నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 20:6వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యితరముల వరకు కరుణించు వాడనైయున్నాను'' అని చెప్పబడినట్లుగానే, దేవుని ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు ఆయన మనలను వెయ్యితరముల వరకు కరుణించునని చెప్పబడియున్నది. ఈ అద్భుతమైన వాగ్దానము ప్రతి కుటుంబము మరియు ప్రతి తరము పట్ల దేవునికున్న హృదయ వాంఛను బయలుపరచుచున్నది. కారణము, ప్రభువు పిల్లలను ఎంతో ప్రేమించుచున్నాడు మరియు నేడు ఆయన కరుణా హస్తము వారి మీద చాపబడియున్నది.

అందుకే బైబిల్ నుండి మార్కు 10:14-16వ వచనములలో చూచినట్లయితే, చిన్న పిల్లలను యేసు తన యొద్దకు చేర్చుకున్నట్లుగా మనము చదవగలుగుచున్నాము. ఆ వచనములో, " యేసు అది చూచి కోపపడి చిన్నబిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవుని రాజ్యము ఈలాటివారిదే. చిన్నబిడ్డవలె దేవుని రాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి, ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను'' అని చెప్పబడిన ప్రకారముగా, దేవుడు మీ యొక్క చిన్న బిడ్డలను కూడా ఆశీర్వదించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీ హృదయమును కలవరపడనీయకండి. అందుకే ప్రభువు, "మీ యొక్క చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి'' అని అంటున్నాడు. నా ప్రియులారా, ఒకవేళ, నేడు మీ పిల్లలు తప్పుదారి పట్టి ఉన్నట్లయితే, వారిని ఆయన చేతులకు అప్పగించండి. ఆయన వారి జీవితములను మారుస్తాడు; తన జీవముతో కూడా వారిని నింపుతాడు; వారికి జ్ఞానమును, ప్రజల దృష్టిలో అనుకూలతను, ఆధ్యాత్మిక ఎదుగుదలను మరియు సమృద్ధియైన కృపను అనుగ్రహిస్తాడు. మన దేవుడు కరుణామయుడు, దయాగుణము గలవాడు. తనకు అప్పగించబడిన పిల్లలను ఆయన ఎన్నటికిని మరచిపోడు. శారీరక లేదా మానసిక సవాళ్లతో బాధపడుచున్న పిల్లలను కూడా ప్రభువు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఇంకను మెదడు బలహీనత, జ్ఞాపకశక్తి లోపం లేదా ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు ఉన్న పిల్లల పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. నేడు ఆయన స్వస్థత కలిగించు హస్తము వారి మీద ఉంచుచున్నాడు. ఆయన తన జీవముగల శక్తితో ప్రతి బిడ్డను పునరుద్ధరించడానికి, బలపరచడానికి మరియు ఆశీర్వదించడానికి ప్రభువు శక్తిమంతుడై యున్నాడు.

నా ప్రియులారా, దేవుడు మీ పిల్లలను ఆశీర్వదించవలెనని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు. ఎందుకంటే, ఆయన వెయ్యి తరములను కరుణించు దేవుడు అని చెప్పబడియున్నది. అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 20:6వ వచనము ప్రకారము దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గ,కొనువారి పట్ల ఆయన వెయ్యితరముల వరకు కరుణిస్తాడని వాక్యము తెలియజేయుచున్నది. ఆయన ప్రేమ నిబంధన ఒక తరంతో ముగిసిపోవునది కాదు, అది మీ పిల్లలకు మరియు వారి తర్వాత తరముల వారికి కూడా కొనసాగుతుంది. కాబట్టి ధైర్యం వహించండి. ఎందుకనగా, ఆయన కనికరము మీ కుటుంబము మీద నిలిచి ఉంటుంది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 115:12-14వ వచనములలో చూచినట్లయితే, యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థుల నాశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులుగల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును '' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడని, వారిని ఆశీర్వదిస్తాడనియు, అలాగే వారిని మరియు వారి పిల్లలను వృద్ధి పొందిస్తాడని కూడా మన పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, ఆయన మీ పిల్లలను బుద్ధిజ్ఞానములను, తెలివిని మరియు దేవుని దయయందును మరియు మనుష్యుల దయయందును, దేవుని కృపలో ఎదుగునట్లుగా చేయుచున్నాడు. కనుకనే, భయపడవద్దు. ప్రభువు తానే వారిని స్థిరపరచి, జీవితంలోని ప్రతి రంగంలోనూ వారిని వర్ధిల్లజేస్తాడు.

అంతేకాకుండా, నా ప్రియులారా, మనము ప్రభువు ఆజ్ఞలను అనుసరించినప్పుడు మనము, మన పిల్లలు కూడా వర్ధిల్లెదరనియు మరియు ఆయన ఆశీర్వాదములను పొందుకొనెదరని వాక్యము తెలియజేయుచున్నది. అందుకే బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 4:40వ వచనములో చూచినట్లయితే, " మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను'' అని వ్రాయబడినట్లుగానే, మీరు కూడా నేడు ఆయన ఆజ్ఞాపించు తన కట్టడలను ఆజ్ఞలను మీరు గైకొనవలెను మరియు తల్లిదండ్రులు దేవుని మార్గములలో విశ్వాసంతో నడుచుకున్నప్పుడు, వారి పిల్లలు కూడా అదే మార్గమును వెంబడించునట్లుగా ప్రభువు వారికి సహాయము చేయుచున్నాడు. కనుకనే, ఆయన వారిని వర్ధిల్లజేసి, మిమ్మును తన యొక్క మేలులతో మిమ్మును నింపి, ఉన్నత స్థానములకు వారిని హెచ్చించి, ఘనపరుస్తాడు.

నా ప్రియులారా, ప్రతి బిడ్డ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలదు. అది సొలొమోను జీవితములో మనము చూడగలము. అందుకే బైబిల్ నుండి 2 సమూయేలు 12:24-25వ వచనములలో చూచినట్లయితే, " తరువాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను'' అని చెప్పబడినట్లుగానే, సొలొమోను పుట్టిన తర్వాత ప్రభువు అతనిని ప్రేమించి, ప్రవక్త ద్వారా అతనికి ఒక ప్రత్యేకమైన పేరును ఇచ్చాడు. ఇందునుబట్టి అతని జీవితం పట్ల దేవునికి ఒక దైవీకమైన ఉద్దేశము కలదని మనకు స్పష్టముగా తెలియజేయబడుతుంది. అదేవిధంగానే, నా ప్రియులారా, మీ పిల్లల విషయంలో దేవునికి ఒక ఉద్దేశము కలదు. ఆయన వారిలో ప్రతిఒక్కరిని వ్యక్తిగతంగా ఎరిగియున్నాడు, వారిని పేరుపెట్టి పిలిచియున్నాడు మరియు తన పరిపూర్ణమైన ప్రణాళిక ప్రకారం వారిని స్థిరపరుస్తాడు. చూడండి, సొలొమోనును గొప్ప రాజుగా ఎలాగైతే ఆయన ఉన్నత స్థాియికి ఎదుగునట్లుగా చేసియున్నాడో, అలాగుననే, మీ పిల్లలను కూడా ఉన్నతముగాను మరియు ఘనతను కలిగించునట్లుగా పైకి ఎదుగునట్లుగా చేసి, వారిని మరియు మిమ్మును అదేవిధముగా ఆశీర్వదించును గాక.

నా ప్రియులారా, మీ పిల్లలు వారికివ్వబడిన దేశంలో బలవంతులుగా ఉంటారు. వారు గొప్ప సమాధానాన్ని అనుభవించెదరు, దేవుని దయ కనికరమును పొందుకుంటారు మరియు ఆయన ఆశీర్వాదములతో నింపబడతారు. తల్లిదండ్రులుగా, వారి యెదుట నీతియుక్తమైన జీవితమును గడుపుచూ, దైవభక్తితో కూడిన జీవితమును మనము కలిగియుండవలెను. నా ప్రియులారా, కనుకనే, మీ మాటలు, మీ క్రియలు మరియు మీ హృదయ ధ్యానము కూడా ప్రభువుకు ప్రీతికరంగా ఉండునట్లుగా చేయును గాక; తద్వారా, మీ పిల్లలు మీ వలె దేవునిని అనుసరించి, ఆయన మార్గములలో విశ్వాసంతో నడుచుకొందురు గాక. వారు అలాగున చేయుచున్నప్పుడు, రాబోవు తరముల వరకు దేవుని కనికరమును, కనికరమును మరియు ఆశీర్వాదములను అనుభవించునట్లుగా, నా ప్రియులారా, ప్రభువు మీ పిల్లలను సమృద్ధిగా ఆశీర్వదించి, తన మహిమ కొరకు వారిని స్థిరపరచి, బలపరచి, వారిని దీవించును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నిత్యము మాతో నిలిచియుండు నీ యొక్క ప్రేమకు, నమ్మకత్వమునకు వందనములు. ప్రభువా, మా పిల్లలను నీ యొక్క కృపతో దీవించి, చదువులో వెనుకబడియున్న ప్రతి బిడ్డను తాకి, వారికి సంపూర్ణ స్వస్థతను, పునరుద్ధరణను అనుగ్రహించుము. దేవా, మా పిల్లలు మరియు మేము నిన్ను ప్రేమించునట్లుగాను, నీకు భయపడునట్లుగాను, మా హృదయములను మార్చుము. ప్రభువా, మా పిల్లలకు కావలసిన జ్ఞానము, విధేయత మరియు దైవభక్తిగల స్వభావంలో వారు ఎదుగునట్లుగా వారికి సహాయం చేయుము. దేవా, మా పిల్లలు నీ చిత్తమును జరిగించి, నీ మార్గములలో నడుచుకొనునట్లుగా కృపను చూపుము. యేసయ్యా, నీ యొక్క శాంతిసమాధానమును, నీ కాపుదల, సంరక్షణ మరియు దయకనికరమును మా కుటుంబము మీద ఎల్లప్పుడు నిలిచియుండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.