నా ప్రియ స్నేహితులారా, దేవుడు ఈరోజు కూడా మీ కొరకు ఒక వాగ్దానమును కలిగియున్నాడు. మనం జీవించే ప్రతి నూతన దినము మన బలం ద్వారా కాదు, ఆయన దయ మరియు కృప ద్వారానే. ఈ రోజు కూడా ఆయనను బట్టి మనము నిరీక్షణను కలిగియున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 12:12వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, "నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పుగలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి'' ప్రకారము మన జీవితంలోని ప్రతి సమయములోను మనం పాటించవలసిన గొప్ప నిరీక్షణ కలిగించు మాటలు ఇవి. వీటిని చక్కటి చిత్రాలుగా చిత్రించుకొని, వీటి ద్వారా మనము జీవించవచ్చును. అందుకే, "నిరీక్షణగలవారై సంతోషించండి'' అని ఇక్కడ ఎంత చక్కగా చెప్పబడియున్నది గదా! ' దేవుడు మిమ్మును వినియోగించుకొని, గొప్ప ఔనత్యమును కలిగిస్తాడని ఆయన యందు నిరీక్షణ కలిగియుండాలని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు మనం దానిని చూడలేకపోయినా, మన మేలు కొరకు సమస్తమును పరిపూర్ణం చేయడానికి ఆయన తెర వెనుక పనిచేయుచున్నాడని మనం నమ్మాలి. ఆయన మీ నిమిత్తము సమస్తమును పరిపూర్ణము చేస్తాడని నిరీక్షణ కలిగియుండాలి. కనుకనే, అట్టి నిరీక్షణలో సంతోషించండి. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థలములకు లేవన్తెత్తుతాడనియు మరియు మీ జీవితంలో ఆయన ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తాడనియు ఎంతో నిరీక్షణ కలిగియుంటూ, ఎల్లప్పుడు సంతోషంగా ఉండండి. మన నిరీక్షణ ప్రజలపై లేదా పరిస్థితులపై కాదు, కానీ దేవుని మార్పులేని ప్రేమ మీద మాత్రమే ఉండాలి. కనుకనే, ప్రభువునందు ఎల్లప్పుడు ఆనందించండి.
ఆలాగుననే, రెండవదిగా, "శ్రమ యందు ఓర్పుగలవారై ఉండండి'' అని వచనం మనకు స్పష్టంగా తెలియజేయుచున్నది. దేవుడు ఆ శ్రమల నుండి మనలను తప్పిస్తాడు. మన కష్టాలు, శ్రమలు, బాధ లేదా ఆలస్యం మనలను చుట్టుముట్టినప్పుడు, దేవుడు మనలను విశ్వాసంతో వేచి ఉండాలని ఆయన మీకు తెలియజేయుచున్నాడు. శ్రమ యందు ఓర్పుతో ఉండండి. దేవుడే మనలను శ్రమ నుండి తప్పిస్తాడు అని ఎదురు చూడాలని కోరుచున్నాడు. దేవుడు ఆ బాధ నుండి మనలను తప్పించడానికి ఒక అద్భుత కార్యములను జరిగిస్తాడు. ఆయన కొన్ని శ్రమలు మనలను నాశనం చేయడానికి కాదు, మనలను పరిశుద్ధులనుగా చేసి, బలవంతులనుగా చేయడానికి అనుమతిస్తాడు. కన్నీళ్ల మధ్యలో కూడా, ఆయన మన హృదయాలను మరింత లోతుగా విశ్వసించేలా రూపొందించుచున్నాడు. దేవుని ఉద్దేశము పరిపూర్ణంగా గ్రహించకుండా నమ్మకంగా ఓడను నిర్మించిన నోవహువలె, మనం కూడా ప్రభువుకు ఆనందంగా విధేయత చూపడం కొనసాగించాలి. జలప్రళయము వచ్చినప్పుడు, నోవహు మరియు అతని కుటుంబం ఓడలోనే సురక్షితముగా ఉండిపోయారు, ఒకరోజు దేవుడు తమను బయటకు తీసుకువస్తాడని నిరీక్షణను కలిగియుంటూ, శ్రమ యందు ఓర్పుగలవారై శ్రమలను భరించారు మరియు తగిన కాలములో, ప్రభువు ఓడ ద్వారములు తెరిచాడు. వారి ద్వారా ఒక నూతన ప్రపంచం ప్రారంభమైనది, వారు కలిగియున్న విశ్వాసం కారణంగా ఒక నీతిమంతమైన తరం రావడము జరిగింది. అదేవిధంగా, నా ప్రియులారా, నేడు మీరు కూడా ఓర్పుతో సహించినట్లయితే, మీ శ్రమ ఓటమితో అంతము కాదు. దేవుడు తగిన కాలములో మిమ్మును ఆ శ్రమల నుండి బయటకు తీసుకొనివస్తాడు. అంతమాత్రమే కాదు, ఈ భూమి మీద మిమ్మును స్థిరపరుస్తాడు మరియు అనేకులకు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు.
నా ప్రియులారా, చివరగా, లేఖనం ఇలాగున చెబుతుంది, "ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి'' ప్రకారము ఇట్టి నిరీక్షణతో నిరంతరాయముగా ప్రార్థించండి. 'ప్రార్థన' అనేది పరలోక అనుగ్రహాన్ని తెరిచే తాళపు చెవి. అయితే, అనేక ఫర్యాయములు మనము దీనిని తలక్రిందులు చేస్తాము, 'నేను కేవలము శ్రమ గురించి మాత్రమే చింతించుటలో నమ్మకస్థునిగా ఉంటాను' అన్నట్టుగా ఉంటాము. అది మనలను పాడు చేస్తుంది మరియు నాశమము చేస్తుంది. కానీ, అందుకు బదులుగా మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థించినప్పుడు, మన నిరీక్షణ పునరుద్ధరించబడు తుంది, మన బలం పునరుద్ధరించబడుతుంది మరియు మన జీవితాలలో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి. అనేకసార్లు, మనం మన విశ్వాసాన్ని చింతలతో మార్చుకుంటాము. ప్రార్థించకపోవడంలో ఓర్పు చూపుతాం, భయపడడంలో విశ్వాసం ఉంచుతాం. కానీ, దేవుడు దీనిని మార్చాలని మన పట్ల కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఇలాగున సెలవిచ్చుచున్నాడు, "నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పుగలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి'' అను ఈ మాటల ప్రకారం మనం జీవించుచున్నప్పుడు, మన హృదయాలు సమాధానముతో నిండిపోతాయి. నా ప్రియులారా, తన భక్తులైన నోవహును నడిపించిన, దానియేలును విడిపించిన మరియు అబ్రాహామును ఆశీర్వదించిన అదే దేవుడు మన పట్ల సమస్తమును పరిపూర్ణం చేస్తాడని మనం విశ్వసించుదాము. స్నేహితులారా, మనము కూడా ప్రభువు చెప్పేదానిని ప్రతిరోజు సంతోషభరితులముగా ఉండాలి. దేవుడు మనకు గొప్ప భవిష్యత్తును ఇస్తాడన్న నిరీక్షణ మనము కలిగియుండాలి. నోవహు ఓడ నిర్మాణము సంపూర్తి కాగానే, వర్షాలు మరియు వరదలు వచ్చాయి. నోవహు కుటుంబము ఆ ఓడలో ప్రవేశించి, ఎన్నో దినములైనవి. అయితే, వారిలో ఈ యొక్క వర్షము ఆగిపోతుందా? ఈ ఓడలో నుండి మనము బయటకు వస్తామా? అని అనుకుంటూ వారు ఎంతో ఓర్పును కలిగియున్నప్పుడు, దేవుడు వారిని సరైన సమయములో బయటకు తీసుకొని వచ్చాడు. కనుకనే, నా ప్రియులారా, ఈ సూత్రములను పాటించండి. ఈ సంవత్సరం, ఆయన వాగ్దానాలు మీలో బయలుపరచబడాలి. అంతమాత్రమే కాదు, మీ జీవితములో ఉత్తమమైనది ఇంకా రావలసి ఉన్నది కనుకనే, నిరీక్షణతో ఎదురు చూస్తూ, ప్రభువునందు ఎల్లప్పుడు సంతోషంగా ఉండండి. పట్టుదలతో ప్రార్థించండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసు, నీ దయ మరియు నిరీక్షణతో నిండిన ఈ నూతన దినము కొరకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, నీవు సమస్తమును మా మేలు కొరకు పనిచేయుచున్నావనియు మేము గుర్తెరిగి తెలుసుకొనుటకును, ఎల్లప్పుడూ మేము నిరీక్షణతో సంతోషంగా ఉండటానికి మాకు నేర్పించుము. ప్రభువా, నీ భక్తుడైన నోవహువలె, నీ ఉద్దేశములను మేము అర్థము చేసుకోలేనప్పుడు కూడా సంతోషంగా నీకు విధేయత చూపడానికి మాకు సహాయం చేయుము. దేవా, భయం లేదా సణగుడు లేకుండా ప్రతి శ్రమను మరియు బాధను భరించడానికి మాకు ఓర్పును దయచేయుము. ప్రభువా, మా యొక్క ప్రతి బాధ మరియు కష్టాల నుండి మమ్మును రక్షించుము. దేవా, అంతమాత్రమే కాకుండా, నీ శాంతి సమధానముతో మమ్మును మరియు మా కుటుంబాలను నింపుము. ప్రభువా, ప్రతిరోజూ ప్రార్థనలో స్థిరంగా మరియు నమ్మకంగా ఉండటానికి మా విశ్వాసాన్ని శక్తివంతముగా మార్చుము. దేవా, మేము నీ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, మా హృదయం సంతోషంతోను మరియు కృతజ్ఞతతోను పొంగిపోర్లునట్లుగా కృపను చూపుము. ప్రభువా, మేము నీ వాగ్దానాలకు లోబడి ఉన్నప్పుడు మా జీవితంలో అద్భుతాలు జరుగునట్లుగా చేయుము. దేవా, మేము నిన్ను మహిమపరిచే మరియు ఇతరులను ఆశీర్వదించే జీవితంలోకి మమ్మును నిర్మించుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


