నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 థెస్సలొనీకయులకు 3:5వ వచనమును ఈ రోజు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.'' అవును, నా ప్రియులారా, ఈ వచనానుసారంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యందలి ప్రేమయు మరియు క్రీస్తు చూపిన ఓర్పుతోను నింపబడాలి.

అందుకే బైబిల్‌లో 1 కొరింథీయులకు 14:1వ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, "ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి'' ప్రకారం యేసుక్రీస్తు ఆ సిలువలో మనలో ప్రతిఒక్కరి మీద తన ప్రేమను కుమ్మరించాడు. ఇంకను బైబిల్‌లో హోషేయ 11:4వ వచనములో చూచినట్లయితే, " ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి అకర్షించితిని '' ప్రకారం ఈ వచనములో గూఢమైన మరియు మృదువైన ప్రేమను చక్కగా వివరించబడినది. కాబట్టి, నా స్నేహితులారా, నేడు మీరు ప్రభువు వైపు చూస్తూ, తన యొక్క దైవీక ప్రేమతో మీరు నింపబడాలని ఆయనను అడగండి. అందుకే రోమీయులకు 5:5వ వచనములో ఇలాగున చెబుతుంది, "ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింప బడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింప బడియున్నది'' ప్రకారం మనము దేవుని ప్రేమతో నింపబడియున్నాము. బైబిల్‌లో చూచినట్లయితే, అపొస్తలుల కార్యములు 10:38వ వచనం ప్రకారం యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్మతోను మరియు దేవుని శక్తితోను నింపబడ్డాడు. కనుకనే, మనం ఆయన వైపు చూస్తూ, ఆయన ప్రేమను పొందుకుందాం.

నా ప్రియులారా, మరియు రెండవదిగా, బైబిల్‌లో లూకా 21:19వ వచనమును చూచినట్లయితే, "మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు'' ప్రకారం మీరు ఓర్పును కలిగినవారై ఉండాలి. కానీ, మనం ఈ ఓర్పును ఎలా పొందుకొనగలము? అందుకే బైబిల్‌లో రోమీయులకు 15:4 వ వచనమును చూచినట్లయితే, " ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి '' ప్రకారం దేవుని వాక్యము వలన మనము ఈ ఓర్పును పొందుకుంటాము. కనుకనే, ప్రతి రోజు మనము దేవుని వాక్యమును చదవాలి. ఇంకను క్రీస్తుయందలి ఓర్పు మనలోనికి వస్తుందని మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. మరియు దేవుని వాక్యము, తన యొక్క ప్రేమతోను మరియు దేవుని వాగ్దానములతోను నింపి, మీకు ఓర్పును కలుగజేస్తుంది. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు జీవితమును ఒక్కసారి పరీక్షించుకొనండి. ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీకు తన యొక్క ప్రేమను, ఓర్పును మీకు కుమ్మరిస్తాడు.

నా ప్రియులారా, ఈ రోజుల్లో, చాలా కుటుంబాలు, సమస్యలు, నిరాశ, విభజన మరియు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కానీ, ఈ రోజు పరిశుద్ధాత్మ మీలో చలించడానికి మీరు అనుమతిస్తారా? మీరు దేవుని ప్రేమను మరియు క్రీస్తు ఓర్పును పొందుకుంటారా? అప్పుడు మీ జీవితం యేసుక్రీస్తువలె సంపూర్ణంగా రూపాంతరపరచబడతాయి. ఇప్పుడే, యేసు నామంలో ప్రార్థించి ఈ ఆశీర్వాదం పొందండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించి, ఆయనకు మొఱ్ఱపెట్టినట్లయితే, నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
అమ్యూలమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము ఈ రోజు నీ యొద్దకు విశాల హృదయంతో వచ్చుచున్నాము. ప్రభువా, మా జీవితములో మేము సంతోషమును సమాధానమును పొందుకొనునట్లుగా కృపను చూపుము. దేవా, మా హృదయాన్ని నీ యొక్క పరిపూర్ణ ప్రేమ మరియు క్రీస్తు ఓర్పులోనికి నడిపించుము. ప్రభువా, యేసు సిలువపై కుమ్మరించిన దైవీకమైన ప్రేమతో మమ్మును నింపుము. యేసయ్యా, పరిశుద్ధాత్మా, దయచేసి నీ వాక్యంలో వాగ్దానం చేసినట్లుగా ఈ ప్రేమ మా హృదయంలో పొంగిపొర్లునట్లుగా చేయుము. ప్రభువా, ఓర్పుతో నడవడానికి, సహించడానికి, విశ్వసించడానికి మరియు ప్రతి శోధనను గట్టిగా పట్టుకోవడానికి మాకు నేర్పించుము. దేవా, నీ వాక్యంలో పాతుకుపోయి, దాని వాగ్దానాల నుండి ప్రతిరోజు బలాన్ని పొందకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితంలోని ప్రతి ప్రాంతాన్ని నీ యొక్క పరిశుద్ధాత్మతో తాకబడునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీకు లోబడునట్నుగాను, మా హృదయాలను మార్చుము. దేవా, మేము చేయుచున్న ప్రతి పనిలోను యేసును ప్రతిబింబించునట్లుగా మమ్మును మార్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.