచుండగానే ఆయన ఆలకిస్తాడు. ఆలాగుననే, మా స్వంత కుటుంబ జీవితములో చూచినట్లయితే, కొన్నిసార్లు మేము ఎంత సంక్లిష్టమైన పరిస్థితులలో ఉన్నామని మేము మా కుటుంబ సభ్యులతో చర్చించుచుండగానే, ఆయనకు ప్రార్థన చేయబడక మునుపుగానే, అద్భుత కార్యాన్ని జరగడాన్ని మేము చూచియున్నాము. చిన్న చిన్న విషయాలలో కూడా ఇది కలిగియుంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నప్పుడు కూడా దేవుడు మా కొరకు ఎంతో సౌందర్యవంతముగా అన్నిటిని అమర్చేవాడు.
నా ప్రియులారా, ప్రభువును వెదకుచూ, ఆయనను అనుసరించువారికి దేవుడు అట్టి ఆశీర్వాదములను అనుగ్రహించుచున్నాడు. ఆయనకు విధేయులై, ఆయన చెప్పినదంతయు జరిగించువారి కొరకు, ఎవరు వారి జీవితాన్ని దేవుని చిత్తానుసారముగా జీవిస్తారో వారి కొరకు, ప్రభువు అటువంటి బిడ్డలను ప్రేమించుచున్నాడు. ఈ రోజున ఆలాగున జీవించడానికి ఆయన మీకు అటువంటి కృపనిస్తాడు. ఆయన అట్టివారిని అత్యంత సమీపస్థులుగా చేసుకుంటాడు. తద్వారా, మనము ఆయనను పిలువక మునుపే, ఆయన మనకు జవాబిస్తాడు.
మా యొక్క ప్రార్థన మహోత్సవాలలో, ఒక కూటమునకు హాజరైన ఒక సహోదరి ఉండెను. ప్రకటనలు చేయుచున్న వ్యక్తి మేము మీకిచ్చిన ధరఖాస్తులో మీ యొక్క ప్రార్థన విన్నపాన్ని వ్రాయండి అని చెప్పినప్పుడు, ఈ ప్రార్థన విన్నపాలన్నియు కూడా డాక్టర్. పాల్ దినకరన్గారి యొద్దకు తీసుకొని రాబడుతుంది. వారు ఆ విన్నపముల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు మరియు ఆ ప్రార్థనలన్నిటికి ప్రభువు జవాబిస్తాడు అని చెప్పుచుండగానే, ఈ సహోదరి కూడా ఎంతో విశ్వాసముతో తన ప్రార్థన విన్నపములను వ్రాయుచుండెను. అయితే, ఆ కూటము ముగిసిన తర్వాత, ఆ సహోదరి వేదిక మీదికి వచ్చి, ఏమని చెప్పారంటే, నేను ఈ ప్రార్థన విన్నపము వ్రాయుచుండగానే, సగములోనే, నాకు ఒక వర్తమానము వచ్చినది. దేవుడు నాకు ఒక ఉద్యోగము ఇవ్వాలని నేను దేవునిని అడుగుచున్నాను. నేను ఈ ప్రార్థన విన్నపమును వ్రాయుచుండగానే, ఆ యొక్క మధ్యలోనే నాకు ఒక కాల్ రావడము జరిగింది. దేవుడు నాకు ఉద్యోగమును అనుగ్రహించియున్నాడు. నేను వ్రాయుచున్న దానిని ప్రభువు ఎంతగానో చూచియున్నాడు కదా! అవును, నా ప్రియులారా, మీరు ఆయనను పిలువక మునుపే ఆయన మీకు జవాబిస్తాడు. మీరు ఇంకను మాటలాడుచుండగానే, ఆయన మనవిని ఆలకిస్తాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు మీరు ఆయనను అడగండి, మీ విన్నపములను ఆయనకు తెలియజేయండి, ఆయన మీకు జవాబిస్తాడు. ఇంకను నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కనికరముగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మాకు అత్యంత సమీపముగా ఉన్నందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీవు మాలో ప్రతి కదలికను గమనించుచున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, మా జీవితములు నీ కన్నుల యెదుట ఉంచబడియున్నవి. కనుకనే, నీవు మా అక్కరలన్నియు యెరిగియున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, మా శ్రమకు ఒక అంతమును తీసుకొని వచ్చి, మాకు అద్భుతములను చేయుము. ప్రభువా, మేము పిలువకముందే, మా హృదయములో ఉన్న దానిని చూచి మాకు జవాబును దయచేయుము.దేవా, మా హృదయములో ఉన్న బాధను చూచి, మమ్మును స్వస్థపరచుము. ప్రభువా, మా జీవితమునకు ఒక పునర్థురణను తీసుకొని రమ్ము. ఈ రోజు మేము నీ మంచితనం మరియు సమయపాలనపై నమ్మకంతో నీ ముందుకు వచ్చుచున్నాము. దేవా, మా హృదయాన్ని, మా ఆలోచనలను, మేము బిగ్గరగా మాట్లాడని నిశ్శబ్ద మొఱ్ఱలను కూడా నీవు చూస్తున్నావు. మేము దానిని వ్యక్తపరిచే ముందు మా ప్రతి అవసరాన్ని నీకు తెలుసు, మరియు నేను చూడలేని విధంగా నీవు పనిచేయుచున్నావు. దేవా, నీ కొరకు వేచి ఉన్నప్పుడు దయచేసి మా హృదయాన్ని నీ సమాధానము మరియు నిరీక్షణతో నింపుము. ప్రభువా, నీ దైవీక సమయపాలన మరియు పరిపూర్ణ ప్రణాళికలను విశ్వసించడానికి మా విశ్వాసాన్ని బలపరచుము. దేవా, మా హృదయంతో నిన్ను వెదకడానికి, విధేయతతో నడవడానికి మరియు మా జీవితంలోని ప్రతి విన్నపాలను ప్రేమతో ఏర్పాటు చేయగలవని నమ్మడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీవు మాకు విరోధంగా కాదు, మా పక్షముగా ఉన్నావు అనే సత్యంలో మేము విశ్రాంతి తీసుకొనునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, ఈ రోజు, మేము నీ కృప, నీ సాన్నిహిత్యం మరియు నీ జవాబులను, దృశ్యమైనవి మరియు అదృశ్యమైనవి రెండింటిని పొందుకొనునట్లుగా సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.