నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 2:28వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శనమనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు'' ప్రకారం అవును, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతిసారి సంపూర్ణ సంతోషములు ఉంటాయి. అనేకసార్లు సంతోషమును ఆనంద సమయాలతో మనము జతకడతుంటాము. మన విజయాలను వేడుకగా జరుపుకుంటుండవచ్చును, ఒక బిడ్డ నూతనంగా జన్మించినప్పుడు ఉండవచ్చును, కళాశాల నుండి పట్టాలను మరియు పదోన్నతి పొందుకున్నప్పుడు, వివాహము జరుపుకుంటున్నప్పుడు, మనము ఆనందపడతాము. సంతోషిస్తుంటాము. మన చుట్టు ఉన్న వారందరితో మనము ఆనందమును పంచుకుంటాము. అయితే, చెరసాలలో కూడా ఆనందమును అనుభవించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే, అపొస్తలుల కార్యములు 16:25-28వ వచనములలో మనము చూచినట్లయితే, చెరసాలలో పౌలు సీలలు దేవుని స్తుతిస్తూ ఉండడము మనము చూడగలము. అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, ఎంతగానో భయపడి, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనుటకు కూడా అతడు సిద్ధపడ్డాడు. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను. చెరసాల నాయకుడు అతడు ఎంతగానో భయపడుతూ, దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకు యెదుట సాగిలపడెను. జరిగినదంతయు చూచి, వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అప్పుడు పౌలు సీలలు అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. ఆ చెరసాల నాయకుడు రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తిస్మము పొందుకున్నారు. ఆ చెరసాల నాయకుడు వారికి భోజనము పెట్టి, అతడు ఎంతగానో ఆనందించాడు. అతడు దేవుని నమ్మడమును బట్టి ఆనందించాడు. అతను మాత్రమే కాదు, అతడును అతని ఇంటి వారందరును దేవుని ఆనందించారు. వారందరు కూడా దేవుని యొక్క ఆనందము చేత నింపబడియున్నారు. ఎందుకనగా, వారు దేవుని యొక్క రక్షణను కనుగొన్నారు. అవును, ప్రియ స్నేహితులారా, మన జీవితములో యేసును కలిగియుంటే ఎంతో ఆనందమును కలిగియుంటాము.

నా ప్రియులారా, వారు ఆనందమును ఎక్కడ అనుభవించారు? అది చెరసాల నుండి మొదలైనది. అప్పుడది చెరసాల నాయకుని ఇంటికి కూడా వెళ్లినది. అతనికి తెలిసిన వారందరికి యేసునందలి ఆనందమును గురించి, అతడు సాక్ష్యముగా పంచుకొని ఉండవచ్చును. అనేకసార్లు మనము అనుకుంటాము కదా, మనము ఆయన సన్నిధిలో ఉన్న ఆనందమును అనుభవించాలంటే, ఒక మందిరములో కానీ, లేక ఒక ప్రత్యేకమైన స్థలములో గానీ గడపాలి అని తలంచుతాము కదా! కానీ, బైబిల్‌లో మత్తయి 18:20వ వచనములో చూచినట్లయితే, " ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. పౌలు సీలలు అతి అపరిశుద్ధమైన స్థలములలో చేరారు. పాపులు, ఖైదీలతో నిండియున్న చెరసాలలో చేరారు. కానీ, ఇద్దరు కలిసి, ప్రభువును స్తుతించారు. అక్కడ ఆనందము కలిగినది. దేవుని సన్నిధి ఆ స్థలమును నింపినది. ఆ చుట్టు ఉన్న వారందరిని వ్యాప్తిచెందినది. అక్కడ రక్షణ కలిగినది. రక్షణానందము కలిగినది.

అవును నా ప్రియ స్నేహితులారా, ప్రభువు నేడు మిమ్మును కూడ ఆనందముతో నింపాలని కోరుచున్నాడు. ఎందుకనగా, ప్రభువు మీ యందు ఉన్నాడు. ఆయన సన్నిధి మీ యందు ఉన్నది. ప్రతి ఉదయము ఈ ఆనందముతో మిమ్మును మీరు నింపుకొనండి, దేవుని సన్నిధి మీ జీవితములోనికి ఆహ్వానించండి. ఏది మిమ్మును ఎంత మాత్రము నిరుత్సాహపరచలేదు. లోకము యొక్క మాటలు ఏవి కూడా మిమ్మును నిరుత్సాహపరచజాలవు. మీలో నుండి ప్రభువు ఆనందము పొంగిపొర్లుతుంది. మీ చుట్టు ఉన్న వారందరికి వ్యాప్తి చెందుతుంది. మీతోటి సహోద్యోగులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులందరికి కూడా. వారందరు కూడా మేము రక్షణ పొందుకోవాలంటే, మేము ఏమి చేయాలని అడుగుతారు. ఈ సంతోషమును మా జీవితములో ఎలా పొందుకోవాలి? అని అడుగుతారు. మీరు వారిని ప్రభువు చెంతకు నడిపిస్తారు. ఈ ఆనందాన్ని వారు కూడా పొందుకొనునట్లుగా చేస్తాడు. ఈ రోజు మీ జీవితములో ఈ నిర్ణయమును తీసుకొనండి. "ప్రభువా, రోజు నీ సన్నిధిలో గడుపుచుండగా, నీ ఆనందముతో మమ్మును నింపుము. అది మాలో నుండి పొంగిపొర్లునట్లుగా చేయుము. ఇతరులు కూడా మా ద్వారా ఈ ఆనందమును అనుభవించునట్లుగా చేయుము. నీ యొక్క రక్షణానందమును మా ద్వారా అందరు పొందుకొనునట్లుగా సహాయము దయచేయుమని ' ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా మిమ్మును ఆశీర్వదిస్తాడు.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ సన్నిధి ఆనందానికి వందనాలు. దేవా, పౌలు మరియు సీలలు చెరసాలలో నిన్ను స్తుతించినట్లుగానే, మా ప్రతి పరిస్థితిలోనూ ఆనందించడం మాకు నేర్పించుము. ప్రభువా, నీ ఆత్మ మాతో ఉందని తెలుసుకొని, మా కోసం మాత్రమే కాకుండా, మా చుట్టూ ఉన్నవారు కూడా నీ మంచితనాన్ని రుచి చూసి తెలుసుకొనునట్లుగాను, నీ ఉప్పొంగే ఆనందంతో మమ్మును నింపుము. దేవా, ఇతరులను నీ వైపు నడిపించుటకు మా జీవితం నీ యొక్క రక్షణ ఆనందంతో ప్రకాశింపజేయుము. ప్రభువా, ఈ రోజు మేము మా హృదయాన్ని నీ హస్తాలకు సమర్పించుకొనుచున్నాము, నీ సన్నిధి, నీ ఆనందం మరియు నీ కృపతో మమ్మును మరల నింపుము. ప్రభువా, రోజు నీ సన్నిధిలో గడుపుచుండగా, నీ ఆనందముతో మమ్మును నింపుము. అది మాలో నుండి పొంగిపొర్లునట్లుగా చేయుము. ఇతరులు కూడా మా ద్వారా ఈ ఆనందమును అనుభవించునట్లుగా చేయుము. నీ యొక్క రక్షణానందమును మా ద్వారా అందరు పొందుకొనునట్లుగా సహాయము దయచేయుము. ప్రభువా, మేము నీ ఆనందమును పొందుకొనుటకు నీ సన్నిధిలో వేచియున్నాము. మా పరిస్థితులు ఏలాగున ఉన్నను సరే, నీ సన్నిధితో మమ్మును నింపి, నీ ఆనందము మాకు బలమును దయచేయునట్లుగా చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.