నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 13:12వ వచనమును మన కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, "కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము'' ప్రకారము దేవుడు ఏమని సెలవిచ్చుచున్నాడంటే, మీరు ఎదురు చూస్తున్న కార్యాలు మరియు ఆకాంక్షలన్నియు కూడా నెరవేర్చబడును. మీరు సుదీర్ఘకాలముగా వేచియున్నారు. కానీ, దేవుడు మీ హృదయ ఎదురు చూపులను నెరవేర్చనైయున్నాడు. అది సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము వలె ఉంటుంది అని తెలియజేయుచున్నాడు. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై యున్నది. దేవుడు ఏదెను తోటను సృజించియుండగా, ఆయన అందులో రెండు వృక్షములను ఆ తోట మధ్యను ఉంచియున్నాడు. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, నేల నుండి మొలిపించెను. అది ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలములను ఫలించు వృక్షమునై యున్నది. మరొకటి జీవవృక్షమై యున్నది. ఎవరైనను జీవవృక్ష ఫలమును భుజించినట్లయితే, వారు నిరంతరమునకు జీవించినవారిగా ఉంటారు. వారు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను భుజించియున్నప్పుడు, ఆదాము హవ్వలు పాపము చేసియున్నారు. అప్పుడు వారు ఏదెను తోటలో నుండి బయటకు వెళ్లగొట్టబడియున్నారు. తద్వారా వారిని నిరంతరము జీవింపజేయునట్టి, జీవవృక్ష ఫలమును వారు భుజించకుండా, పాపము మరణమును తీసుకొని వచ్చును. కనుకనే, దేవుడు వారిని జీవవృక్ష ఫలముల నుండి దూరముగా తీసుకొని వెళ్లాడు. యేసు క్రీస్తు ద్వారా ఆయన మరణము గుండా వెళ్లియున్నందు వలన ఆయన పునరుత్థానమును మరియు జీవమును ఉత్పత్తి చేసియున్నాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 11:25వ వచనములో చూచినట్లయితే, " అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, ఒక వ్యక్తి యేసునందు విశ్వాసముంచినప్పుడు, అతడు పాపమును బట్టి మృతుడైనప్పటికిని దేవుని బిడ్డగా తిరిగి లేచి, మరల జీవించువానిగా ఉండును. యేసుక్రీస్తు ద్వారా మన ఆశలు సిద్ధించినప్పుడు, లేక నెరవేర్చబడినప్పుడు కూడా ఇదే రీతిగా ఉంటుంది. అది జీవ వృక్షముగా ఉంటుంది.
నా ప్రియులారా, ఈ రోజున యేసు ద్వారా మీ జీవిత వాంఛలన్నిటిని ఆయన తీర్చి, ఇట్టి జీవవృక్షము వంటి అనుభూతిని మీకు అనుగ్రహించబోవుచున్నాడు. అందుకే బైబిల్ నుండి ప్రకటన 22:2వ వచనములో చూచినట్లయితే, "పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును'' ప్రకారము జీవవృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థతను ఇచ్చువాటిని మీరు కలిగియుంటారు. దేవుడు మిమ్మును వాటి ద్వారా ఇతరులకు ఆరోగ్యమును మరియు స్వస్థతను తీసుకొని వచ్చునట్లు ఆశీర్వాదముగా చేయును. క్షమాపణ ద్వారా స్వస్థత మరియు ప్రార్థన ద్వారా జరిగించబడుచున్న అద్భుత కార్యములను బట్టి స్వస్థత, దురాత్మలను వెళ్లగొట్టి వేయడము ద్వారా కలిగించు స్వస్థత, పరిశుద్ధత ద్వారా కలిగించబడు స్వస్థత, ఇవన్నియు కూడా యేసు ద్వారా మనము ఈ లోకములో జీవించగలుగునట్లుగా, మనకు జీవవృక్షమును తీసుకొని వచ్చును. ఆయన మరల మనకు జీవవృక్షము నుండి ఫలములను భుజించు హక్కును అనుగ్రహించనైయున్నాడు. అందుకే బైబిల్ నుండి ప్రకటన 2:7వ వచనములో చూచినట్లయితే, "చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినును గాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును'' ప్రకారము మనము పాపము మీద విజయమును పొందియుండగా, జయించువానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తునని సెలవిచ్చియున్నాడు.
యేసుతో కూడా జీవించునట్లుగా, ఈ లోకములో మరియు మన మరణము తదుపరి ఉన్న లోకములో కూడా, విజయవంతముగా జీవించడము ఏలాగున? అని మనము బైబిల్ నుండి ప్రకటన 12:11వ వచనములో చూచినట్లయితే, "వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు'' ప్రకారము వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తాము యేసుక్రీస్తును గురించిఇచ్చిన సాక్ష్యమునుబట్టియు నిందలు మోపు అపవాదిని జయించియున్నారు. కనుకనే, నా ప్రియులారా, నేడు దేవుడు మీకు అటువంటి కృపను అనుగ్రహించును గాక. మన పాపములన్నిటి నుంచి యేసు రక్తము ద్వారా శుద్ధీకరించబడు విధానమును, ప్రజలందరిని కూడా యేసు ద్వారా జీవింపజేయకలుగునట్లుగా ఆయన యొక్క సాక్ష్యపు వాక్యమును మనము మోసుకొని వెళ్లునట్లుగా చేయును. కనుకనే, నా స్నేహితులారా, మీరు మీ జీవితమును యేసునకు సమర్పిస్తారా? ఆలాగున సమర్పించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును నేటి వాగ్దానము నుండి ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, జీవవృక్షము నిమిత్తము నీకు వందనాలు. ప్రభువా, మేము మా యొక్క పాపముల నిమిత్తము క్షమాపణ పొందియుండగా, మేము జీవవృక్షము యొద్దకు ప్రవేశించి, మేము ఆకులను మరియు ఫలములను పొందగలిగే కృపను నీవు మాకు అనుగ్రహించుము. యేసయ్యా, మేము నీ నామమును బట్టి జీవించునట్లుగా చేయుము. దేవా, మా జీవితములో మేము కలిగియున్న ఆశలన్నియు తీర్చబడునట్లుగా చేయుము. ప్రభువా, మేము సమస్త విషయములలో విజయవంతులుగా ఉండునట్లుగా నీవిచ్చు ఆశీర్వాదముల కొరకై నీకు వందనాలు. ప్రేమగల ప్రభువా, మేము విధేయతగల హృదయంతో నీ యొద్దకు వచ్చుచున్నాము. యేసయ్యా. నీవు జీవ వృక్షంగాను మరియు మా శాశ్వత ఆశగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మా ఆత్మలో లోతుగా పాతిపెట్టబడిన కోరికలను నీవు గుర్తించి, మా పట్ల గొప్ప కార్యములను జరిగించుము. దేవా, నీ పరిపూర్ణ చిత్తం ప్రకారం వాటిని మా జీవితములో నెరవేర్చుము. యేసయ్యా, నీ అమూల్యమైన రక్తంతో మమ్మును శుద్ధి చేసి నన్ను సంపూర్ణంగా చేయుము. నీ జీవితం నా ద్వారా ప్రవహించి ఇతరులకు స్వస్థతను తీసుకురండి. పాపంపై విజయం సాధించడానికి మరియు పరిశుద్ధతతో నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, దయచేసి నీ సాక్ష్యపు వాక్యాన్ని ధైర్యంగా మోయడానికి మాకు నేర్పించుము. దేవా, మమ్మును నీ కృప మరియు ప్రేమకు పాత్రగా చేయుము. యేసయ్యా, మా రక్షకుడైన మరియు రాజువైన నీకు మా జీవితాన్ని పూర్తిగా అప్పగించుకొనుటకు మాకు అటువంటి హృదయమును అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


