నా ప్రియ స్నేహితులారా, మీకందరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. నేడు ప్రతి దుష్టచర్యలను కూడా అధిగమించి లేవనెత్తబడడానికి తగిన శక్తిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 8:11వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును'' అని చెప్పబడిన ప్రకారము అవును, దేవుని యొక్క ఆత్మ, క్రీస్తును మృతుల నుండి పైకి లేవనెత్తబడియున్నట్లుగానే, ఆలాగుననే, ఆయన మృతతుల్యమైన మీ దేహములకు జీవమును అనుగ్రహించును. దేవుని యొక్క ఆత్మ సమస్తమైన జీవమును కలిగియున్నాడు. ఆయన ఎవరినైనను పునరుత్థానమును చెందునట్లుగా చేయును. యేసు తన ప్రాణమును సిలువలో సమర్పించిన తర్వాత, యేసు దేహమునకు ఆయన పునరుత్థానమును ఇవ్వగలిగినట్లయితే, ఆయన మీ జీవితములకు మరియు మీ దేహములకు కూడా మరి ఇంకా ఎంత ఎక్కువగా పునరుత్థానమును అనుగ్రహించగలడు కదా! నిశ్చయముగా ఆయన మీకు పునరుత్థానమును అనుగ్రహిస్తాడు. మీరు అనుకోవచ్చును, "మా జీవితములో అన్నియు మృతతుల్యముగా ఉన్నవి గదా? మా ఆత్మ మృతముగా ఉన్నది, మా మనస్సు, మా జీవితము, మా కుటుంబ జీవితము మృతతుల్యముగా ఉన్నది, మా వ్యాపారము, సాఫల్యత కొరకు మా సామర్థ్యము మృతతుల్యముగా ఉన్నది. మా ప్రార్థన జీవితము మృతముగా ఉన్నది'' కనుకనే, భయపడకండి. దేవుడు పునరుత్థానమును, జీవము కలిగియున్న దేవుడై యున్నాడు. యేసు దానిని సంపాదించియున్నాడు, మిమ్మును అత్యధికమైన విజయమును పొందినవారిగా చేయుట కొరకు ఆయన మరణము గుండా వెళ్లి, దానిని అధిగమించియున్నాడు. ఈ రోజు ఆయన ఆత్మ మీలోనికి వచ్చుచున్నది. ఇక మీదట మీరు కాదు, క్రీస్తే మీలో జీవించుచున్నాడు. సమస్తమును కూడా తిరిగి లేవనెత్తబడతాయి. ప్రతి ఒక్కరు కూడా మీకు అనుగ్రహము చూపించి, ప్రేమించబడడానికి లేవనెత్తబడతారు. వీటన్నిటిలో మీరు అత్యధికమైన విజయమును మీరు పొందినవారుగా ఉంటారు. పరిశుద్ధాత్మ నుండి మీలోనికి ప్రవహించే దేవుని జీవము ద్వారా ఈలాగున జరుగుతుంది.
అవును, బైబిల్ నుండి యోహాను 10:10 వచనమును మనము చూచినట్లయితే, "దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను '' అని ప్రభువు సెలవిచినట్లుగానే, ఆయన మిమ్మును చూచి, నేను మీ యొద్దకు వచ్చియున్నాను, నా బిడ్డా, నేను మీ యొద్దకు వచ్చియున్నాను, ఇప్పటి వరకు మీరు దొంగ రావడము మాత్రమే చూచియున్నారు. సాతాను రావడము చూచియున్నారు. వాడు వచ్చి, సాధ్యమైనంతగా కీడు కల్పించియున్నాడు, దొంగతనము చేసియున్నాడు, మీ జీవితములో హత్య మరియు అనేకమైన వాటిని నాశనమును చేసియున్నాడు. కానీ, ఇప్పుడు యేసుప్రభువు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "నేను మీ చెంతకు వచ్చియున్నాను, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ చెంతకు వచ్చియున్నాను, తద్వారా, మీరు జీవమును కలిగియుంటారు, అత్యంత సమృద్ధియైన జీవమును కలిగియుంటారు. మీకు అవసరమైనదానికంటె అత్యధికముగా అనుగ్రహించెదను. నేను మీకు అత్యంత సమృద్ధియైన జీవమును ఇస్తాను' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, ఇప్పుడే, ఆయన మీలోనికి వచ్చుచున్నాడు. ఆయన జీవము మీలోనికి ప్రవాహము వలె వస్తుంది. కాబట్టి, మీరు ఆయనను మీలోనికి అంగీకరించండి. చెప్పండి, 'యేసయ్య, నీకు వందనములు, నీవు మాకు జీవమును, పునరుత్థానమునై యున్నావు, నీవు నన్ను జీవింపజేయుదువు,' అని చెప్పినప్పుడు, అందునిమిత్తమే గలతీయులకు 2:20వ వచనములో చూచినట్లయితే, "నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' అని చెప్పబడినట్లుగానే, మేము సమస్తమును చేయగలము అని మీరు అనుకున్నట్లయితే, శరీరభోగేచ్ఛలను మీరు అనుభవించవలసియున్నదని మీరు అనుకున్నట్లయితే, ఆలాగే, దేవునిని కూడా కలిగియుండాలి అనుకున్నట్లయితే, అది ఎన్నటికిని పనిచేయదు.
నా ప్రియులారా, మీరు లోకపరమైన కార్యములను సిలువవేయాలి. శరీర సంబంధమైన భోగేచ్ఛలను మరియు ఈ లోకపరమైన దుష్టత్వాన్ని సిలువవేసినవారుగా ఉండాలి. యేసు సిలువ వేయబడి ఉండగా, సర్వలోక సకల పాపములను ఆయన భరించియున్నాడు. అప్పుడు క్రీస్తు మీలో జీవించునట్లుగా, మీరు క్రీస్తును మీలోనికి అనుమతించాలి. క్రీస్తు యొక్క కార్యములు చేయుట, క్రీస్తు యొక్క ఆలోచనలు కలిగియుండుట, క్రీస్తు యొక్క చిత్తమును నిర్వర్తించుట, ఇకను యేసుక్రీస్తు కొరకైన ఉద్దేశమును నెరవేర్చుటయే. అవును, మీ ద్వారా యేసును ప్రతిబలింపజేయాలనే ఉద్దేశమును మీ జీవితము పట్ల దేవుడు తన యొక్క చిత్తముగా కలిగియున్నాడు. ఆయన వెలుగు మీ ద్వారా ప్రకాశింపజేయుట కొరకే. కనుకనే, శరీర సంబంధమైనదేదియు మీరు కలిగియుండలేరు.లోకపరమైనదేదియు మీరు కలిగియుండకూడదు. మీరు సాతానుకు సంబంధించినదేదియు కలిగియుండాలి. మీరు కేవలం యేసును మాత్రమే కలిగియుండాలి. కనుకనే, క్రీస్తుతో కూడా మీరు సిలువ వేయబడండి. ఇంకను మిమ్మును మీరు క్రీస్తుతో కూడా అనుసంధానము చేసుకొనవలెను. క్రీస్తుతో కూడా సిలువవేయబడడము అనగా, సకల భోగేచ్ఛలను క్రీస్తుతో కూడా సిలువవేసి, నిత్యమైన ఆయన ఆనందమును ప్రముఖముగా కలిగియుండుటయే. మీ జీవితములోనికి, మీ జీవితము ద్వారా యేసును తీసుకొని వచ్చుటయే. అప్పుడు, మీరు జీవమును కలిగియుంటా రు. క్రీస్తు యొక్క జీవమును కలిగియుంటారు. ఆయన మీ జీవితములో సమస్తమును పరిపూర్ణము చేసి, సాతాను తీసుకొని వచ్చిన వాటిని లయము చేస్తాడు. అపవాది దొంగిలించిన సమస్తమును యేసు మీకు మరల అనుగ్రహిస్తాడు. అపవాది దేనినైతే, మీ జీవితములో హత్యచేసియున్నాడు దానిని ఆయన జీవితములో పునరుద్ధరింపజేస్తాడు. ఇట్టి దేవుని కృపను పొందుకొనుటకు మీ కొరకు ఈ రోజు ప్రార్థించుచున్నాను. నా ప్రియులారా, మీ జీవితములో ప్రభువు చెంత నుండి, సమస్తమును రెండంతలుగా వచ్చును గాక. ఏదైతే, చంపబడియున్నదో, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు నామమున పునరుత్థానము చెందును గాక. ప్రతి విధమైన ఆనందము, సకల ఆరోగ్యము, ఆర్థికము అవన్నియు యేసు నామమున మీ జీవితములో మీకు మరల వచ్చును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మాలో పనిచేయుచున్న నీ పునరుత్థాన శక్తికి నీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈ రోజు మా జీవితంలోని ప్రతి నిర్జీవమైన భాగంలోనికి నీ జీవాన్ని పంపుము. దేవా, నీ ఆత్మ మా మనస్సును, మా శరీరాన్ని, మరియు మా ఆత్మను పునరుజ్జీవింపజేయుము. యేసయ్యా, మేము ప్రతి లోకసంబంధమైన కోరికను విడిచిపెట్టి, కేవలం నీ కోసమే జీవించాలని ఎంచుకొనుటకు నీ కృపను మాకు దయచేయుము. తండ్రీ, క్రీస్తు మాలో మరియు మా ద్వారా జీవించునట్లుగా చేయుము. దేవా, శత్రువు మా జీవితం నుండి దొంగిలించిన ప్రతిదానిని తిరిగి మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ సమృద్ధియైన జీవంతో మరియు పొంగిపొర్లుచున్న ఆనందంతో మమ్మును నింపుము. దేవా, నీ పరిపూర్ణ చిత్తానుసారంగా మా జీవితాన్ని నిర్మించుమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


