నా ప్రియమైన స్నేహితులారా, ప్రభువు మీ మార్గమును నీతిమంతుల మార్గముగా స్థిరపరచబోవుచున్నాడు. ఆయన మిమ్మును వర్థిల్లజేసి, ఘనపరచబోవుచున్నాడు. ఆయన మిమ్మును నీతి మార్గములో నడిపించాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 4:18వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును'' అని చెప్పబడినట్లుగానే, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లుగా మీ మార్గమును దేవుడు నేడు ఆలాగున మార్చబోవుచున్నాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, ఈ రోజు మీ మార్గమంతయు అంధకారముతో నింపబడియున్నదని మీరు తలంచుచున్నారా? అది ఎంతో చేదైన మార్గముగాను, భయము లేదా నష్టముతో కూడినదిగా ఉన్నదని మీరు అంటున్నారా? అది దొంగలతో నిండిపోయి, వంచకులచేత ఆవరించబడియున్నది, అపవాది దాడుల చేత కదిలించబడియున్నాము, ఇంకను మాకు ముందుగా ఎటువంటి మార్గము అస్సలు కనిపించలేదు అని అంటుండవచ్చును. అయితే, నేడు పట్టపగలగు సూర్యునివలె అత్యధికమైన ప్రకాశవంతమైన వెలుగుతో మీరు ప్రకాశించునట్లుగా మీ కొరకు ప్రభువు ఒక మార్గమును సిద్ధపరచబోవుచున్నాడు. అదియే నీతిమంతుల మార్గము. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు, ఈ వాగ్దానము కొరకు ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించండి.
అందుకే బైబిల్ నుండి యెషయా 45:2-3వ వచనములలో చూచినట్లయితే, "నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుప గడియలను విడగొట్టెదను. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనేయని నీవు తెలిసికొనునట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను'' అని ప్రభువు సెలవిచ్చినట్లుగానే, మీ చుట్టూ ఉన్న సమస్తమును మీకు చీకటిగా ఉన్నట్లుగా అనిపించవచ్చును. కానీ, అక్కడ రహస్యమందు దాచబడియున్న ధనమును మరియు ఆశీర్వాదములను మీరు కనుగొనడానికి ప్రభువు తానే ఒక మార్గమును కల్పించుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీకు ముందున్న ప్రతి వంకర మార్గమును సరాళము చేయుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు అటువంటి మార్గము మీకు ముందుగా తెరవజేయబడును గాక.
ఆ మార్గము ఎలాగున తెరవబడుతుంది? మొదటగా, పాప క్షమాపణ ద్వారా ఆ మార్గము తెరవబడుచున్నది. అయితే, మీ జీవితములోనికి దేవుని క్షమాపణ వచ్చినప్పుడు, నీతిమంతులైన మీ యొక్క మార్గము అత్యధికముగా వెలుగువలె తేజరిల్లుటకు ప్రారంభించును. అందుకే బైబిల్ నుండి లూకా 23:44వ వచనములో చూచినట్లయితే, "అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను'' అని చెప్పబడినట్లుగానే, యేసు సిలువ మీద వ్రేలాడుచున్నప్పుడు, మానవుల యొక్క పాపములన్నిటిని ఆయన మీద మోపబడినందున, ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు దేశమంతయు చీకటి కమ్ముకొనెను. అది ఒక భయంకరమైన కటికచీకటి.
నా ప్రియులారా, పాపము కారణంగా ఈ రోజు మీ మార్గము చీకటిమయముగా ఉన్నదని మీరు భావిస్తున్నారా? ఆ సమయమున మీరు ఇలాగున చెప్పవచ్చును, ' నేను దేవునికి దగ్గరకు వెళ్లలేకపోవుచున్నాను. నేను ప్రజలను ఎదుర్కొనలేకపోవుచున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా శాపం నన్ను వెంటాడుచున్నది. నిందారోపణ నన్ను అణచివేయుచున్నది' అని అంటున్నారా? అయితే, యేసు నామమున ఈ రోజు ఆ చీకటి మిమ్మును విడిచి వెళ్లుచున్నది. చీకటి అధికారము వలన కలుగు వేదనను యేసు అర్థం చేసుకోగలడు. ఎందుకనగా, ఆయన తానే ఆ చీకటి మార్గము గుండా వెళ్లియున్నాడు. మన పాపముల ద్వారా వచ్చిన అంధకారమును ఆయన తనశరీరము మీద మోసుకొనియున్నాడు.
నా ప్రియులారా, మరల యేసు, " నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని '' సెలవిచ్చియున్నాడు. అవును, ప్రతి మానవుని యొక్క పాపము వెలుగుగా ఉన్న యేసు మీద వేయబడియున్నది. ఆయనను చీకటి అలుముకున్నప్పటికిని, యేసు వెలుగుతోనూ నీతితోనూ నింపబడియుండెను. కనుకనే, ఆయన కలిగియున్న నీతి కారణంగా, ఆయన మన కొరకు ఆ చీకటిని సిలువలో జయించాడు. నేటికిని, నా ప్రియులారా, యేసును అనుసరించువారెవరూ అంధకారంలో నడవరు, అంతకన్న మిన్నగా వారు జీవపు వెలుగును కలిగియుంటారు. ఆయన మన చుట్టు ఉన్న పాపాంధకారమును తొలగించి, మనలను తన జీవముతోను మరియు వెలుగుతోను నింపుచున్నాడు. కనుకనే, మనము ఆయనతో కూడా నడుచుచున్నప్పుడు, మన జీవితములు పరిశుద్ధముగాను, నీతిగాను మార్చబడి, మధ్యాహ్నపు సూర్యునివలె ఉన్న ఆయన వెలుగు నిష్కళంకంగా ప్రకాశిస్తూ మనము జీవించడానికి మనకు వీలు కల్పించుచున్నది. నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు మనలో ప్రతి ఒక్కరికిని ఈ ఆశీర్వాదమును అనుగ్రహించును గాక. ఈ రోజు ప్రభువు మనలో ప్రతి ఒక్కరికి ఈ ఆశీర్వాదాన్ని అనుగ్రహించును గాక. దీనిని మీ పూర్ణ హృదయంతో అంగీకరించి, ఈ ఆశీర్వాదము కొరకు వాంఛతో ఎదురుచూడండి.
రెండవదిగా, నా ప్రియులారా, ప్రభువు స్వస్థతను అనుగ్రహించుచున్నాడు. మధ్యాహ్నపు సూర్యుని వెలుగు వలె ఆయన తన స్వస్థతను మన మీద కుమ్మరించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి మలాకీ 4:2వ వచనములో చూచినట్లయితే, "అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు'' అని చెప్పబడినట్లుగానే, యేసుక్రీస్తు నుండి ప్రవహించే జీవముతో నిండియున్న శక్తి ద్వారా అనారోగ్యపు అంధకారం, వ్యాధి తీవ్రత మరియు అనారోగ్యానికి సంబంధించిన ప్రతి లక్షణం ఇప్పుడు నిర్మూలమగుచున్నవి. మీలో ఎటువంటి అంధకారపు లక్షణాలు ఉన్నట్లయితే, అవి ఇప్పుడే మీ శరీరం నుండి తొలగిపోవుచున్నవి. యేసు నామములో, ప్రతి క్యాన్సర్ కణం నశించిపోవును గాక మరియు మీ శరీరం సంపూర్ణంగా స్వస్థత పొందుకొనును గాక.
చివరిగా, మన శత్రువుల వలన కలుగు అంధకారమును ప్రభువు మన నుండి తొలగించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యెహోషువ 10:12 వ వచనములో చూచినట్లయితే, "యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగతీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను, అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా'' అని చెప్పబడినట్లుగానే, చీకటి ఆవరించినప్పటికిని, రాత్రియైనప్పుడు శత్రువులు తప్పించుకోగలరని యెహోషువకు తెలుసు. కాబట్టి అతడు పట్టపగలు వలె ఉన్న వెలుగు వారిని వెంబడించాలని అతడు యెహోవాకు మొరపెట్టాడు. దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు, ఇశ్రాయేలీయులు తమ శత్రువులను పూర్తిగా ఓడించు వరకు సూర్యుడు నిలిచిపోయాడు.
అవును, నా ప్రియమైన స్నేహితులారా, మీ జీవితంలో కూడా ఆలాగుననే జరుగుతుంది. దేవుని వెలుగు మీ మీద ప్రకాశించుచున్నది. మీకు వ్యతిరేకంగా లేచు ప్రతి శత్రువు, అపవాది దాడులు, నష్టాన్ని కలిగించే ప్రతి ఆత్మ మరియు బలహీనతను కలిగించే ప్రతి ఆత్మ నేడు మీ నుండి పారద్రోలబడుతుంది. నేడు, ప్రభువు మీకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహిస్తాడు. తద్వారా, మీరు కోల్పోయిన వాటన్నింటికిని రెట్టింపును ఆయన మీకు తిరిగి అనుగ్రహించుచున్నాడు. ఈ రోజే ఇటువంటి గొప్ప ధన్యతను పొందుకొనండి. నేడు మీ జీవితములో ఉన్న ప్రతి అంధకారము తొలగిపోవును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీతిమంతుల మార్గము అత్యంత వెలుగుగా ప్రకాశించునని వాగ్దానము చేసినందుకై నీకు వందనములు. యేసయ్యా, మా పాపములన్నిటిని క్షమించి, నీ నుండి మమ్మును దూరపరచు ప్రతి చీకటిని తొలగిపోవునట్లుగా చేయుము. యేసయ్య, నీ యొక్క వెలుగు మా హృదయమును నింపి, మేము వేయు ప్రతి అడుగులోను మమ్మును నడిపించుము. దేవా, నీవు మాకు ముందుగా వెళ్లి, మా వంకర మార్గములన్నిటిని సరాళము చేసి, ఎవరూ మూయలేని తలుపులను మా యెదుట తెరువుము. యేసయ్యా, మా శరీరములో ఉన్న ప్రతి వ్యాధిని నీ గాయముల ద్వారా ముట్టి, మాకు సంపూర్ణ స్వస్థతను దయచేయుము. దేవా, మాకు విరోధముగా లేచు శత్రువు యొక్క ప్రతి కార్యమును నాశనము చేసి, మాలో అలుముకొనియున్న భయము, నష్టము, నిరుత్సాహం నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, మా జీవితంలో ఉన్న ప్రతి చీకటి పై నీ వెలుగు ద్వారా జయించునట్లుగా కృపను దయచేయుము. దేవా, మేము కోల్పోయిన వాటన్నిటిని మాకు తిరిగి రెండంతలుగా ఇచ్చి, నీవు మా కొరకు సిద్ధపరచిన మహిమాన్వితమైన భవిష్యత్తులోని మమ్మును నడిపించుము. ప్రభువా, మా జీవితకాలమంతయు మేము నీతి మార్గములో నడుచుకుంటూ, నీ వెలుగును ప్రతిబింబించునట్లుగాను, నీ నామమునకు మహిమ కలుగునట్లుగాను చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


