నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీకు శుభములు తెలియజేయుటలో నేను ఎంతగానో ఆనందించుచున్నాను. ఆలాగుననే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 22:29వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మనలను రాజుల యెదుట నిలువబెట్టవలెనని మన పట్ల కోరుచున్నాడు. ఇది ఎంత చక్కటి వాగ్దానము కదా! దేవుడు మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని మాత్రమే కాక, ఆయన, మీకు అప్పగించిన పనిలో ఉన్నతంగాను, నైపుణ్యం కలిగిన వారిగానూ తయారు కావాలని కూడా మీ పట్ల కోరుకుంటున్నాడు.
నా ప్రియులారా, ఈ వచనమును చదివినప్పుడు, ఒక గొప్ప చిత్రకారుడైన లియోనార్డో డా విన్సీ జీవితమును నాకు జ్ఞాపకమునకు వచ్చినది. అతడు ఒక నైపుణ్యముగల చిత్రకారుడు అని మనకందరికి తెలుసు కదా! అతని గురించి మనకు ఎక్కువగా తెలియకపోయినను, అతని యొక్క చిత్రములు అన్ని గృహములలో ఉండి ఉండవచ్చును. చివరి విందు చిత్రమును అతడు చిత్రీకరించియున్నాడు. అతడు ఏదో గొప్ప ధనవంతుడు లేక విద్యావంతుడు అని అందరు అనుకుంటుండవచ్చును. కానీ, అతడు ఒక సాధారణమైన నేపథ్యము నుండి వచ్చిన ఒక సాధారణమైన వ్యక్తి. అతను పెద్దగా చదువుకోలేదు కూడా. అయితే, అతడు కళను ఎంతగానో ప్రేమించాడు. అతనికి ఉన్న ఆసక్తిని బట్టి చిత్రాలను గీయడము గురించి అతడు నేర్చుకున్నాడు. చిత్ర లేఖన పద్ధతులను మాత్రమే కాదు, శరీరములోని కండరాలు ఎలా కదులుతాయని తెలుసుకొనుట కొరకు, అతడు శరీర నిర్మాణ శాస్త్రమును కూడా చదువుకున్నాడు. నిర్మాణ వాస్తు శాస్త్రము మరియు విజ్ఞాన శాస్త్రములను నేర్చుకున్నాడు. ఖచ్చితత్వముతో చిత్రాలను గీయడానికి మరియు చిత్రించుటకు అనేక అంశములను అతడు నేర్చుకున్నాడు. అతనికి ఉన్నటువంటి అత్యాసక్తిని బట్టి, తను చేయుచున్న పనిలో గొప్ప నైపుణ్యతను సంపాదించుకున్నాడు. తన చిత్రాలను చిత్రించుటకు ముందుగా, అతడు వేలకొలది పేజిలను గీసేవాడు. అతని చిత్రాలు ఖచ్చితత్వముతో చక్కగా అద్భుతముగా ఉండునట్లుగా, అతడు ఎన్నో చిత్రాలను చిత్రించేవాడు. కాబట్టి, చివరికి అతడు ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడుగా మారాడు. అతని యొక్క అనేక చిత్రాలు మ్యూసియములో పెట్టబడినవి. అవన్నియు, గొప్ప ధరకు కూడా కొనబడినవి. అతని జీవిత చివరిలో ఫ్రాన్స్ న్యాయస్థానము యెదుట కూడా చిత్రీకరించాడు. గొప్ప రాజ్యములో, రాజుల యెదుట ఎంతో నైపుణ్యముతో తాను చిత్రములను చిత్రించి ప్రఖ్యాతిగాంచియున్నాడు.
నా ప్రియులారా, మనము మన పనిలో నైపుణ్యతను కలిగియున్నట్లయితే, రాజుల యెదుట మనము పనిచేయగలుగుతాము. బైబిల్ గ్రంథములో దానియేలు జీవితమును చూచినట్లయితే, ఆ దేశములో ఉన్న జ్ఞానులందరికంటె కూడా పదియంతల జ్ఞానవంతుడు. రాజుల యొద్ద జ్ఞానులు శ్రేష్టమైనవారు మాత్రమే ఉంటారు. రాజుల యొక్క ఆలోచనకర్తలు ఎక్కువగా శ్రేష్టులు మాత్రమే ఉంటారు. అయితే, వారందరికంటె దానియేలు పదియంతలు జ్ఞానవంతుడు. అందుకే, రాజు అతనిని బబులోను దేశములో ఒక అధిపతిగా నియమించాడు. అంతగా నైపుణ్యము కలిగియున్న వ్యక్తిగా దానియేలు ఉండెను. అతడు ఎంతో జ్ఞానవంతుడు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీరు చేయుచున్న పనిలో కూడా మీరు శ్రేష్టులైనవారుగా ఉండాలని అనుకుంటున్నాడు. ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఉండడము మాత్రమేకాదు, మీ పనిలో కూడా మీరు శ్రేష్టత్వము కలిగియుండాలి. ఏదో కుటుంబాన్ని పరామర్శించడానికి కొంత సంపాదించినట్లయితే చాలు అని అనుకుంటున్నారేమో? నేను బిల్లులు చెల్లించడానికి, ఆహారము తెచ్చుకోవడానికి ఉన్నట్లయితే చాలు అని అనుకుంటున్నారేమో? కానీ, నా ప్రియ స్నేహితులారా, రాజుల యెదుట మీరు పనిచేయువారినిగా ప్రభువు మిమ్మును లేవనెత్తాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. ఆయన, దేశములోని గొప్ప స్థానములలో మిమ్మును నిలబెట్టాలని అనుకుంటున్నాడు. అయితే, గొప్ప అధికారుల మధ్యలో మరియు ప్రభుత్వము మధ్యలో, దేశములోని నాయకుల మధ్యలో మీ ద్వారా ప్రభువు నామము మహిమపరచుబడు విధంగానే, మిమ్మును హెచ్చిస్తాడు.
కాబట్టి, నా ప్రియులారా, మీ ఉద్యోగములో, 'అయ్యో నా పనిని ఎవరు చూస్తున్నారని' చెప్పి ఏదో చేసి, ఆ పనిని ముగించివేయాలని అనుకోకూడదు. రోజువారి పనులను ఏదో చేసి, వారికి ఇచ్చివేయాలని అనుకోకూడదు. ఉపాధ్యాయురాలిగా ఏదో ఆలాగున చెప్పి వెళ్లిపోదాము అని అనుకోకూడదు. లేక రోజువారి పనులను ఏదోలాగున ముగించుకొని, రోజును గడిపివేయాలని అనుకోకూడదు. లేదు నా ప్రియ స్నేహితులారా, ప్రతి విషయములో శ్రేష్టమైన పనులను మనము చేయాలి. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 3:23,24వ వచనములలో చూచినట్లయితే, "ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు'' అని చెప్పబడినట్లుగానే, కాబట్టి, మీరు మీ పనిలో శ్రేష్టమైన పనులను చేయండి. నేడు మీరు చేయుచున్న పని చిన్నదని లేదా ఎవరూ గమనించలేదని అనుకోవద్దు. మీరు యథార్థతతోను, అంకితభావంతో పనిచేసినప్పుడు, దేవుడు, తన దయ, నైపుణ్యతకు మరియు ఉన్నత స్థానమునకు మార్గములను తెరుస్తాడు. నాయకుల ఎదుట నిలబడి వారికి ఆశీర్వాదంగా ఉండునట్లుగా ఆయన మిమ్మును సిద్ధపరుస్తాడు. మీరు రాజుల యెదుట పని చేస్తారు. కాబట్టి ఈ రోజు, మీ నైపుణ్యంలో వృద్ధిచెంది, దేవునికి మీ శ్రేష్ఠమైన దానిని అర్పించాలని మీ హృదయంలో నిర్ణయించుకొనండి. ఆయన మీ చేతులను బలపరచి, మీ మనస్సుకు మార్గనిర్దేశం చేస్తాడు. ఆయన తగిన సమయములో, మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చించి, ఘనపరుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మాకు అప్పగించిన పనిని బట్టి నీకు వందనములు. ప్రభువా, నీ యొక్క జ్ఞానం, తెలివి, మరియు శ్రేష్ఠతతో మమ్మును నింపుము. దేవా, మేము చేయుచున్న ప్రతి పనిలో నేర్చుకోవడానికి, ఎదగడానికి, మరియు మాకు కలిగియున్న శ్రేష్ఠమైన దానిని నీకు సమర్పించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా హృదయం నుండి సోమరితనం, భయం, మరియు నిరుత్సాహామును తొలగించి, మేము కష్టపడి పనిచేయునట్లుగాను, మా పనికి తగిన ఘనతను కలుగుజేయుము. దేవా, నీ కొరకు మేము పనిచేయునట్లుగాను మరియు పూర్ణహృదయంతో పనిచేయడానికి మాకు నేర్పించుము. ప్రభువా, మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి, మా మనస్సును మరియు మా యొక్క శక్తిసామర్థ్యములను బలపరచుము. ప్రభువా, మేము రాజుల యెదుట పనిచేయునట్లుగా మమ్మును లేవనెత్తుము. యేసయ్యా, దానియేలు వలె మా చుట్టు ఉన్నవారందరికంటె పదియంతలుగా శ్రేష్టులుగా ఉండునట్లుగా మమ్మును నీ యొక్క జ్ఞానముతోను, నైపుణ్యముతోను నింపి, మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, నీ యొక్క సంకల్పం ప్రకారం మమ్మును ఉన్నత స్థితికి హెచ్చించి, మా జీవితం నీ నామమునకు మహిమను కలిగించునట్లుగా యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


