నా ప్రియ స్నేహితులారా, నేడు మనము బైబిల్ నుండి యోహాను 1:51వ వచనమును ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనములో యేసు ప్రభువు, " మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.'' అవును, ఈ వచనమును మనము చూచినట్లయితే, పాత నిబంధన కాలములో భక్తుడైన యాకోబు కలను ప్రతిధ్వనిస్తుంది, ఆకాశము నుండి భూమికి దేవదూతలు నిచ్చెన మీద ఎక్కుటయు దిగుటయు చూశాడని తెలియజేయబడినది. అయితే, దాని అర్థం ఏమిటి? దేవుని యొక్క చిత్తమును మరియు ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన పక్షముగా దేవదూతలు పనిచేస్తుంటారు. పరలోకానికి మరియు భూమికి మధ్య నిజమైన వంతెన లేక నిచ్చెన యేసు క్రీస్తు అని ఈ రోజు వాగ్దానము ద్వారా మనము చూడగలము. యేసు క్రీస్తు ద్వారానే మాత్రమే మనము రక్షణను పొందుకుంటాము మరియు ఆయన ద్వారా మన జీవితాలలో దేవుని ప్రణాళికలు మరియు ఉద్దేశములను నెరవేర్చి మరియు మనము ఆయన చిత్తాన్ని తెలుసుకుంటాము. పరలోకమునకు భూమికి మధ్య నిచ్చెన ఆయనే అయి ఉంటున్నాడు. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.

చైనా దేశములో, 'పరలోక ద్వారం' అని పిలువబడే ఒక స్థలము ఉన్నది, అక్కడికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. అనేక దేశముల నుండి అనేకమంది ప్రజలు అక్కడకు వచ్చి, ఆ నిచ్చెనను చూచి వెళ్లతారు. 2023వ సంవత్సరములో, దాదాపు 50 లక్షలమంది సందర్శకులు ఆ స్థలమును చూడడానికి వచ్చారు. ఆకాశము మరియు భూమికి మధ్య వంతెన అని పిలువబడే ఆ స్థలమును చూడాలని ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు. ఆశతో శిఖరం వద్ద నిలబడటానికి దాదాపు 999 మెట్లు కూడా ఎక్కుతారు. ఆ స్వర్గ శిఖరమును ఎలాగైన చూడాలి అనుకుంటారు. కానీ, నా ప్రియ స్నేహితులారా, ఇక్కడ మీకొక శుభవార్త ఉన్నది! పరలోకానికి చేరుకోవడానికి మనం కష్టపడవలసిన అవసరం లేదు లేక మెట్లు ఎక్కడం అవసరం లేదు. పరలోకమునకు మరియు భూమికి మధ్యన ఉన్న నిచ్చెనకు మనకు సంపూర్ణ ప్రవేశము కలదు. నిజమైన మరియు శాశ్వతమైన వంతెనకు మనకు ఇప్పటికే పూర్తి ప్రవేశం కలదు. కనుకనే, మనం యేసుక్రీస్తును నమ్మినప్పుడు, ఆయనే మనకు న్యాయవాధియై యున్నాడు. బైబిల్ నుండి 1 యోహాను 2:1,2వ వచనములలో చూచినట్లయితే, "నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యా సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు'' అని చెప్పబడిన ప్రకారం ఆయనే మన పక్షమున ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆలాగుననే, యేసయ్య ప్రక్కన సిలువ వేయబడిన దొంగ కూడా యేసు ప్రభువుతో ఇలాగున చెప్పాడు, "ఆయనను చూచి, 'యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.' అందుకాయన వానితో, "నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.'' ఆ ప్రకారం ఆ దొంగకు ఉత్తరవాదిగా యేసుక్రీస్తు ఉండెను. అదేవిధముగా, నేడు మీ కొరకు కూడా ఆయన ఒక ఉత్తరవాదిగా ఉంటాడు.

కనుకనే, నా ప్రియులారా, మీరు పాపము చేయడానికి ప్రయత్నించి, పడిపోవుచున్నప్పుడు, మీరు పశ్చాత్తాపము నొందినప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు మీరు అందులో నుండి బయటకు రావడానికి మీకు సహాయము చేస్తాడు. పరలోకమునకు వెళ్లడానికి మీకు ఆయనే నిచ్చెనగా ఉంటాడు. కనుకనే, ఆయనను నమ్మండి, ఆయనన విశ్వసించండి మరియు మీకు సహాయము చేయడానికి ఆయనను మీలోనికి అనుమతించండి. ప్రతిరోజు మీ జీవితములో ఆయనకు చోటు ఇవ్వండి, ఈ రోజు నేను ఏమి చేయాలి ప్రభువా? అని ఆయనను అడగండి. దేవా, నా జీవితములో ఈ రోజు నీ చిత్తమును ఎలా చేయాలి? అని మీరు అడగండి. మీరు ఆయనను నమ్మండి, అప్పుడు ఆయన మీ కొరకు కలిగియున్న ప్రణాళికలను మీకు బయలుపరుస్తాడు. మీ యొక్క పాపము నుండి, శోధన నుండి ఆయన మిమ్మును దూరముగా ఉంచుతాడు. పరలోక మార్గములో ఆయన మిమ్మును నడిపిస్తాడు. కాబట్టి, ఈ రోజు మీ విశ్వాసమును యేసునందు ఉంచండి. ఆయన మిమ్మును శోధనల నుండి దూరంగా నడిపిస్తాడు, తన వెలుగులో ఉంచు తాడు మరియు పరలోక మార్గంలో మిమ్మును నడిపిస్తాడు. కాబట్టి, నా ప్రియమైన స్నేహితులారా, ఆయనను నమ్మండి. మీ జీవితంలోని ప్రతి భాగంలో ఆయనను చేర్చుకోండి మరియు ఆయనను దేవుని సన్నిధికి సురక్షితంగా తీసుకెళ్లే వంతెనగా ఉండనివ్వండి. నేడు మీరు ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీ పక్షమున మీకు ఉత్తరవాదిగా ఉండి, మీ పక్షముగా ఈ భూమి మీదను మరియు పరలోకమునకు నిచ్చెనగా ఉండి మిమ్మును నడిపిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా కొరకు పరలోకము తెరవబడియున్నందుకై నీకు వందనాలు. ప్రతిరోజు ఒక్క అడుగు నీకు దగ్గరగా నీవు మమ్మును నడిపిస్తున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నీ యొక్క పరలోక రాజ్యమునకు వారసులముగా ఉండాలని నిర్ణయమును తీసుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీవు మా హృదయాలలోనికి ప్రవేశించి, నీవు మా కొరకు కలిగియున్న ప్రణాళికలను మేము తెలుసుకొనునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, నీతిమార్గములో మమ్మును నడిపించే నీ యొక్క ప్రతి అడుగులో మేము అడుగు వేయునట్లుగా మాకు నీ కృపను చూపించుము. యేసయ్యా, నీవు మా పక్షమున ఉత్తరవాదిగా ఉంటూ, మమ్మును పరలోకమునకు నడిపించుము. ప్రభువా, మా కొరకు నీవు కలిగియున్న ప్రణాళికలన్నియు నెరవేర్చుటకు మాకు కావలసిన కృపను మాకు దయచేయుము. దేవా, మా పక్షమున ఉత్తరవాదిగా ఉండి, మాకు రక్షణ ఇచ్చినందుకు మరియు నిత్యజీవ మార్గంలో మమ్మును నడిపించినందుకు నీకు వందనాలు. యేసయ్యా, మేము పాపము చేసినప్పుడు, మమ్మును క్షమించి, బలహీనంగా భావించినప్పుడు, మమ్మును బలపరచుము. దేవా, ప్రతిరోజు నిన్ను విశ్వసించడానికి, నీ చిత్తాన్ని వెదకడానికి మరియు నీ మార్గంలో నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా జీవితం నీ ప్రేమను ప్రతిబింబించునట్లుగాను మరియు నీ ద్వారా పరలోకము మాకు తెరిచి ఉంచావని ఎల్లప్పుడు గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, అమూలమైన రక్షకుడవైన, మా న్యాయవాది మరియు మా వంతెన అయిన నీ మీద మేము మా పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచునట్లుగా కృపను దయచేయుము. దేవా, నీ స్వరాన్ని వినగలిగే, తెరవబడే చెవులను మరియు నీవు మా కొరకు ఉంచిన ప్రణాళికలను మేము చూడగలిగే కన్నులను మాకు ఇచ్చి, అందులో నడవగలిగే కృపను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.