నా ప్రియమైన వారలారా, ఈ లోకములో మనకు అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని కటాక్షము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లేవీయకాండము 26:9వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మీ యందు కటాక్షముంచి, మిమ్మును ఫలవంతముగా మార్చి, మిమ్మును విస్తరింపజేసి, మీతో ఆయన నిబంధనను స్థిరపరుస్తాడని ప్రభువు ఇలాగున వాగ్దానము చేయుచున్నాడు. అవును, దేవుని కటాక్షము అనగా, ఆయన చూపుచున్న కనికరము, దయ మరియు కృపయై యున్నది. అవును, ప్రభువు మీ జీవితములో తన కృపను విస్తరింపజేయబోవుచున్నాడు. ఇది మన క్రియల మీద, విశ్వాసము మీద లేదా పవిత్రత మీద ఆధారపడి ఉండదు; అలాగే మన లోపముల వలన కూడా ఇది నిర్ణయించబడదు. అయితే, మనము ప్రభువు కనికరమును కోరుకున్నప్పుడు, దేవుని యొక్క కటాక్షము మన మీద కుమ్మరించబడుతుంది. ఇది మన జీవితములోని ప్రతి అంశంలోనూ సమృద్ధిని, ఆశీర్వాదములను, అభివృద్ధిని మరియు విడుదల తీసుకువస్తుంది.

నా ప్రియులారా, నేడు ప్రభువు మీతో తన నిబంధనను స్థిరపరచబోవుచున్నాడు మరియు మీ జీవితములో తన కటాక్షమును దృఢపరచబోవుచున్నాడు. నేడు, ఆయన మీ కోసము తన కృపా ద్వారములను తెరచుచున్నాడు. బహుశా! మీరు ఎంతో కాలంగా ఆయనకు మొరపెట్టుకుంటూ, ఆయన ఎందుకు మీ పట్ల దయ చూపలేదని లేదా ఒక ప్రత్యేకమైన విషయంలో ఎందుకు జోక్యం కలుగజేసుకోలేదని ఆలోచిస్తూ ఉండవచ్చును. నా ప్రియులారా, ఇంకను, ఆయన శక్తిని మీరు ఇంకా అనుభవించలేదేమోనని మీరు కలత చెందుతూ ఉండవచ్చును. అయితే ఇప్పుడు, ఆయన కృపా సహితమైన కటాక్షమును మీరు పొందునట్లుగా ప్రభువు మీకు మార్గమును సిద్ధపరచుచున్నాడు. మీ జీవితంలో జరగవలసిన పనులన్నింటినీ నెరవేర్చడానికి ఆయన తన దృష్టిని మీ మీద ఉంచుచున్నాడు. ఆయన మిమ్మును ఫలభరితులనుగా చేసి, మీ సంతానమును అభివృద్ధి పొందునట్లుగా చేస్తాడు. నేటి నుండి మీరు ఈ ఆశీర్వాదాన్ని పొందుతారని యేసు నామములో ప్రకటించుచున్నాను.

నా ప్రియులారా, మనము దేవుని దయను మరియు కటాక్షమును ఎలాగున పొందగలమని మీకు తెలుసా? అది విధేయత ద్వారా లభించును. కనుకనే, నా ప్రియులారా, మీరు యేసు వైపు చూడండి. అందుకే బైబిల్ నుండి లూకా సువార్త 2:51వ వచనములో చూచినట్లయితే, " అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను'' అని చెప్పబడినట్లుగానే, యేసుక్రీస్తు తన తల్లిదండ్రులతో కలిసి నజరేతుకు వెళ్లి, వారికి లోబడి ఉన్నాడని వ్రాయబడియున్నది. అందుకే, బైబిల్ నుండి లూకా సువార్త 2:52వ వచనములో చూచినట్లయితే, " యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను'' అని చెప్పబడినట్లుగానే, యేసు జ్ఞానములోను, శరీర ఎదుగుదలలోను, దేవుని దృష్టిలోను, మనుష్యుల దృష్టిలోను దయను పొందుతూ అభివృద్ధి చెందెనని చెప్పబడియున్నది. యేసు ఎలా వర్ధిల్లుచుండెను, అలాగే ప్రభువు మిమ్మల్ని ఫలవంతం చేసి, విస్తరింపజేస్తాడు. ఈ ఆశీర్వాదాన్ని అనుభవించే మార్గాలలో ఒకటి విధేయత. మిమ్మల్ని నడిపించే వారికి విధేయులుగా ఉండండి. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు చూపించిన దానిని చేయండి, మరియు పరిశుద్ధాత్మ నడిపింపునకు విధేయతతో నడుచుకోండి. మీ తల్లిదండ్రులకు కూడా విధేయులై ఉన్నప్పుడు, ప్రభువు మీకు తన కృపను చూపుతాడు. ఆయన మీ యందు దయతో దృష్టిని ఉంచుచున్నాడు, తద్వారా మీరు ఫలభరితులై విస్తరించెదరు. యేసు ఏ విధంగానైతే వృద్ధి చెందియున్నారని, మీరు కూడా అలాగే అభివృద్ధి చెందుతారు. ప్రభువు నేడు మీకు ఈ ఆశీర్వాదమును అనుగ్రహించును గాక! అంతేకాకుండా, మీ ఫలవంతమైన అభివృద్ధికి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకమును ఆయన తొలగిస్తాడు.

ఇందుకు ఉదాహరణగా బైబిల్ నుండి యాకోబును తీసుకున్నట్లయితే, అతడు తన తల్లిదండ్రుల మాట విని, అతని వెంట ఏదియు తీసుకొనకుండానే ప్రయాణమయ్యాడు. అయితే, ఆ ఆపత్కాలంలో కూడా అతడు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినది. అతని మామయైన లాబాను, అతని భార్యల సోదరులు అతనికి వ్యతిరేకంగా మారారు; అంతేకాక, అతని పట్ల అన్యాయంగా ప్రవర్తించారు. అతని మామ అనేకసార్లు అతని వేతనమును మారుస్తూ, అతనిని మోసము చేశాడు. అయినప్పటికీ, ప్రభువు యాకోబు పట్ల నమ్మకంగానే ఉన్నాడు. ప్రతి సవాలులోనూ, అన్యాయమైన ప్రతి పరిస్థితిలోనూ ప్రభువు అతనికి తోడుగా ఉండి, అతడు చేసిన ప్రతి పనిలోనూ అతనికి ఎల్లవేళల అభివృద్ధిని చేకూర్చాడు.

అతని మామగారు అతని వేతనం ఎంత ఉండాలని నిర్ణయించినప్పుడల్లా, యెహోవా యాకోబుకు విజయమును, జయమును, హెచ్చింపును, అభివృద్ధిని అనుగ్రహించి, అతనిని ఫలభరితునిగా చేసి, విస్తరింపజేశాడు. చివరకు అతని వేతన నిబంధనలు మార్చబడి, కేవలం కొన్ని ప్రత్యేకమైన గొర్రెలు మాత్రమే అతనికి చెందుతాయని చెప్పబడినప్పుడు కూడా, యెహోవా ఆ గొఱ్ఱెలను కూడా విస్తరించునట్లుగా చేశాడు. అన్యాయమైన ప్రవర్తన ఎదురైనప్పటికిని, ప్రభువు తన ఆశీర్వాదములను వర్థిల్లజేశాడు. అదేవిధంగా, నా ప్రియులారా, ప్రభువు మీ జీవితములో కూడా కార్యమును జరిగిస్తాడు. ఇతరులు మిమ్మును ఎలాగున చూసినను లేదా మీ పరిస్థితులు ఎన్నిసార్లు మారినను, ప్రభువు మిమ్మును వృద్ధి పొందునట్లుగా చేసి, మీ దీవెనలను విస్తరింపజేయగలడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

మా జీవితములో చూచినట్లయితే, 1985వ సంవత్సరములో చూచినట్లయితే, ప్రభువు మా తండ్రికి 'కారుణ్య పథకమును' గురించి తెలియజేసిన సమయంలో, ఆయన మూత్రపిండం దెబ్బతిని, ఆయన ఒక శోధింపబడిన సమయమును ఎదుర్కొన్నారు. ఆ తర్వాత, మా చెల్లెలు ఏంజల్ ఒక కారు ప్రమాదంలో మరణించడంతో, మా కుటుంబము తీవ్ర సంక్షోభములో చిక్కుకొనిపోయినది. ఈ కష్టకాలంలో, కొందరు వ్యక్తులు మా గురించి అబద్ధాలను ప్రచారము చేయడము మాత్రమే కాకుండా, ఒక పత్రికలో మా గురించి ఎంతో అవమానకరముగా వ్రాసియున్నారు. అంతేకాదు, వారి ప్రణాళికలు విఫలమగునట్లుగాను, వారికి ఎవరు కూడా సహాయపడకూడదు అని వారు అందులో పేర్కొన్నారు.

అయితే అటువంటి కష్టతరమైన పరిస్థితులలో కూడా, ప్రభువు మాకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ''ఈ ప్రజలు అన్యాయంగా మిమ్మల్ని ఎంతవరకు శపించుదురో, అదే మేరకు నేను మిమ్మల్ని ఆశీర్వదించి, మీ సంఖ్యను విస్తరింపజేయుదును. నేను మిమ్మును నిశ్చయంగా వృద్ధిపొందింపజేయుదును. అంతమాత్రమే కాదు, మీరు వారి వైపు చూడకండి; కేవలం నా వైపు మాత్రమే చూడండి '' అని ఆయన మాతో కూడా చెప్పియున్నాడు. కానీ, దేవుడు మమ్మును అంతకంటె ఎక్కువగా ఆశీర్వదించియున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.

కాబట్టి, నా ప్రియులారా, నేటి వరకు ప్రభువు కృప మనలను కాపాడుతూ వచ్చినది కదా. అయితే, నేడు మనము ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నను సరే, లేదా మన మీద ఎటువంటి అపనిందలు, అబద్ధములు మోపబడినప్పటికిని, మనము ప్రభువు చిత్తమును నెరవేర్చడానికి కొనసాగించుదాము. నా ప్రియ స్నేహితులారా, ఇది దేవుని కృపచేత, ఆయన మనకు వృద్ధిని అనుగ్రహించి, మనలను ఫలింపజేసి, విస్తరించునట్లుగాను, తన పరిచర్య ద్వారా కోట్లాది మంది ప్రజలను చేరుకొనునట్లుగా మనలను ఆశీర్వదిస్తాడు. ఆయన మీ విషయంలో కూడా ఆలాగుననే జరిగిస్తాడు. ఆయన మీ కుటుంబమును విస్తరింపజేసి, అభివృద్ధిపరుస్తాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి మరియు ప్రభువునందు నమ్మకమును ఉంచండి, నిశ్చయముగా దేవుడు మిమ్మును విస్తరింపజేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క కటాక్షముతో, కనికరముతో మా వైపు చూడుము. ప్రభువా, నీవిచ్చిన వాగ్దానము చొప్పున మమ్మును ఫలభరితులనుగా చేసి, విస్తరింప జేయుము. దేవా, మేము నీ యందు, నీ వాక్యమునకు, మా తల్లిదండ్రులకు మరియు మమ్మును నడిపించువారికి విధేయతతో నడుచుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మా అభివృద్ధికి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకములను తొలగించి, ప్రతి వ్యతిరేకతను నీ మహిమ కొరకు ఒక అవకాశంగా మార్చుము. దేవా, మా కుటుంబమును, మా పనిని, మరియు నీవు మాకు అప్పగించిన పరిచర్యలను ఆశీర్వదించుము. ప్రభువా, నీవు యాకోబును ఆదరించి, ప్రతి శోధనలోను, తాను చేసిన పనిని ఆశీర్వదించినట్లుగానే, ఆపత్కాలములలో మమ్మును కూడా నీ కటాక్షము చేత బలపరచుము. దేవా, మమ్మును స్థిరపరచి, ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చుము, తద్వారా, మేము అనేకులకు నీ మంచితనమును అందించడానికి మా జీవితమును వాడుకొనుమని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.