నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 40:29 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే'' ప్రకారం నేడు సొమ్మసిల్లిన మీకు దేవుడు తన బలమును అనుగ్రహించుచున్నాడు. కాబట్టి, మీరు దిగులుపడకండి.
నా ప్రియులారా, మీరు అలసిపోయి మరియు సొమ్మసిల్లియున్నారా? 'మేమెంతగానో కష్టపడుచున్నాను, కానీ, మాకు ఎటువంటి ప్రతి ఫలము కనబడడము లేదు. ప్రతిరోజు పనికి వెళ్లుచు కష్టపడుచున్నాను. ఒత్తిడికి గురవుచున్నానని మీరు భావించుచున్నారా?' ఈ రోజు ప్రభువు తన బలాన్ని మీకు ఇస్తాడు. మీ ఆత్మను పైకి లేవనెత్తండి, అప్పుడు మీరు అన్నియు సులభతరంగా చేయగలుగుతారు. ప్రభువు తన బలాన్ని మనకు ఎలా ఇస్తాడు? అనుదినము మనము ఆయన వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు, ఆయన మనతో మాట్లాడతాడు,ఆత్మీయ బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థనలో మనము ఆయనతో సమయమును గడిపినప్పుడు, మన ప్రాణాన్ని ఆయన సేదదీర్చి మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు. దైవీకమైన ఆలోచనల చేత ఆయన తన బలాన్ని మనకు ఇస్తాడు. తన దైవీకమైన బలము చేత ప్రభువు మనలను బలపరుస్తాడు.
బైబిల్లో మోషే జీవితములో మనము దీనిని స్పష్టంగా చూడగలము. మోషే అవసరతలో ఉన్నప్పుడు దేవుడు తన మామగారిని అతని యొద్దకు పంపించి, ఎలాంటి దైవీకమైన ఆలోచనలను ఇచ్చాడని మనము చూద్దాము. మోషే అవసరతలో ఉన్నప్పుడు, తన మామయైన యిత్రోను ప్రభువు పంపించి, అతనికి దైవీకమైన ఆలోచనలను ఇచ్చాడు. అనేకమంది ప్రజలు ఆలోచనల కొరకై అతని యొద్దకు వచ్చి, వారి సమస్యలను చెబుతుండేవారు. తద్వారా, అతడు ఒత్తిడికి గురవుచుండెను. మోషే ఇశ్రాయేలీయులను నడిపించాడు గనుకనే, అనేకులు ఆలోచనల కొరకు అతని యొద్దకు వచ్చేవారు. కానీ, ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరిని కలిసి, వారి సమస్యలకు పరిష్కారము చెప్పడము అతనికి ఎంతో ఒత్తిడిగా ఉండేది. మోషే ఎంతగా అలసిపోవుచూ, ఒత్తిడికి లోనవుచుండెనో, యిత్రో చూశాడు. అప్పుడు, అతడు మోషే యొద్దకు వచ్చి, ' నీవు చేయుచున్నది, సరైన పని కాదు ' అని యీత్రో మోషేతో మాట్లాడి ఇలాగున చెప్పాడు, ' నీవు ఒక్కడివే ఈలాగున చేస్తున్నట్లయితే, నీవు బలహీనుడవై పోతావు' అని ఆలోచన చెప్పాడు. చిన్న చిన్న సమస్యలను పరిష్కారించడానికి సరైన వ్యక్తులను ఎలా ఏర్పరచుకోవాలి? పెద్ద విషయాలను, సమస్యలను తను ఎలా పరిష్కారించుకోవాలని సరైన ఆలోచనలను అతనికి ఇచ్చాడు. అదేవిధముగా, సరైన మార్గములో నడవడానికి ప్రభువు మీకు సరైన వ్యక్తులను, మీకు ఆలోచనలు చెప్పడానికి మీ యొద్ద పంపుతాడు. మిమ్ముల్ని బలపరచడానికై వారు సరైన ఆలోచనలను మీకు ఇస్తారు.
కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీరు బలహీనంగా ఉన్న సమయములో దేవుడు మిమ్మును బలపరుస్తాడు. తన వాక్కు ద్వారా, మీరు ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయన మీతో మాట్లాడతాడు. సరైన మార్గములో మిమ్మల్ని నడిపించడానికై ఆయన ప్రజలను పంపుతాడు. ప్రియులారా, అందుకే బైబిల్ నుండి యెషయా 40:31వ వచనములో చూచినట్లయితే, "యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు'' ప్రకారం మీరు యెహోవా యొద్ద వేచి ఉన్నప్పుడు పక్షిరాజు వలె ఆయన మీ బలాన్ని నూతనపరుస్తాడు. మీరు అలయక, సొమ్మసిల్లిక నడిచెదరు. మీరు అలయక పరుగెత్తెదరు. కాబట్టి, నా ప్రియులారా, ప్రభువును విశ్వసించండి. మీ నిరీక్షణ ఆయన యందు ఉంచండి. మీరు ప్రతిరోజు ఆయన యొద్ద వేచి ఉండండి. ఆయన మీకు నూతన బలమును అనుగ్రహిస్తాడు. అప్పుడు మీరు అన్నియు సులభతరముగా చేయగలుగుతారు. నా స్నేహితులారా, ఈ రోజు మనము ఆ బలాన్ని పొందుకుందామా? ఆలాగైతే, నేడు మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, నిశ్చయముగా ప్రభువు నేటి వాగ్దానము ద్వారా మీకు నూతన బలమును ఇచ్చి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, అలసిపోయిన వారికి బలాన్ని, బలహీనులకు శక్తిని ఇస్తానని నీ ప్రేమపూర్వక వాగ్దానానికి వందనాలు. ప్రభువా, ఈ రోజు నీ బలముచేత మా హృదయాలను, మనస్సులను, ప్రాణాన్ని, శరీరాన్ని బలపరచుము. దేవా, ఎటువంటి బలహీనతలు ఉన్నను, ఒత్తిడి ఉన్నను, మమ్మును ఏదియు కిందికి లాగివేస్తున్నను సరే, ఈ రోజు వాటన్నిటిని తొలగించుము. ప్రభువా, నీ యొక్క సమాధానముతోను మరియు నీ దైవీకమైన బలముతో మమ్మును నింపుము. దేవా, ప్రతి పనిని కూడా సులభముగా చేయుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము బైబిల్ చదువుచుండగా, మేము చేయవలసిన పనులలో మాకు జవాబు దొరుకునట్లుగాను, మేము ప్రార్థించుచుండగా నీ స్వరాన్ని ఆలకించునట్లుగా చేయుము. ప్రభువా, మమ్మును సరైన మార్గములో నడిపించడానికి, సరైన వ్యక్తులను మాకు ఆలోచనలివ్వడానికి దైవీకమైన వారిని మా యొద్దకు పంపించుము. ప్రేమగల ప్రభువా, మేము మోయుచున్న భారంతో అలసిపోయి మా బలహీనతతో నీ దగ్గరకు వచ్చుచున్నాము. దేవా, మా ఆత్మను నీ వైపునకు ఎత్తుచున్నాము, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుము, ప్రార్థనలో మమ్మును పునరుద్ధరించుము మరియు నీ సన్నిధితో ప్రతిరోజు మమ్మును పునరుద్ధరించుము. దేవా, నీవు యీత్రోను మోషేకు పంపినట్లుగానే, మా జీవితంలోనికి దైవీకమైన ఆలోచనలను పంపుము. ప్రభువా, నీ యొక్క జ్ఞానంతో సమస్తమును చేయడానికి మరియు సమాధానము మరియు విశ్వాసంతో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము పక్షిరాజువలె నూతన బలముతో పైకి ఎగురునట్లుగా నీ కృపను చూపించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.