నా ప్రియమైన స్నేహితులారా, మనలో ప్రతి ఒక్కరూ దేవుని యెదుట సరైనది చేయాలని కోరుకుంటాము. కానీ, మనం ఎప్పుడు కూడా తప్పు చేయాలనుకోము లేదా పాపంలోకి నడిపించే కార్యాలలోనికి ఈడ్వబడాలని కోరుకోము. దానికి బదులుగా, శాశ్వతకాలము జ్ఞానమును మనము కలిగియున్నాము అని బైబిల్ గ్రంథము మనకు స్పష్టంగా తెలియజేయుచున్నది. అందుకే బైబిల్ నుండి ప్రసంగి 3:11వ వచనములో చూచినట్లయితే, "దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నా డు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు'' అని చెప్పబడిన ప్రకారము శాశ్వతకాల జ్ఞానమును ప్రభువు మన హృదయములో ఉంచినందున అది మనలను లోకాశల వైపునకు నడిపించుచున్నవి. దీనికి కారణంగా, మన హృదయాలు తరచుగా లోక కోరికలు మరియు సుఖాల వైపు ఆకర్షితులవుతాయి. అందుకే బైబిల్ నుండి అపొస్తలుడైన పౌలు కూడా రోమీయులకు 7:19వ వచనములో ఒప్పుకున్నాడు, " నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను, నేను కోరని దానిని చేసిన యెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు'' ప్రకారము ఇది ప్రతి మానవునిలో కలుగుచున్న ఒక పోరాటం. శరీరం మనలను తప్పు వైపునకు ఆకర్షిస్తుంది. కానీ, దేవుని ఆత్మ మనలను సరైనది చేయమని ఆహ్వానిస్తుంది. అందుకే మనం ప్రతిరోజు ప్రభువును వెదకాలి. అందుకే బైబిల్ నుండి సామెతలు 28:5వ వచనములో ఇలాగున చెబుతుంది, " దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు'' ప్రకారము మనం మన పూర్ణ హృదయంతో దేవుని వెదకినప్పుడు, ఏది సరైనదో తెలుసుకునే జ్ఞానాన్ని మరియు దానిని చేయడానికి బలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు.
నా ప్రియులారా, మనము అటువంటి జ్ఞానమును పొందుకోవాలంటే, మనము దేవుని వెదకాలని బైబిల్ నుండి మత్తయి 6:33వ వచనములో యేసు ఇలాగున చెప్పియున్నాడు, " కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును'' ప్రకారము దేవుడు దూరంగా లేడు; తనను ప్రార్థించే వారందరికి ఆయన సమీపముగా ఉన్నాడని అపొస్తలుల కార్యములు 17:27వ వచనము ప్రకారము, మీరు ఇలాగున చెప్పినప్పుడు, " తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు'' ప్రకారము ఆయన మీ దగ్గరికి వచ్చి తన బలాన్ని మీకు దయచేస్తాడు. అందుకే కీర్తనకారుడు, కీర్తనలు 16:8వ వచనములో ఇలాగున ప్రకటించాడు, " సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను'' ప్రకారము ప్రభువు మీ యెదుట ఉన్నప్పుడు, మీరు తప్పు చేయడానికి ప్రేరేపించబడరు. మీరు సత్యంతో మరియు పవిత్రతతో నడుచుకుంటారు. ప్రభువును వెదకడం వలన మీ హృదయం మృదువుగాను మరియు సరైన దాని పట్ల సున్నితంగా ఉంటుంది. ప్రతిరోజు, మీరు ప్రార్థించి ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన స్వభావం మీలో పెరుగుతుంది, ఆయన ఆత్మ మీ ఆలోచనల వైపునకు నడిపిస్తుంది మరియు ఆయన సన్నిధి మీ బలం అవుతుంది.
నా ప్రియులారా, నేడు మీరు గతంలో తప్పు చేసినప్పటికిని, దేవుని దయ ఇప్పటికి అందుబాటులో ఉన్నది. అందుకే బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 7:14వ వచనములో చూచినట్లయితే, " నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును'' అని ఇలాగున చెప్పబడియున్నది. కనుకనే, నా ప్రియులారా, మీరు ఆయన ముఖ సన్నిధిని హృదయపూర్వకంగా వెదకినప్పుడు, ఆయన మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ పనిని మరియు మీ పాపాన్ని కూడా క్షమించి, పరిశుద్ధపరచి, స్వస్థపరుస్తాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 34:10వ వచనములో వాగ్దానం చేయుచున్నది, " సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు'' ప్రకారము దేవుని ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు. బైబిల్ నుండి ఆదికాండము 26:12-13వ వచనములలో దేవుడు ఇస్సాకుకు వాగ్దానము చేసినట్లుగానే నేడు మిమ్మును కూడా వర్ధిల్లజేస్తాడు మరియు మీరు చేయు ప్రతి పనిలో మిమ్మును కూడా నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. మీరు ఆయనను ఎంత ఎక్కువగా వెదకుతారో, ఏది సరైనదో మీరు అంత ఎక్కువగా తెలుసుకుంటారు మరియు దానిని చేయడం అంత సులభం అవుతుంది. ప్రభువు మిమ్మల్ని తన ఆత్మతో నింపును గాక, ఆయన సత్యంలో మిమ్మల్ని నడిపించును గాక, మీరు చేయు ప్రతి పనిలో మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల పరలోకపు తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యెదుట సరైనది చేయాలనే కోరికను మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ లోక శోధనలను అధిగమించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును నీ ఆత్మతో మరియు నీ స్వభావంతో నింపుము. దేవా, మేము తీసుకునే ప్రతి నిర్ణయంలోను నిన్ను వెదకడానికి మాకు నేర్పుము. ప్రభువా, మేము తప్పు చేసిన సమయాలకు మమ్మును క్షమించుము. దేవా, మా హృదయాన్ని శుద్ధి చేసి, నీ సన్నిధిలో మమ్మును పవిత్రపరచుము. ప్రభువా, మా కుటుంబాన్ని, మా పనిని ఆశీర్వదించుము, మా ఆత్మను బాగుపరచుము. దేవా, మేము నీ మార్గాలను అనుసరిస్తున్నప్పుడు మేము ఇస్సాకు వలె నూరంతలు వర్ధిల్లునట్లుగా చేయుము. ప్రభువా, ప్రతిరోజు నీ సన్నిధిలో ఆనందించడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


