నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 7:15వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచును...'' అని ప్రభువు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, నేడు మీ యొక్క సర్వరోగముల నుండి మీరు విడుదలను పొందుకుంటారు. అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 23:25వ వచనములో చూచినట్లయితే, "నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను'' అని చెప్పబడినట్లుగానే, మీరు ఆయనను సేవించినట్లయితే, ఆయన మీ ఆహారమును మరియు నీటిని ఆశీర్వదిస్తాడు. అవును, ఆయన మీ ఆహారమును నిశ్చయముగా ఆశీర్వదించి, మీ మధ్య నుండి రోగమును తొలగిస్తాడు. నా ప్రియులారా, మనకు ప్రభువు ఎప్పుడు స్వస్థతను ఇస్తాడని సెలవిచ్చియున్నాడు? పాతనిబంధన కాలములో ఇశ్రాయేలీయుల ప్రజలు బానిసత్వము నుండి బయటకు వచ్చునప్పుడు, వారు చేదు నీరు ఉన్న ఒక ప్రదేశమునకు చేరుకున్నారు. కానీ, వారి యొక్క దాహమును తీర్చడానికి అక్కడ మంచి నీరు లేవు. కారణము, అక్కడ ఉన్న నీరు చేదుతో నిండియున్నవి. ఆ నీరు మరణమునకు దారితీయును. అయితే, మనము బైబిల్ నుండి నిర్గమకాండము 15:26వ వచనములో చూచినట్లయితే, ఆ స్థలంలో ప్రభువు ఇలాగున అంటున్నాడు, "మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచిన యెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.'' కనుకనే, ఆయన మిమ్మును చూచి, "ఈ చేదు నుండి నేను మిమ్మును విడిపించెదను'' అని అంటున్నాడు.

ఒకానొక సమయములో ఒక భక్తిగల రాజు ఇలాగున పలికియున్నాడు మరియు అతడు లోతైన మరియు స్థిరమైన భక్తి, పవిత్రతను కలిగియున్నవాడని బైబిల్‌లో కూడా ప్రకటించబడినది. అతడు ప్రభువును వెంబడించిన ఒక నీతిమంతుడు కూడా, తన విశ్వాస ప్రయాణమును గురించి ధ్యానించుచూ, తన క్లిష్టమైన సమయాలలో కూడా దైవీకమైన ప్రణాళికయందు సహనముతో విశ్వాసమును కలిగియుంటూ, సమాధానము కొరకు ఎదురు చూచియున్నాడని బైబిల్‌లో తెలియజేయబడినది. కానీ, అతని జీవితములో చేదు అనుభవములు మాత్రమే మిగిలినవి. కారణం, అతనికి వ్యాధి సంభవించినది. అది మరణకరమైన రోగము వచ్చెను. కానీ, అతనిని ఒక భయంకరమైన వ్యాధి పట్టిపీడించిందని అతను తెలియజేసియున్నాడు. అయితే, ప్రభువు ఆ శాపమును తొలగించియున్నాడు. సరిగ్గా ఈ కారణం చేతనే, బైబిల్ నుండి గలతీయులకు వ్రాసిన పత్రిక 3:13 వ వచనములో చూచినట్లయితే, " ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను'' అని చెప్పబడినట్లుగానే, యేసు సిలువ మీద ఆ శాపమును ఆయన తన మీద మోపుకున్నాడు. ఆ శాపములోనికి ఒక భాగముగా ఉన్న వ్యాధులను ఆయన భరించియున్నాడు. అవును, పాపము వలన కలిగిన శాపమును ఆయన తనపై వేసుకున్నాడు. నా ప్రియులారా, మనలను విడిపించడానికి, ఆయన సజీవుడుగా నేడు మనతో కూడా ఉన్నాడు. అవును, " నేను మీ వ్యాధులను స్వస్థపరుస్తాను'' అని ఆయన సెలవిచ్చుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, యేసు ప్రభువు వద్దకు రండి. పాపము మనకు రోగములను తీసుకొని వచ్చినప్పటికిని, ఆయన మనలను క్షమించి, తిరిగి బాగుచేయుటకు సమర్థుడు.

అందుకే బైబిల్ నుండి మత్తయి సువార్త 9:2-6వ వచనములో మనము చూచినట్లయితే, ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి, 'నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా' వాడు లేచి తన యింటికి వెళ్లెను. పక్షవాతం కారణంగా నడవలేక, చేతులు పనిచేయని స్థితిలో ఉన్న అతడు యేసు వద్దకు తీసుకొని వచ్చినప్పుడు, ఆయన వానిని చూడగానే, ఆ అనారోగమునకు పాపమే కారణమని గ్రహించి, 'నీ పాపములు క్షమించబడినవి' అని అతనితో చెప్పెను. ఆ తర్వాత, ఆయన అతని వ్యాధిని కూడా స్వస్థపరచియున్నాడు. యేసుప్రభువు చెప్పినట్లుగానే, అతడు తన పరుపును ఎత్తుకుని ఇంటికి వెళ్లెను. నా ప్రియులారా, ఈరోజు, హాస్పిటల్‌కును మరియు ఇంటికి మధ్యన తిరుగుచున్న వారికి లేదా వీధుల్లో పడియున్న అటువంటి వారి వైపుకు, వారిని స్వస్థపరచడానికి ప్రభువు తన హస్తమును చాచియున్నాడు. నేడు ఆయన మీ పాపమును తొలగించి, మీకు స్వస్థతను మరియు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు. కనుకనే, నా ప్రియులారా, మీ జీవితమును ఆయన హస్తములకు అప్పగించినట్లయితే, నిశ్చయముగా, మీకు నేడే విడుదల దినము.

నా ప్రియులారా, వ్యాధులు ఈనాటికి కూడా అపవాది నుండి వచ్చుచున్నవని వాక్యము తెలియజేయుచున్నది. అందుకే బైబిల్ నుండి మార్కు సువార్త 9:25-26వ వచనములలో చూచినట్లయితే, ఒక బాలుడిని అపవాది చేత పీడింపబడుచున్నందున ఆ పిల్లవాడు మూగవానిగా ఉండెను, "జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తికొని వచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి, వానినెంతో విలవిలలాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చిన వానివలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి.' కానీ యేసు ఆ అపవిత్రాత్మను-అనగా, 'ఆ మూగవైన చెవిటి దయ్యమును చూచి, వానిని విడిచి బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు. వెంటనే, ఆ అపవిత్రాత్మ ఆ పిల్లవానిని విడిచి బయటకు వెళ్లిపోయెను. ఆ తర్వాత, అతను చచ్చినవాని వలె క్రింద పడిపోయినప్పుడు, అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆ పిల్లవాడు సంపూర్ణ స్వస్థతను పొందుకున్నాడు. ఆ తండ్రి ఎంతగానో సంతోషించాడు. నా ప్రియులారా, ప్రభువు మీ పిల్లలను కూడా స్వస్థపరుస్తాడు. ఆయన మీలో లేక మీ ప్రియులైనవారిలో ఉన్న అపవిత్రాత్మలను వెళ్లగొట్టి మీకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహిస్తాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు మీ మరియు మీ ప్రియులైన వారి శరీరములో ఎటువంటి వ్యాధులున్నను సరే, మీరు దేవునియందు విశ్వాసముంచినట్లయితే, నిశ్చయముగా, మీ వ్యాధుల నుండి ఆయన మిమ్మును విడిపించి, మీకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహిస్తాడు. కనుకనే, నా ప్రియులారా, యేసు నామంలో ఈ రోజు ఆ ఆశీర్వాదం మీ మీదకు మరియు మీ ప్రియులైన వారి మీదికి దిగివచ్చును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మీ మధ్య ఉన్న వ్యాధులను తొలగించి, మీ ఆహారపానీయమును దీవించును గాక.

ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మమ్మును స్వస్థపరచు యెహోవావు నీవే అని నమ్ముచూ, మేము నీ యొద్దకు వచ్చుటకు మాకు సహాయము చేయుము. దేవా, వ్యాధితో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి తీసుకొనివచ్చుచున్నాము. యేసయ్యా, మా జీవితములో ఉన్న ప్రతి వ్యాధిని, బాధను, బలహీనతను, మరియు శ్రమలను మా నుండి తొలగించి, మా పాపములను క్షమించి, నీ కృపచేత మమ్మును పవిత్రపరచుము. దేవా, పక్షవాయుచేత బాధపడుచున్న వానిని ముట్టి స్వస్థపరచి, అపవిత్రాత్మ నుండి ఆ చిన్న విడిపించినట్లుగానే, నీ యొక్క ప్రేమగల హస్తమును చాపి స్వస్థతను, విడుదలను మాకు దయచేయుము. దేవా, హాస్పిటల్‌లోను మరియు ఇంటి దగ్గర బాధపడుచున్నవారిని, నీవు తాకి వారిని స్వస్థపరచి, ఆశీర్వదించుము. ప్రభువా, మా పిల్లలను స్వస్థపరచి, మాకు సమాధానమును, బలమును అనుగ్రహించుము. యేసయ్యా, నీ యొక్క స్వస్థపరచు శక్తిని మా దేహములోనికి పంపించి, మాలో ఉన్న ప్రతి అవయములను తాకి స్వస్థపరచి, నీకు సాక్షులుగా జీవించునట్లుగా కృపను దయచేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.