నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 థెస్సలొనీకయులకు 2:13వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " ఆ హేతువుచేతను, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది'' ప్రకారము మీలో దేవుని వాక్యం పని చేయుచున్నదని మీరు విశ్వసించినప్పుడు, అది మీలో శక్తివంతంగా కార్యసిద్ధి కలుగజేయును. దేవుడు మీకు అనుగ్రహించుచున్న దేవుని వాక్యమును విశ్వసించండి. ఈ రోజు, వాగ్దానముల ప్రకారం, దేవుడు మీకు దయచేయుచున్న వాక్యం ప్రకారం మీ జీవితంలో దేవుని కార్యాలను మీరు చూడగలరు. నా ప్రియులారా, ఈ దేవుని వాక్యం అంటే ఏమిటి? ఆ వాక్యమే యేసు. అందుకే బైబిల్ నుండి యోహాను 1:1వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను'' ప్రకారము ఆ వాక్యమే యేసుక్రీస్తు. అవును, యేసు మీ హృదయంలోనికి వచ్చినప్పుడు ఆ వాక్యం మీ వద్దకు వచ్చును మరియు ఆ వాక్యం మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆ వాక్యమైన యేసు మీలో క్రియలు జరిగిస్తాడు, తద్వారా సమస్తమును దేవుని అధికారము ప్రకారం జరుగుతుంది. కాబట్టి, భయపడకండి.

నా ప్రియులారా, ఈ దేవుని వాక్యము మనం అడిగిన ప్రతిదానిని మనకు అనుగ్రహించుచున్నది. అందుకే బైబిల్ నుండి యోహాను 15:7వ వచనములో యేసు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, " నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును'' అని చెప్పబడిన ప్రకారము మీరు దేవుని యందు నిలిచి ఉండినట్లయితే, అప్పుడు మీకు ఇష్టమైన వాటన్నిటిని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, మీరు కోరుకునే ఎలాంటి అద్భుతములైనను సరే, అవి మీ జీవితములో నెరవేర్చబడతాయి. ఇంకను మీకు కావలసిన ఏ సౌకర్యాలైనా సమకూర్చబడతాయి. మీరు తొలగించవేయాలనుకునే ఏ విషయాలైనా సరే, అవి తప్పకుండా తొలగించబడతాయి. కనుకనే, నా స్నేహితులారా, మీ హృదయమును కలవరపడనియ్యకుడి. మీ జీవితములో సమస్తమును జరిగించుటకు మీలో ఉన్న వాక్యమైన యేసుకు శక్తియు మరియు అధికారము కలదు. అదియుగాక, దేవుని వాక్యానికి సృష్టించే శక్తి కలదు. అందుకే బైబిల్ నుండి యెషయా 43:1; రోమీయులకు 4:17వ వచనములలో చూచినట్లయితే, లేనివాటిని ఆయన ఉన్నట్లుగానే పిలుచుచున్నాడు మరియు దేవుని వాక్యం వెల్లడియైనప్పుడు, మీ జీవితంలో దేవుడు సృష్టించాలనుకున్నదంతయు సమస్తము సృష్టింపబడుతుంది.

ఒక స్త్రీ ఉండెను, ఆమెకు ఉన్న తన ఏకైక కుమార్తె తీవ్ర జ్వరంతో చావునకు సిద్ధముగా ఉండెను. ఆమెకు సహాయపడడానికి తన భర్త కూడా లేడు మరియు ఆమె ఒక నిరుపేదరాలు. ఆసుపత్రిలో, వైద్యుడు ఆమె కుమార్తెకు తప్పు ఇంజెక్షన్ ఇవ్వడంతో, జ్వరం మరి తీవ్రంగా ఉండెను. ఆ చిన్నారి కళ్ళు ఎండిపోయిన టమోటాల మాదిరిగా మారిపోయాయి మరియు ఆ చిన్నారి కంటిచూపు మందగిలినది. తద్వారా, ఆ బిడ్డ ఎంతో వేదనలో మునిగిపోయినది మరియు చనిపోవడానికి సిద్ధంగా ఉండెను. అటువంటి సమయములో దేవుని వాక్యము యెషయా 43:1-2 వ వచనములు ఆ స్త్రీకి యొద్దకు వచ్చినప్పుడు, " అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు'' అన్న వాక్యము ద్వారా దేవుని శక్తి ఆమెలోనికి వచ్చినది. వెంటనే, ఆ చిన్నారి, 'అమ్మా' అని పిలిచింది. అంతమాత్రమే కాదు, 'అమ్మా, నాకు జ్వరం తగ్గిపోయింది' అని చెప్పింది. ఆ తల్లిలోనికి వచ్చిన దేవుని వాక్యము తన బిడ్డ యొక్క ప్రాణం కాపాడబడినది. అవును, నా ప్రియులారా, దేవుని వాక్యం మనలను కడిగి శుద్ధులనుగా చేయుచున్నది. అందుకే బైబిల్ నుండి 1 థెస్సలొనీకయులకు 4:8వ వచనములో మనము చూచినట్లయితే, "పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు'' అని చెప్పబడినది. మరియు హెబ్రీయులకు 4:12వ వచనములో చూచినట్లయితే, "ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది'' అని చెప్పబడిన ప్రకారము నా ప్రియులారా, దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గముకంటె బలమైనది. కనుకనే, ఆ రెండంచుల గల ఖడ్గముకంటె బలమైన వాక్యమును గైకొన్నప్పుడు అది మనకు నూతన జీవమును అనుగ్రహించుచున్నది. మరియు గొప్ప ఆదరణను కలిగించుచున్నది. ఈ దేవుని వాక్యం మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. నా ప్రియులారా, ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొని, దానిని విశ్వసించినప్పుడు, అది మీ జీవితంలో దేవుని నుండి గొప్ప కార్యాలను చూడగలరు. కనుకనే దిగులుపడకండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీలో అద్భుతమైన కార్యాలను జరిగించి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీ వాక్యము ద్వారా మమ్మును శుద్ధులనుగా చేసి, పరిశుద్ధులనుగా మమ్మును పిలిచినందుకై నీకు వందనములు. ప్రభువా, మాలో పనిచేయుచున్న నీ యొక్క జీవముగల వాక్యమునకై నీకు వందనములు. దేవా, మేము నీ వాక్యమును నమ్ముచున్నాము. యేసయ్య, నీ యొక్క విలువైన వాక్యం, మా హృదయంలో సమృద్ధిగా నివసించునట్లుగా చేయుము. దేవా, మాలో ఉన్న ప్రతి భయమును తొలగించి, నీ మాటలపై నమ్మకం ఉంచడానికి మమ్మును నీ యొక్క దైవీకమైన విశ్వాసంతో నింపండి. ఇప్పుడు కూడా, ప్రభువా, మా జీవితంలో లేని వాటన్నిటిని నీ యొక్క శక్తివంతమైన వాక్యంతో సృష్టించగలవని మేము పరిపూర్ణముగా నమ్ముచున్నాము. తండ్రి, నీ యొక్క వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, మా ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, మా హృదయము యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించి, నీ బిడ్డలనుగా మమ్మును మార్చుము. దేవా, దయచేసి మమ్మును నీ వాక్యము ద్వారా కడిగి శుద్ధులనుగా చేసి, నీ జీవాన్ని కలిగించే వాక్యం ద్వారా మమ్మును పునరుద్ధరించుము. ప్రభువా, నీ వాక్యము ద్వారా మా పట్ల అద్భుత కార్యములను కనపరచుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.