నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాము. ప్రభువు తన హస్తమును మీ మీద ఉంచి మిమ్మును దీవించును గాక. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లేవీయకాండము 20:24వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నేను మీతో చెప్పిన మాట యిదే మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే'' అని చెప్పబడినట్లుగానే, ఇది ఎంతో మంచి వాగ్దానము. నేడు దేవుని యొద్ద నుండి మనకు ఒక గొప్ప వాగ్దానము ఇవ్వబడియున్నది. మీరు ఆ వాగ్దానమును చదివి, మీరు దానిని మీ స్వంతం చేసుకొనండి.

నా ప్రియులారా, ఈ లోకములో జీవించుచున్న మీరు అనేక ఆశీర్వాదముల కొరకు వేచియుండవచ్చును. మీలో కొందరు ఆరోగ్యం కొరకు, కొందరు జీవనోపాధి కోసం, మరికొందరు ఒక గొప్ప విజయం కొరకు, అనేకమంది ఎంతోకాలముగా ఎదురుచూస్తున్న ప్రార్థనలకు జవాబు కొరకు ఎదురు చూస్తూ, ప్రార్థించుచుండవచ్చును. కానీ, అటువంటి మిమ్మును చూచి దేవుడు ఈలాగున అంటున్నాడు, " నా బిడ్డలారా, నేడు మీకు కావలసిన ఆశీర్వాదములన్నిటిని మీరు పొందుకొనెదరు, నేను వాటన్నిటిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను'' అని ప్రభువు ఈ రోజు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, భయపడకండి. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించుటలోను, వారి జీవితాలలో తన వాగ్దానాలను నెరవేర్చడంలోను ఆనందించుచున్నాడు.

మనము బైబిల్‌లో అబ్రాహాము జీవితమును చూచినట్లయితే, దైవజనుడైన అబ్రాహాము తన జీవితములో గొప్ప ఆశీర్వాదములను ఏ విధంగా పొందుకొనియున్నాడు? అతడు దేవునిని యథార్థముగా వెదకియున్నాడు. ప్రభువును తన హృదయమంతటితో వెదకి యున్నాడు. అందుకే ప్రభువు అతనిని సమృద్ధిగా ఆశీర్వదించియున్నాడు. అబ్రాహామునకు ఇవ్వబడియున్న వాగ్దానము ఏమైయున్నది? అని మనము చూచినట్లయితే, " నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.'' నా ప్రియ స్నేహితులారా, అబ్రాహామును అట్టి విధముగా ఆశీర్వదించిన అదే దేవుడు, ఈ రోజు మిమ్మును కూడా దీవించుటకు సిద్ధముగా ఉన్నాడు.

అందుకే బైబిల్ నుండి ఎఫెసీయులకు 1:11వ వచనములో చూచినట్లయితే, " మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని, దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు'' అని వ్రాయబడినట్లుగానే, మనము ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనుటకు ఆయన తన సంకల్పము చొప్పున మనలను ముందుగానే నిర్ణయించుకొనియున్నాడు. అవును, నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఏదైన ఒక వాక్యము ద్వారా వాగ్దానము చేసినట్లయితే, ప్రభువు దానిని నిశ్చయముగా నెరవేరుస్తాడు. ప్రభువు తన వాగ్దానములను నెరవేర్చడంలో ఎన్నడూ అపజయమునొందడు. అబ్రాహాము విశ్వసించి దేవుని ఆశీర్వాదాలను పొందినట్లుగా, మీరు కూడా ఆయన వాక్యమును విశ్వాసంతో, నమ్మకంతో గట్టిగా పట్టుకొని, దేవుని దీవెనలను పొందుకొనండి.

అందుకే బైబిల్ నుండి మార్కు సువార్త 10:17వ వచనములలో చూచినట్లయితే, "ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొని వచ్చి ఆయన యెదుట మోకాళ్లూని సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను'' ప్రకారము మీరు నిత్యజీవమును పొందుకుంటారు అని ఈ వచనములన్నిటిలోను కూడా అదే వ్రాయబడియున్నది. నా ప్రియులారా, ప్రభువు వాగ్దానములను నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాడు. మీరు అబ్రాహాము వలె వాటిని స్వీకరించి, పొందుకొనవలెను. అబ్రాహామునకు వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చాడు కూడా. అదేవిధముగా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ద్వారా మీకు ఇచ్చిన వాగ్దానములన్నిటిని కూడా ప్రభువు నెరవేరుస్తాడు. దేవుని వాగ్దానములన్నిటిని చదువుతూ, వాగ్దానములన్నిటిని స్వీకరించండి. ఆశీర్వాదములన్నిటిని పొందుకొను కృపను మీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కూడా మనము ప్రార్థనలో ఏకీభవించి, దేవుని యొక్క ప్రశస్తమైన ఆశీర్వాదములను మరియు స్వాస్థ్యమంతటిని కూడా పొందుకుందాము. దేవునియందు నిరీక్షణ ఉంచువారి కొరకు ఆయన నిత్య ఆశీర్వాదాలను సిద్ధపరచియున్నాడని లేఖనములు మనకు బోధించుచున్నవి. కనుకనే, నా ప్రియులారా, మీరు దేవుని వాక్యమును చదివి, ఆయన వాగ్దానములను స్వీకరించినప్పుడు, మీ జీవితం కొరకు ఆయన నియమించిన ప్రతి ఆశీర్వాదములను పొందుకునే కృపను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కనుకనే, ఈరోజే ఆయనను నమ్మండి. అబ్రాహాముకు తన వాగ్దానాలను నెరవేర్చిన దేవుడు, మీ జీవితము పట్ల పలికిన ప్రతి వాగ్దానమును కూడా నిశ్చయముగా నెరవేరుస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నీ దీవెనలన్నిటికై నీకు వందనములు. దేవా, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, ఇప్పుడు కూడా నీ యొక్క ఆశీర్వాదములన్నిటిని మా మీద కుమ్మరించుము. దేవా, మాకు అవసరమైయున్న సమస్తమును, ఆరోగ్యము, స్వాస్థ్యమును మరియు మా అవసరతలన్నిటిని తీర్చుము. ప్రభువా, నీకు మొఱపెట్టుచున్న మా మీద నీ యొక్క బలమైన హస్తమును ఉంచుము. దేవా, అబ్రాహాము వలె మేము దీవించబడునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రియమైన ప్రభువా, మాకు నీ యొక్క స్వాస్థ్యమును అనుగ్రహిస్తానని మరియు మా కొరకు నీవు సిద్ధపరచిన ప్రతి ఆశీర్వాదమును మేము పొందుకొనునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, అబ్రాహాము నిన్ను నమ్మి నీ సమృద్ధియైన ఆశీర్వాదములను పొందుకున్నట్లుగానే, నీ వాక్యమును నమ్మడానికి మా విశ్వాసమును బలపరచుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి అవసరం నీ ఐశ్వర్యం మరియు మహిమకు అనుగుణంగా తీర్చబడునట్లుగా చేయుము. యేసయ్యా, మా యొక్క స్వస్థత, పోషణ, సమాధానము మరియు అద్భుత విజయం కొరకు ఎదురుచూచుచున్న మమ్మును సంధించి, మా ప్రార్థనకు జవాబును దయచేయుము. దేవా, ఈ రోజు మొరపెడుతున్న మా మీద నీ యొక్క బలమైన హస్తము దిగివచ్చునట్లుగాను, నీ యొక్క వాగ్దానములను మా స్వంతం చేసుకొనే కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ యొక్క వాగ్దానముల ద్వారా మేము సమృద్ధిగా ఆశీర్వదింపబడి, నీ విశ్వసనీయతకు సాక్షులుగా నిలుచునట్లుగా మమ్మును మార్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.