నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 3:36వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి యుండును'' ప్రకారము కుమారుని యందు విశ్వాసముంచక, ఎవరైతే, ఆయనను అంగీకరించరో అనగా, ఆయనను రక్షకునిగా అంగీకరించకుండా ఆయనకు విధేయులుగా ఉండకుండా ఉంటారో, వారు నిత్యజీవమును చూడలేరు. అందుకు బదులుగా దేవుని యొక్క ఉగ్రత వారి మీద కుమ్మరించబడుతుంది. మనము దేవుని యందు విశ్వాసముంచినప్పుడు, మనము రక్షింపబడతాము. అయితే, మనము దేవుని వ్యతిరేకించి, ఆయనకు విరోధముగా పోరాడినప్పుడు మనపై దేవుని యొక్క ఉగ్రత దిగివస్తుంది. అయితే, ఈ లోకములో మనకు ఆస్తులు మరియు సంపద అన్నియు ఉండవచ్చును కానీ, దేవుడు లేకుండా వాటిని అనుభవించలేము. అంతమాత్రమే కాదు, మనము దుఃఖముతో కూడిన సంపదను కలిగియుంటాము. మనము ప్రభువును విశ్వసించి, ఆయనను మన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము రక్షింపబడతాము. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 6:23లో వాక్యము ఈ విధంగా చెబుతుంది, "ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము'' ప్రకారము నిత్యజీవము ప్రభువు మనకు అనుగ్రహించు ఒక బహుమానమై యున్నది. నా ప్రియులారా, మనము స్వంతగా దానిని సంపాదించుకొనజాలము. మనము కృప వలన మాత్రమే రక్షింపబడతాము. అది మన స్వంతగా మనము తీసుకొనలేము. కానీ, అది దేవుడు ఇచ్చు వరమై యున్నది. ఇంత గొప్ప రక్షణను మనము ఏ విధంగా నిర్లక్ష్యము చేసి, తప్పించుకొనగలము? అయితే, దేవుని యొద్ద నుండి మనము ఎప్పుడు కూడా దూరంగా పారిపోలేము కదా! కానీ, ప్రభువును ఎల్లప్పుడు మనము తోడుగా కలిగియున్నప్పుడు మనకు నిత్యజీవము కలుగుతుంది. అందుకే బైబిల్ నుండి 1 యోహాను 5:12వ వచనములో అదే చెబుతుంది, " దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను'' ప్రకారము మీరు దేవుని యందు విశ్వాసముంచండి మరియు నిత్యజీవమును పొందుకొనండి. ప్రియ స్నేహితులారా, నిత్యజీవం అనేది తాత్కాలికమైన ఆనందం కాదు. అది అంతం లేని జీవము, దేవునితో సహవాసంలో గల నిత్యజీవము. మనం యేసును మన స్వంత రక్షకుడిగా విశ్వసించి, నమ్మి, అంగీకరించినప్పుడు, మనకు ముగింపులేని నిత్యజీవము దొరుకుతుంది.
నా ప్రియులారా, ఈ నిత్యజీవము అనగా ఏమిటి? ఎటువంటి ముగింపు లేకుండా జీవము కొనసాగింపబడుతూనే ఉంటుంది. యేసయ్యా జీవమై యున్నాడు. మనము యేసులో ఉన్నప్పుడు మనము నిరంతరము యేసయ్యతోనే జీవించగలుగుతాము. ఈ లోకములో మనము మరణిస్తాము. కానీ, మన ఆత్మ నిరంతరము యేసయ్యతో పాటు జీవిస్తుంది. మన ఆత్మకు ఎప్పుడు మరణము లేదు. పరలోకపు ఆనందము ఎప్పుడు మనలోనే ఉంటుంది. మరణించిన తర్వాత కూడా మనము యేసయ్యతోనే నిరంతరము జీవించగలము. ఈ లోకములో మనము జీవమును అనుభవించగలము. జీవము యేసుక్రీస్తు మనకు ఇచ్చినటువంటి బహుమానము. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసము ఉంచుతారో, ఆయనను రక్షకునిగా అంగీకరిస్తారో, ఎన్నో రకాల నిబంధనలు ఉన్నాయి. కనుకనే మనము నమ్మి, విశ్వసించి, ఆయనను రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు మనము నిత్యజీవమును పొందుకొనగలుగుతాము. ఇది ఎప్పుడు కూడా అలుసుగా తీసుకొను విషయము కాదు. నా ప్రియులారా, మీరు, 'మేము ముసలివారమైన తర్వాత, అప్పుడు మేము యేసును అంగీకరిస్తాను' అని ఆలాగున చెప్పవద్దు. నా భర్తగారు ఆలాగున చెబుతుండేవారు. ఆయన Äౌవనునిగా ఉన్నప్పుడు తన స్నేహితులు ఇలాగున చెప్పేవారు, ' నీవు Äౌవనస్థుడవు, నీవు జీవితాన్ని చక్కగా అనుభవించాలి. ఇప్పుడే నీవు దేవుడు, దేవుడు అని వెళ్లనక్కరలేదు. నీవు ముసలివాడవైన తర్వాత, మీ తండ్రిగారి వలె అప్పుడు నీవు వాక్యమును చెప్పవచ్చును. ' ఇది అపవాది చేసే ఒక మోసము. అందుకే ప్రసంగి 12:1,2వ వచనములో చూచినట్లయితే, "దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము'' అని వాక్యము స్పష్టంగా తెలియజేయుచున్నది. కొంతమంది ప్రజలు వారు ధనవంతులు అయిపోయిన వెంటనే వారు దేవుని మరచిపోతారు. అందుకే రాజైన సొలొమోను బైబిల్ నుండి సామెతలు 30:8,9వ వచనములలో ఈ విధంగా తెలియజేశాడు, "వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన యెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో '' ప్రకారము నేడు మీరు ఎవరైనప్పటికిని సరే, ఒకవేళ మీరు బీదలైనను లేక ధనవంతులైనను సరే, ఎప్పుడు కూడా, ఎట్టి పరిస్థితులలో కూడా ప్రభువును విసర్జించకండి. ఆయనను అంగీకరించండి, ఆయనను నమ్మండి, ఆయనను విశ్వసించండి. యేసయ్యపైన మీరు పూర్తిగా ఆధారపడండి. ఆయన మీకు నిత్యజీవమును ఇస్తాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 14:6వ వచనములో, ఆయన మీకు జీవమై యున్నాడని చెప్పబడియున్నది. కనుకనే, భయపడకండి.
నా ప్రియమైన వారలారా, మనము ధనము కలిగియుండవచ్చును, సంతోషకరమైన కుటుంబ జీవితమును మనము కలిగి ఉండవచ్చును. అయితే మన జీవితములో ముఖ్యమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు నేడు మన మీదికి దిగివస్తాడు. కనుకనే, ఆయనను నమ్మి, ఆయనను విశ్వసించి రక్షకునిగా అంగీకరించినవారు నిత్యజీవమును పొందెదరు. అత్యధికమైనటువంటి విధానములో ప్రభువు యొక్క జీవము ఈ రోజు మీ మీదికి దిగివచ్చును గాక. నా ప్రియులారా, మీరు యేసును అంగీకరించినప్పుడు, ఆయన జీవము మీలోనికి ప్రవేశిస్తుంది. మీరు ఇకపై దేవుని ఉగ్రత క్రింద లేరు, కానీ ఆయన ప్రేమగల కృప క్రింద ఉంచబడియున్నారు. కనుకనే, యేసుతో జీవితం అనేది ఉద్దేశ్యం, సమాధానము మరియు పరలోక ఉత్తరవాదముతో నిండిన ఆశీర్వాదకరమైన జీవితం మీకు అనుగ్రహింపబడుతుంది. ఆయన ప్రేమ నుండి మిమ్మల్ని ఏదీయు వేరు చేయనివ్వకండి. ఈరోజు, మీ హృదయాన్ని తెరిచి, 'ప్రభువైన యేసు, మేము నిన్ను మా స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నాము. నీవే మా రక్షకుడివి మరియు మా జీవము' అని చెప్పినప్పుడు, మీరు ఆ అమూల్యమైన నిత్యజీవమును, దేవునితో శాశ్వతంగా కొనసాగే జీవితాన్ని పొందుకుంటారు. నా ప్రియులారా, నిరంతరము మీరు ఆయనతో జీవించే కృపను మీకు ఇచ్చును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రియమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసు, మమ్మును పాపం నుండి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చినందుకు నీకు వందనాలు. తండ్రీ, నీవే మాకు రక్షకుడవు మరియు మాకు నిత్యజీవమునై యున్నావు. యేసయ్యా, మమ్మును పాపములో నుండి విడిపించి, రక్షించడానికి వచ్చిన దేవుడవు నీవే. కనుకనే, నేడు మా పాపములను క్షమించి, మమ్మును రక్షించుము. యేసయ్యా, మేము ఎల్లప్పుడు నీ పేరును ధరించుకొనే కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మమ్మును చూచిన వారందరు మీరు దేవునికి చెందినవారు అని ఇతరులు చెప్పునట్లుగా చేయుము. దేవా, సమృద్ధియైన జీవమును ఇప్పుడు మాలోనికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ యందు విశ్వసించగలిగే కృపను మరియు నిన్ను పూర్తిగా నమ్మగలిగే కృపను మాకు దయచేయుము. యేసయ్య, నీవే మా రక్షకుడవు, నీవే మమ్మును రక్షించి, ఈ లోకములో ఉన్న మోసములన్నిటి నుండి నీవే మమ్మును కాపాడుము. దేవా, నీ యొద్ద నుండి మమ్మును ఏదియు కూడా దూరపరచకుండా చేయుము. ప్రభువా, మమ్మును నీ యొక్క శాశ్వత ప్రేమ మరియు సమాధానముతో నింపుము. దేవా, మేము నిత్యము నిన్ను నమ్మడానికి మరియు నిన్ను పూర్తిగా విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము ఈ సందేశాన్ని చదువుతున్నప్పుడు నీ జీవము మా హృదయంలోనికి ప్రవహించునట్లుగా చేయుము. దేవా, శత్రువు యొక్క ప్రతి మోసం నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, సంపద, గర్వం లేదా ఆనందం మమ్మును నీ నుండి దూరం చేయకుండా మమ్మును నీకు సమీపముగా వచ్చునట్లుగా చేయుము. దేవా, మా యవ్వనంలో మరియు వృద్ధాప్యంలో నిన్ను స్మరణకు తెచ్చుకోవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము నీతో ఎప్పటికీ మరియు నిత్యము పరలోకంలో జీవించేలా మమ్మును నీకు సమీపముగా ఉంచుము. ప్రభువా, మేము కలిగియున్నవాటన్నిటిని నీవు కాపాడి, ఈ రోజు వాగ్దానము ప్రకారము మాకు నిత్యజీవమును మాకు అనుగ్రహించి, నిరంతరము నీతో ఉండే కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


