నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు మీకు రక్షణానందమును అనుగ్రహించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 12:3వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు'' అని చెప్పబడినట్లుగానే, రక్షణ అనగా, పాపము నుండి విడుదల లేక స్వాతంత్య్రమును పొందుటయే. రక్షణ అనగా, పాపము యొక్క శాపము నుండియు కూడా విడుదల పొందుటయే. పాపము మరియు పాప శాపము మనలో నుండి వెళ్లిపోయినప్పుడు, హృదయములోనికి సంతోషము వచ్చుచున్నది. అవును, పాప క్షమాపణ ఒక గొప్ప ఆనందమును తీసుకొని వచ్చుచున్నది. నా ప్రియులారా, అట్టి రక్షణానందము నేడు మీకు అనుగ్రహించబడుచున్నది. కనుకనే, మీరు ప్రభువునందు ఆనందించండి.
మనము బైబిల్ నుండి ఇస్సాకును చూచినట్లయితే, "ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను'' అని చెప్పబడినట్లుగానే, ఇస్సాకు విత్తనము వేయగా దేవుడు అతనికి నూరంతల పంటను అనుగ్రహించియున్నాడు. ఆ తర్వాత, నీటి కొరకు బావులను త్రవ్వుటకు ప్రారంభించాడు. అయితే, అతనికి విరోధముగా శత్రువులు వచ్చారు. అయినను, అతడు తన తండ్రి త్రవ్విన బావులను మరల త్రవ్వగా, శత్రువులైన వారు వచ్చి, ఆ బావులను మూతవేశారు. అతడు నీరును పొందకుండా వారు జగడమాడిరి. అయితే, అతడు ముందుకు వెళ్లి మరొక బావిని త్రవ్వారు. వారు ఇస్సాకుతో పోట్లాడి, మరల ఆ బావిని కూడా వారు మూతవేశారు. వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి. అయినను, అతడు మరియొక ప్రాంతమునకు వెళ్లి, అక్కడ కూడా ఒక బావిని త్రవ్వారు. అక్కడ నీరు వచ్చినది. ఆలాగుననే, అతడు త్రవ్విన ప్రతిసారి నీవు వచ్చినది. అతడు అక్కడ నుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడ లేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యా దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొనిరి. వారు అతని యొద్దకు వచ్చిరి. అయితే, చివరిగా వారు ఏమన్నారంటే, "వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణముండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి.'' అదేవిధముగా, నా ప్రియులారా, ఈ రోజున కూడా మీరు త్రవ్వండి, జీవజలమైన యేసు కొరకు త్రవ్వండి. అప్పుడు, ఆయన మీలోనికి జీవమును తీసుకొని వస్తాడు. పాపము మరణమును తీసుకొని వస్తుంది. కానీ, యేసు పాపక్షమాపణను మరియు జీవమును తీసుకొనివస్తాడు. మీ పాపముల క్షమాపణ ద్వారా జీవము కలుగుతుంది. యేసు మీకు దానిని అనుగ్రహిస్తాడు. కనుకనే, నేటి నుండి యేసు కొరకు త్రవ్వకాన్ని కొనసాగించండి. శత్రువు మీ జీవితములో సమస్తమును మూతవేయాలని అనుకుంటాడు. కనుకనే, మీరు నిరంతరాయముగా ఆత్మీయ దాహముతో త్రవ్వండి. త్రవ్వుతూనే ఉండండి, అడుగుతూనే ఉండండి, ఇంకను, యేసు కొరకు వెదకుతూ, ఆయన కొరకు ఎదురు చూస్తూనే ఉండండి. ఇంకను నీరు మీకు వస్తూనే ఉంటుంది. జీవజలముగా ఉన్న యేసు మీలో నుండి ప్రవహిస్తూనే ఉంటాడు. హల్లెలూయా!
అందుకే బైబిల్ నుండి యోహాను 7:37-39వ వచనములలో మనము చూచినట్లయితే, యేసు ప్రభువు, "యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.'' ఆ ప్రకారముగానే, ఎవరైనను దప్పిక గొనియున్నట్లయితే, ఆయన యొద్దకు వచ్చి పానము చేయండి, వారి హృదయములలో నుండి జీవజలనదులు ప్రవహించునట్లుగా ఆయన చేస్తానని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, ఆవిధంగా ఆయన జీవమును కలిగియున్నాడు. సంపూర్ణముగా జీవముతో నిండియున్న ఇట్టి జలములు మీ హృదయములను గొప్పగా ప్రవహించవలెనని ప్రార్థించండి. ఇశ్రాయేలీయుల ప్రజలకు మరియు సమూయేలుకు శత్రువులైన ప్రజలు వ్యతిరేకముగా వచ్చినప్పుడు దేవుడు ఏమి చేశాడని, బైబిల్‌లో 1 సమూయేలు 7:5,6వ వచనములలో చూచినట్లయితే, "అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను'' అని చెప్పబడినట్లుగానే, సమూయేలు, ఇశ్రాయేలీయులు ప్రజలతో, 'శత్రువులు మనకు విరోధముగా వచ్చుచున్నారు కనుకనే, ప్రార్థించండి' అని చెప్పినప్పుడు, వారందరు కలిసి ప్రార్థించారు. అంతమాత్రమే కాదు, సమూయేలు నీళ్లు చేది, దేవుని యెదుట కుమ్మరించి, 'ప్రభువా, మేము పాపము చేసియున్నాము, మమ్మును క్షమించుము, ' అని అడిగాడు. అవునండి, నీళ్లు, క్షమాపణ శక్తికి సాదృశ్యముగా కనబడుచున్నది. యేసు యొక్క రక్తము, సమస్త పాపముల నుండి కడిగి శుద్ధీకరించుచున్నది. మనలో ఉన్న పాపమును బట్టి, అపవాది వచ్చి, మనలను నాశనము చేయుటకు ప్రయత్నము చేయుచున్నాడు. కానీ, మీరు క్షమాపణ కొరకు అడగండి. రక్షణ జలములు మీ మీద మీరు కుమ్మరించుకొనండి. యేసు రక్తము సకల పాపముల నుండి మిమ్మును కడిగివేయుచున్నది.
రెండవదిగా, బైబిల్ నుండి ఆదికాండము 1:12వ వచనములో చూచినట్లయితే, "భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను'' అని చెప్పబడినట్లుగానే, ఆ యొక్క నీరు ఉబుకుచూ, వారి యొద్దకు రాగానే, సౌందర్యవంతమైన ఫల వృక్షములు వికసించాయి. ఆలాగుననే, ప్రతి ఆశీర్వాదము మరియు ప్రతిఫలము మీ జీవితములో పనిచేయడము ప్రారంభిస్తుంది. మీరు జీవజలపు ఊటవలె ఉండెదరు. ఫలవృక్షముల ద్వారా ఫలములను తీసుకొని వచ్చెదరు. ఇందుకోసమై, యేసు సిలువకు మేకులతో కొట్టబడియున్నాడు. అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 17:6వ వచనములో చూచినట్లయితే, ఇశ్రాయేలీయుల ప్రజలు త్రాగడానికి నీళ్లు లేనప్పుడు, దేవుడు మోషేతో ఈలాగున చెప్పాడు, "ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను'' అని చెప్పబడిన ప్రకారముగా వారు చేసినప్పుడు, ఆ నీళ్లు ఆ బండలో నుండి బయటకు వచ్చినవి. ఇంకను 1 కొరింథీయులకు 10:4వ వచనములో చూచినట్లయితే, "అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే'' అని చెప్పబడిన ప్రకారముగా యేసుక్రీస్తు ఆ రాతి బండని చెప్పబడియున్నది. ఆధ్యాత్మిక జలములను తీసుకొనివచ్చు ఆ రాతి బండ ఆయనే. ఆయన సిలువలో కొట్టబడియున్నాడు, ఆయన ద్వారా జీవజలముల దాత ప్రవహించినది. ఈ రోజున మిమ్మును మీరు తగ్గించుకొని యేసును ఘనపరచండి. ఇంకను, పరిశుద్ధాత్మను మీలోనికి రానిచ్చి, మిమ్మును నింపాలని ఆయనను అడగండి.
అందుకే బైబిల్ నుండి లూకా సువార్త 11:13వ వచనములో చూచినట్లయితే, "పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను'' ప్రకారముగా, నా ప్రియులారా, మీరు పరిశుద్ధాత్మ కొరకై అడిగినట్లయితే, ఆయన మీ హృదయములలో జీవజలములు పారునట్లుగా చేయును. అంతమాత్రమే కాదు, ఆయన మిమ్మును తన యొద్ద నుండి ప్రవహించు జీవజలములతో నింపుతాడు. కాబట్టి, ఆయనను వెదకండి, ఆయన కొరకు దప్పిక కలిగి ఉండండి, మరియు ప్రతిదినం రక్షణాధారములైన బావులలో నుండి నీటిని తోడుకోండి. ఆయన తన సన్నిధితో మిమ్మల్ని నింపుతాడు, మీ ఆత్మను తృప్తిపరుస్తాడు, మరియు మీ జీవితంలో తన ఆశీర్వాదములను పొంగి ప్రవహించునట్లుగా చేస్తాడు, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. యేసయ్యా, నీ యొక్క అమూల్యమైన రక్తంతో నీ పిల్లలైన మమ్మును కడిగి, మా యొక్క ప్రతి పాపం నుండి మమ్మును శుభ్రపరచుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మును నింపి, మా జీవితములలో జీవజలనదులు ప్రవహించునట్లుగా చేయుము. ప్రభువా, నీవు ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా మమ్మును కూడా నూరంతలుగా ఆశీర్వదించుము. దేవా, మాకు నీ యొక్క ప్రతి ఆత్మీయ ఆశీర్వాదం మరియు నూరంతలఫలమును మా జీవితములలో సమృద్ధిగా ఉండునట్లుగా చేయుము. పరిశుద్ధాత్మ దేవా, మమ్మును నడిపించి, బలపరచి, మా ఆత్మలో ఉన్న ప్రతి దాహమును తీర్చుము. ప్రభువైన యేసయ్యా, మమ్మును నీ రక్తముతో కడగండి, సకల పాపముల నుండి మమ్మును శుద్ధీకరించుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మును నింపుము. ప్రభువా, ప్రతి ఆశీర్వాదము మరియు ప్రతిఫలము మా జీవితములోనికి వచ్చునట్లుగా చేయుము. యేసయ్యా, నీ నామమున మాకు ఎటువంటి కొదువ లేకుండా సమస్తమును సమృద్ధిగా ఉండునట్లుగాను సహాయము చేయుము. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మ శక్తిచేత మమ్మును నింపి, నీవు మాకు స్నేహితునిగా ఉండుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


