నాకు అమూల్యమైన స్నేహితులారా, దేవుడు మీ కొరకై ఈ నూతన మాసములో ఒక అద్భుతమైన వాగ్దానమును కలిగియున్నాడు. ఈ నెల వాగ్దానముగా బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 2:17వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు'' అని ఆయన సెలవిచ్చిన వాక్యము ప్రకారం ఆయన మన మీద తన ఆత్మను కుమ్మరించాలని మన పట్ల వాంఛ కలిగియున్నాడు. అపవాది మీ మీద నిరుత్సాహాన్ని మరియు అణచివేతను మరియు ఏ మాత్రమును ప్రతిభను కలిగించకుండా, ఆటంకపరచే ఆత్మను కుమ్మరించడానికి ప్రయత్నిస్తుండగా, దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, " నా ఆత్మ మీకు స్వాతంత్య్రమును ఇచ్చును'' అని అంటున్నాడు. దేవుని ఆత్మ యెక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్య్రము ఉంటుంది. కనుకనే, దేవుని ఆత్మ మీ మీదికి దిగివచ్చినప్పుడు, మీరు ప్రవచించుటకు ప్రారంభిస్తారు. దేవుడు మాట్లాడుచున్నట్లుగా మీలో ప్రవచనము చెప్పి తద్వారా మీతో మాట్లాడుతాడు. దేవుడు మాట్లాడుచున్న రీతిగా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఓటమిని, భయమును లేక నష్టములను గురించి మాట్లాడడము కాదు, అపవాది చేయుచున్న కార్యములను మరియు చెడు ప్రజలు మీకు విరుద్ధముగా చేయు కార్యములను, మీ యొక్క అపజయములను గూర్చియు, మీ ఆత్మలో ఉన్న బలహీనతలను గూర్చి మాట్లాడడము కాదు, 'దేవుని యొక్క లేఖనములను మాట్లాడుట మరియు దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు మరియు దేవుడు నా పట్ల ఒక భవిష్యత్తును కలిగియున్నాడు' అని చెప్పుటయే. కనుకనే, మీరు తండ్రిని పరిశుద్ధాత్మను అడిగినట్లయితే, ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడని యేసు వాగ్దానం చేసియున్నాడు (లూకా 11:13). కనుకనే, మీరు అనాథలు కాదు. బైబిల్ నుండి లూకా 12:49-50వ వచనములలో ఆయన ఇలాగున అంటున్నాడు, " నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను... అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను.'' నా ప్రియులారా, బాప్తిస్మము అనునది ఆయన యొక్క త్యాగము మాత్రమే. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు బలిగా సమర్పించి, ఆత్మ శక్తితో తిరిగి లేచాడు మరియు ఇప్పుడు అదే ఆత్మను మీలో ఉచితంగా కుమ్మరించుచున్నాడు. ఎందుకంటే, ఆయన ఇప్పటికే మీ కోసం సిలువపై అన్నింటినీ క్రయధనముగా చెల్లించాడు. కనుకనే, మీరు చింతించకండి.
నా ప్రియులారా, దేవుని రాజ్యం వివాహ విందు లాంటిది (మత్తయి 22:1-14). పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు. పిలువబడినవారు అనేకులు నిరాకరించబడ్డారు. గనుక రాజమార్గములకు పోయి వారికి కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలిచెను. అదేవిధంగా, మీరు ఎంత అనర్హులు లేదా తిరస్కరించబడినట్లు భావించినా, దేవుడు మిమ్మల్ని పిలుచుచున్నాడు. "కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే'' అని చెప్పెను. నా స్నేహితులారా, మీరు ఎన్నుకోబడ్డారు, అందుకే మీరు ఇప్పుడు ఈ సందేశమును చదువుచున్నారు. కనుకనే, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని పవిత్రంగా జీవించేలా చేస్తాడు. బైబిల్ నుండి ప్రకటన 22:11-12వ వచనములలో యేసు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, " అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా యుండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది'' ప్రకారం ఎందుకు పరిశుద్ధత అవసరము? ఆయన యొద్ద ఉన్న ఫలమును మనము పొందుటకు మాత్రమే. బైబిల్ నుండి హెబ్రీయులకు 12:14 వ వచనములలో కూడా ఇలా ప్రకటించుచున్నది, "పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడనేరరు.'' అవును, పరిశుద్ధత ఇతరులతో సమాధానముతో కలసి ప్రవహిస్తుంది. క్షమించకపోవడం మన ప్రార్థనలను అడ్డుకుంటుంది (యెషయా 1:15; 1 యోహాను 3:15). అయితే, యేసు రక్తం మనలను కడిగి పవిత్రులనుగా చేస్తుంది మరియు ప్రేమించడానికి మరియు క్షమించడానికి వీలు కల్పిస్తుంది (హెబ్రీయులకు 12:24). పరిశుద్ధాత్మ కోసం తృష్ణ కలిగియున్న ఒక వ్యక్తి ఉండెను. కానీ. అతడు పరిశుద్ధాత్మను పొందలేకపోయాడు.కారణము, తనతో గొడవపడ్డ వారందరితో సమాధానం చేసుకోవాలని అతని యొక్క పాస్టర్ అతనిని ప్రోత్సహించాడు. తన సోదరి మీద ఉన్న కోపం గుర్తుకు వచ్చి, ఆమెను క్షమించమని కోరాడు. మరల అతడు ప్రార్థనకు తిరిగి వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మతో నిండిపోయాడు. సమాధానం మరియు క్షమించడం మన హృదయాలను నింపబడడానికి సిద్ధపరుస్తాయి. పరిశుద్ధాత్మ ఇతరులను ఆశీర్వదించడానికి కూడా మనకు శక్తినిస్తుంది. బైబిల్ నుండి యెషయా 60:22వ వచనములో ఇలాగున చెబుతుంది," వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును '' అని చెప్పినట్లుగానే, ఒక చిన్న, చదువురాని అమ్మాయి ఒకసారి ప్రార్థన సమావేశంలో పరిశుద్ధాత్మను పొందింది. తరువాత, ఆమె చర్చిలో, ఆమె ఖచ్చితంగా ప్రవచించడం ప్రారంభించింది. ప్రజలు పశ్చాత్తాపపడ్డారు, మరియు ఆమె ఆత్మతో నింపబడినందు, ఆమెకున్న దీనత్వము ద్వారా సంఘం వేల సంఖ్యలోనికి పెరిగింది. దేవుడు ఆమెను ఉపయోగించుకోగలిగినట్లయితే, ఆయన మిమ్మల్ని కూడా ఉపయోగించుకోగలడు. దేవుని ఆత్మ జ్ఞానమును, కృపను, వృద్ధిని కూడా తీసుకొనివస్తుంది. బైబిల్ నుండి లూకా 2:52వ వచనములో, యేసును గురించి ఇలాగున చెబుతుంది, "యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను'' అని చెప్పబడినట్లుగానే, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నింపినప్పుడు, మీరు కూడా జ్ఞానం మరియు దయలో వర్థిల్లుతారు. ఆయన మీ కార్యాలయంలో మరియు సమాజంలో మీకు ప్రవచనాత్మక పరిష్కారాలను కూడా ఇస్తాడు. నాయకులు మీ వైపు చూస్తారు. ఎందుకంటే, పరిశుద్ధాత్మ మీ ద్వారా మాట్లాడుతుంది.
నా ప్రియులారా, నేడు మీరు దీనిని స్వీకరించడానికి, మనం చిన్న పిల్లలవలె మనలను మనం తగ్గించుకోవాలి. యేసు మత్తయి 18:3 వ వచనములో ఇలాగున సెలవిచ్చాడు, "మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని చెప్పెను. దేవుడు తన రహస్యాలను ఆయనకు లోబడువారికి బయలుపరుస్తాడు (లూకా 10:21). బిడ్డలవంటివారుగా ఉండండి, ఆయనకు మొరపెట్టండి, ఆయన మిమ్మల్ని తన పరిశుద్ధాత్మతో నింపుతాడు. రెండంతలు అభిషేకమును అడిగిన ఎలీషా వలె (2 రాజులు 2:9), మీరు కూడా ఆయనను అడగండి. ఈ తరంలో తన ప్రవచనాత్మక ఆత్మతో నిండిన కుమారులు మరియు కుమార్తెల కోసం దేవుడు ఎంతో తృష్ణగొనియున్నాడు. నా స్నేహితులారా, పరిశుద్ధాత్మ ఇప్పుడు కూడా మీకు సమీపముగా ఉన్నాడు. ఆయన మిమ్మును నింపడానికి, నడిపించడానికి మరియు రూపాంతరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుకనే, నేడు మీ హృదయాన్ని తెరిచి ఇలా ప్రార్థించు: 'యేసు ప్రభువా, నాకోసం చనిపోయి లేచినందుకు వందనాలు. ఇప్పుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపమని నేను నిన్ను అడుగుచున్నాను. నన్ను పరిశుద్ధపరచుము, నన్ను నీ యొక్క ఆలయంగా మార్చుము మరియు ఇతరులను ఆశీర్వదించడానికి నన్ను నీ బిడ్డగా ఉపయోగించుకొనుము' అని మీరు అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నింపుతుంది మరియు మీరు ఎప్పటికీ మనుపటి వలె ఉండరు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఈ నూతన మాసమంతయు మిమ్మును తన పరిశుద్ధాత్మతో నింపి, వర్థిల్లునట్లుగా చేయును గాక.
ప్రార్థన:
కృపాకనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, అంత్యదినములలో ప్రజలందరిపై నీ ఆత్మను కుమ్మరిస్తానని నీవు ఇచ్చిన వాగ్దానానికి వందనాలు. దేవా, ఈ అమూల్యమైన పరిశుద్ధాత్మ వరమును మేము పొందగలిగేలా సిలువపై చనిపోయి తిరిగి లేచినందుకు నీక కృతజ్ఞతలు. ప్రభువా, మేము ఈ రోజు నీ సన్నిధికి వచ్చి, మమ్మును నీ పరిశుద్ధాత్మతో నింపమని వినయంగా అడుగుచున్నాము. దేవా, మా హృదయాన్ని నీ రక్తంతో శుద్ధి చేయుము, క్షమించరాని ప్రతి జాడను మా నుండి తొలగించుము, మరియు నీవు పరిశుద్ధుడవు గనుకనే, మమ్మును పరిశుద్ధంగా చేయుము. ప్రభువా, మమ్మును నీ ఆలయంగా చేయుము. దేవా, ఈనాడు మమ్మును సర్వసత్యంలోకి నడిపించుము, మరియు నీ ప్రేమ మరియు నీతిలో జీవించడానికి మాకు శక్తినిమ్ము. దేవా, ఇతరులను ఆశీర్వదించడానికి, నీ వాక్యాన్ని ధైర్యంగా మాట్లాడటానికి మరియు ఈ లోకంలోకి నీ వెలుగును తీసుకువెళ్ళడానికి మమ్మును నీ బిడ్డగా ఉపయోగించుకొనుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.