నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహె జ్కేలు 37:27వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడనై యుందును వారు నా జనులైయుందురు '' ప్రకారం మనము ఆయనకు జనులై ఉండాలని మన పట్ల కోరుచున్నాడు. మరియు మరొక అనువాదములో చూచినట్లయితే, "నా నివాసము వారికి మధ్యలో ఉండును, నేను వారి దేవుడై యుందును, వారు నా జనులై ఉందురు,'' అని వ్రాయబడి ఉన్నది. అవును, ప్రియులారా, ప్రభువు మన మధ్యలో మనతో ఉండడానికి ఇష్టపడుచున్నాడు. పాతనిబంధన కాలములో, ప్రత్యక్షగుడారములో ప్రభువు సన్నిధానము ఇశ్రాయేలీయులతో ఎల్లప్పుడు ఉంటూ ఉండేది. ఇశ్రాయేలీయులతో సంబంధము కలిగి ఉండే చోటు, ప్రత్యక్ష గుడారమై యుంటుంది. ప్రభువు వారి మధ్యలో నడుస్తూ ఉండేవాడు. ప్రభువు వారి మధ్యలో ఉంటు, ఎల్లప్పుడు ప్రభువు ప్రత్యక్ష గుడారములో నివసించాడు. కనుకనే, వారు దేవుని ప్రజలుగా పరిగణించబడ్డారు.

నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు మన మధ్యలో నివసించే గృహముగా మనలను చేస్తాడు. అందుకే బైబిల్‌లో 1 కొరింథీయులకు 6:19వ వచనములో మనము దానిని చూడగలము. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నది. మనము ప్రభువు యొద్ద నుండి పరిశుద్ధాత్మను పొందుకొనియున్నాము. మనము మన స్వంతము కాదు, 'నిన్ను నీవు నమ్ముకో,' అని ఈ లోకము అంటుండవచ్చును. కానీ, మన యందు మనము నమ్మిక యుంచలేము. ఎందుకనగా, మనము దేవుని బిడ్డలమై ఉంటున్నాము. మనము మన సొత్తు కాదు. మనలను మనము అంత తేలికగా తీసుకొనకూడదు. అవును, మనలో ప్రభువు నివసించుచున్నాడు. మన దేహము పరిశుద్ధాత్మ యొక్క ఆలయమై ఉంటుంది. ఈ లోకములో ఉన్నటువంటి ఎటువంటి పాపమును కూడా మనము తాకజాలము. మనము లోకములో నుండి వేరు చేయబడాలి. మనలను మనము పరిశుద్ధంగా ఉంచుకొనినప్పుడు, ప్రభువు మన యందు ఆనందిస్తాడు. ఆయన వచ్చి, మనలో నివసిస్తాడు. హబక్కూకు 1:13వ వచనములో చూచినట్లయితే, "నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా...'' ప్రకారం ప్రభువు ఎంతో పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన పాపమును చూడలేడు. ఆయన దుష్టులను మరియు దుష్టత్వమును భరించజాలడు. కాబట్టి, మనలను మనము ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి కదా.

కాబట్టి, నా ప్రియులారా, మనము పరిశుద్ధులతోను మరియు విశ్వాసులతోను జతకట్టబడాలి. మనము పరిశుద్ధంగా ఉండడము కొరకై, ప్రార్థన సహవాసములో మనము ఉండాలి. అందుకనే, ప్రార్థన గోపురము పరిచర్యకు రమ్మని మిమ్మును ఆహ్వానించుచున్నాము. మనము లోకపూరితమైన జీవితమును జీవించినప్పుడు, మనము ఈ లోకములో జీవించుచున్నాము. మనము దేవుని నమ్మనటువంటి వారితో కూడా మనము సంబంధాలు కలిగిఉండవచ్చును. అయితే, ఏదో ఒక విధంగా వారి యొక్క స్వభావము మనలోనికి ప్రవేశిస్తుంది. అందుకే ప్రభువును విశ్వసించేవారితో కూడా మన సహవాసము వారితో అనుసంధానము కలిగి ఉండాలి. మీ సమయమును ప్రభువునకు ఇవ్వండి మరియు మీ సంపదను ప్రభువునకు ఇవ్వండి. మీ కుటుంబమును ప్రభువునకు సమర్పించుకొనండి, ప్రభువునకు సంబంధించిన విషయాలను చేయండి. ఆ విధంగా ప్రభువు దినకరన్ కుటుంబ సభ్యులైన మమ్ములను పవిత్రంగా ఉంచుచున్నాడు. నా భర్తగారు తను మాత్రమకాదు గానీ, తన కుటుంబ సభ్యులందరు పరిశుద్ధులుగా ఉండాలని మరియు పరిచర్యలో పాలి భాగస్థులు కావాలి అని, ఎంతో జాగ్రత్త వహిస్తాడు. అదే మమ్మును పవిత్రంగా ఉంచుతుంది. అది మమ్ముల్ని ఐక్యతలో ఉంచుతుంది. మనము మనుష్యులము కనుకనే, మనస్సులో మాకు మనస్పర్థలు కలుగవచ్చును. కానీ, మేమందరము కలిసి, ఏకమై ప్రార్థన చేసినప్పుడు, మనస్పర్థలన్నియు తొలగిపోతాయి. మన యందు నివసించుచున్న పరిశుద్ధాత్మ దేవుని వలననే ఇవన్నియు జరుగుతుంది. కాబట్టి, విశ్వాసులతో జతకట్టబడండి. ప్రార్థన యోధులతో జతకండి. ప్రార్థన సహవాసములలో ఉండండి. మరియు మీ సమయమును, దేహమును ప్రభువునకు ఇవ్వండి, మిమ్మును మీరు ప్రభువునకు సమర్పించుకొనండి, యేసయ్య త్వరగా వస్తున్నాడు. మనము 'ఇంకా ఎక్కువగా పరిశుద్ధులుగా ఉండాలి అని ప్రభువు అంటున్నాడు. నీతిమంతులు మరి ఎక్కువగా నీతిమంతులుగా ఉండనివ్వండి అని అంటున్నాడు, నేను వాని వాని ప్రతి ఫలమును తీసుకొని త్వరగా వస్తున్నాను ' అని అంటున్నాడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, సిద్ధముగా ఉండండి, నేడు మీ దేహము ప్రభువు నివసించు ఆలయముగా మార్చుకొనండి. మనమందరము మన జీవితాలను ప్రభువునకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును తన ప్రజలను చేసుకొని, దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము మా మీదికి దిగి వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా హృదయాన్ని నీ మందిరముగా చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, మా దేహమును నీకు పవిత్రమైన నివాస స్థలంగా, నిష్కళంకముగా మరియు నీకు ప్రీతికరంగా మార్చుకొనుము. యేసయ్యా, అపవిత్రమైన దానిని తాకినందుకు మమ్మును క్షమించు; నీ ఆత్మతో మమ్మును శుభ్రపరచుము. దేవా, ఈ లోక ప్రభావం నుండి వేరుగా, పవిత్రతలో నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును నీకు దగ్గరగా తీసుకువెళ్ళే తోటి విశ్వాసులతో మమ్మును ఆవరించునట్లుగా చేయుము. దేవా, మా జీవితాన్ని నీ నామాన్ని మహిమపరిచే ప్రార్థన మరియు ఉద్దేశ్యంతో నింపుము. ప్రభువా, మేము నీకు అంగీకరమైన జీవితమును జీవించునట్లుగా మరియు నీకు యోగ్యులముగా కనిపించునట్లుగా, నీ కుమారుని రాకడకు మమ్మును సిద్ధం చేయుము. దేవా, మా జీవితాన్ని, మా సమయాన్ని, మేము కలిగియున్న సమస్తాన్ని నీకు శాశ్వతంగా సమర్పించుకొనుచున్నాము. నేడు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపి, నీ సేవలో మమ్మును పరిశుద్ధంగా వాడుకొను పాత్రగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.