నాకు అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాము. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 28:5వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును’’ ప్రకారము దేవుడు నేడు మిమ్మును సమృద్ధిగా దీవించాలని మీ పట్ల కోరుచున్నాడు. ఈ ఆశీర్వాదమును మనము ఎప్పుడు కలిగియుంటాము? ద్వితీయోపదేశకాండము 28:1-2వ వచనములను మనము చదివినట్లయితే, ‘‘నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నియు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును’’ ఆమేన్! నా ప్రియులారా, దేవుని యొక్క గొప్ప దీవెనలన్నియు మిమ్మును అధిగమిస్తాయి. 

నా ప్రియులారా, ఎవరు ఆలాగున దీవించబడతారు? అని మనము సామెతలు 28:20 వ వచనములో మనము చదివినట్లయితే, ఆ వచనములో ఈలాగున చెబుతుంది, ‘‘ నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును’’ ప్రకారం నమ్మకమైన వాడు మన దేవుడు. కనుకనే, దేవునిని నమ్మకముగా ఎవరైతే వెదకుతారో, నమ్మకముగా వారి సమయమును దేవుని సన్నిధిలో గడుపుతారో, దేవుని వాక్యమును చదువుచూ, ఆయనకు ప్రార్థన చేస్తారో? సామెతలు 3:33వ వచనములో చూచినట్లయితే, ‘‘...నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును’’ ప్రకారము దేవుని నమ్మకముగా మరియు నీతిమంతులుగా ఉన్నప్పుడు, నిశ్చయముగా దీవెనలు మెండుగా కుమ్మరింపబడతాయి. ఇంకను మలాకీ 3:10వ వచనములో చూచినట్లయితే, ‘‘ నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొని రండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు’’ ప్రకారం కాబట్టి, నా స్నేహితులారా, దేవుని నమ్మకంగా మరియు శ్రద్ధగా, ఇంకను ఉదయమున మరియు రాత్రి వెదకాలని బైబిల్ నుండి కీర్తనలు 55:17 వ వచనములో దావీదు అదే చెబుతున్నాడు. ఆ వచనము, ‘‘ సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును’’  మరియు మలాకీ 3:10వ వచనములో మొదటి భాగమును మనము చదివినట్లయితే, ‘‘నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంత యు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొని రండి;’’ అని చెప్పినట్లుగానే, మన యొక్క పదియవ భాగమంతటిని, దేవుని యొక్క మందిరపు నిధిలోనికి తీసుకొని రావాలి. అప్పుడు ప్రభువు అత్యధికముగా మనలను ఆశీర్వదిస్తాడు. అంతమాత్రమే కాదు, పట్టజాలనంత విస్తారముగా ప్రభువు మనలను దీవిస్తాడు. ఇది ఎంత  గొప్ప శక్తివంతమైన వాగ్దానము కదా!

కనుకనే, నా ప్రియులారా, మా సొంత జీవితములో మేము అది చేసియున్నాము. మొదట్లో నాకు అర్థము అయ్యియేది కాదు. పదియభాగము దేవునికి ఇచ్చినట్లయితే, నెలంతటికి సరిపోదేమో అని అనుకునేవారము. కానీ, దేవుడు నాకు ఒక పాఠమును నేర్పించాడు. మేము యథార్థంగా విధేయత చూపించినప్పుడు, ప్రభువు అత్యధికముగా దీవించాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ విషయాలన్నిటిని పాటించండి, ప్రభువు యొక్క అత్యధికములైన దీవెనలను పొందుకొనండి. ఆలాగుననే, మన పదియభాగమంతటిని దేవుని యొక్క మందిరములోనికి తీసుకొనివెళ్లాలి. ఇంకను మనం నిజాయితీగా విధేయత చూపినప్పుడు, ప్రభువు మనలను సమృద్ధిగా ఆశీర్వదించాడు. నా స్నేహితులారా, అదేవిధంగా, మీరు కూడా వీటన్నింటిని చేయండి- ప్రభువును నమ్మకంగా వెదకండి, నీతిగా జీవించండి, ఉత్సాహంగా ఇవ్వండి మరియు మీరు దేవుని సమృద్ధిగా ఆశీర్వాదాలన్నింటినీ పొందుతారు! మరియు విస్తారముగా ఆశీర్వదించబడతారు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. 

ప్రార్థన:
ప్రేమగల పరలోక తండ్రీ, సమృద్ధిగా ఆశీర్వాదాలు ఇస్తానని నీవు మాకు ఇచ్చిన వాగ్దానానికి వందనాలు. దేవా, నీ యొక్క స్వరాన్ని శ్రద్ధగా పాటించడానికి మరియు నీ మార్గాల్లో నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును హృదయంలో నమ్మకంగా, ప్రార్థనలో స్థిరంగా మరియు నీ వాక్యంలో స్థిరపరచబడునట్లుగా చేయుము. దేవా మేము నీతిన్యాయముగా నడుచుకోండి. ప్రభువా, మేము యథార్థంగాను, నీతిగాను జీవించడానికి మరియు నీకు లోబడి ఉండునట్లుగాను, మా ఇల్లంతయు నీ యొక్క శాంతి మరియు కృపతో నిండి ఉండునట్లుగా చేయుము. ప్రభువా, నీ సమకూర్పులన్నిటిని మాకు అనుగ్రహించుము. ఈ నిజములు మేము ఎరుగుకుండా ఉన్నట్లయితే, ఇప్పుడే, వాటన్నిటిని మాకు నేర్పించుము. మమ్మును అత్యధికంగా ఆశీర్వదించుము. దేవా, మా రాబడి అంతటిలో దశమభాగమును మరియు కానుకలతో, ఉత్సాహంగా మరియు విశ్వాసంతో నిన్ను ఘనపరచడం మాకు నేర్పించుము. ప్రభువా, పరలోకపు వాకిళ్లు విప్పి, మా జీవితంపై నీ యొక్క ఆశీర్వాదాలను కుమ్మరించుము. దేవా, మా గంపయు మరియు పిండి పిసికి తొట్టెయు నీ యొక్క సమకూర్పుతో నింపబడునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, దావీదు వలె  ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి మేము నిన్ను వెదకుచున్నప్పుడు నీ యొక్క ఆశీర్వాదాలు మమ్మును అధిగమించునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.