నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 9:3వ వచనమును మన కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, " నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు '' ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీలో ఎవ్వరైనను సరే, ' నాకు న్యాయము ఎప్పుడు జరుగుతుంది? నా పట్ల ఎవరు న్యాయము జరిగిస్తారు? '' అని ఒకవేళ ఇది మీ మొఱ్ఱగా ఉండవచ్చును. ఇది అన్యాయముగా ఉండి ఉన్న లోకము. మనము ఎంతగానో ప్రయాసపడుతుంటాము. కాబట్టి, అనేక ఫర్యాయములు మనకు ప్రతిఫలము మరియు బహుమానము రాదు. అంతమాత్రమే కాదు, ప్రజలు మనలను మరచిపోతుంటారు. వ్యవస్థ మన కఠిన ప్రయాసను గుర్తించకుండా ఉంటుంది. ఇంకను కొన్ని ఫర్యాయములు దుష్టులైన వారే పైకి లేవనెత్తబడుతుంటారు. కానీ, కీర్తనలు 9:3లో వాక్యము ఏమని చెబుతుందనగా, "నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు నీతిమంతుడై ఉన్న న్యాయాధిపతియై యున్నాడు. ఆయన ప్రజలను నాశనము చేయు నీతిమంతుడైన న్యాయాధిపతి కాదు. ఆయన మీ హక్కుల కొరకై మరియు మీ వ్యాజ్యము కొరకు పోరాడే న్యాయాధిపతియై యున్నాడు. దేవుడు మీ పక్షమున పోరాడే నీతిగల న్యాయాధిపతియై యున్నాడు. కనుకనే, మీరు కేవలం ఊరకనే ఉండండి. అందుకే లేఖనము ఏమని చెబుతుందనగా, బైబిల్ నుండి నిర్గమకాండము 14:14వ వచనములో చూచినట్లయితే, "యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను '' ప్రకారముగానే, మీరు కేవలము నెమ్మదిగా ఉండండి. దేవుడు మీ పక్షమున పోరాడును. కనుకనే, ఆయన మీ పక్షమున పోరాడుటకు ఆయనను అనుమతించండి. నీతిమంతుడైన న్యాయాధిపతిగా ఆయన మీ జీవితములో న్యాయమును స్థాపించునై యున్నాడు.

రెండవదిగా, బైబిల్ నుండి లూకా 18:7,8వ వచనములలో చూచినట్లయితే, "దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?'' ప్రకారము న్యాయము త్వరితముగా మీ యొద్దకు వచ్చును. ఎందుకనగా, ఆయన నీతిమంతుడైన న్యాయాధిపతియై యున్నాడు. మీ హక్కు కొరకై, మీ కారణముల కొరకు ఆయన వాజ్యమాడి పోరాడువాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 75:7వ వచనములో మనము చూచినట్లయితే, ఆయన ఏ విధంగా తీర్పు తీరుస్తాడు? అని మనము గమనించినట్లయితే, "దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును'' ప్రకారము ఆయన బలమైన హస్తము క్రింద ఉండియున్నవారిని ఆయన హెచ్చించువాడై యున్నాడు. ఇతరులను ఆయన క్రిందకు తీసుకొని వచ్చువాడై యున్నాడు. ఒక వ్యక్తి మా యొక్క తండ్రిగారికి బ్యాంకులో చాలా సమస్యలను కల్పించేవాడు. ఆయన సెలవు దినములలో దేవుని సేవను జరిగించుచున్న కారణము చేత ఆ మేనేజర్ మా తండ్రిగారిని ఎంతగానో ద్వేషించేవారు. మా తండ్రిగారు ఎప్పుడు కూడా తన కార్యాలయములో దేవుని పనిచేయడము కానీ, ఎవరి కోసమైనను ప్రార్థన చేయడము జరిగించేవారు కాదు. కేవలము సెలవు దినములలోనే మాత్రమే ఆయన ప్రజల కోసము ప్రార్థన చేస్తుండేవారు. లేక రాత్రివేళ 8 గంటల తర్వాత మాత్రమే చేసేవారు. అప్పటి వరకు బ్యాంకు కోసమై పని మాత్రమే చేస్తుండేవారు. అయితే, ఈ వ్యక్తి మా తండ్రిగారి మీద ద్వేషము కలిగియుండెను. సరైన సమయమందున దేవుడు మా తండ్రిగారిని రెండంతలుగా పదోన్నతిని అనుగ్రహించియున్నాడు. ఆ మేనేజర్‌గారు ఇకమీదట మా తండ్రిగారి క్రింద సేవలు అందించవలసి వచ్చినది. అవును, అన్యాయంగా ప్రవర్తించే వారిని ఎలా పడగొట్టాలో మరియు తన విశ్వాసులను ఎలా పైకి లేపాలో ప్రభువుకు తెలుసు. కనుకనే, నా ప్రియులారా, సరైన సమయంలో, ఆయన మీకు అనుకూలంగా పరిస్థితులను మారుస్తాడు. ఈ రోజు మీరు మరచిపోయినట్లు అనిపించవచ్చును, కానీ మీ ఫైల్ ఇప్పటికీ దేవుని సింహాసనం యెదుట తెరచి ఉంచబడియున్నది. కనుకనే, మీ ప్రార్థనలన్నియు ఆయన సన్నిధిలో నమోదు చేయబడ్డాయి మరియు మీ కన్నీళ్లు జ్ఞాపకం చేయబడ్డాయి. కనుకనే, నీతి సింహాసనంపై కూర్చున్న ప్రభువు మీ తరపున నిలబడతాడు. ఆయన న్యాయం ఆలస్యం కాదు; అది మీ మేలు కొరకు పరిపూర్ణంగా సిద్ధపరచబడుతుంది.

మూడవదిగా, నా ప్రియులారా, దేవుడు మీ కొరకు పోరాడినప్పుడు, ఆయన మీకు న్యాయం చేయడమే కాకుండా, మిమ్మల్ని రెట్టింపుగా ఘనపరుస్తాడు. మనము బైబిల్‌లో యోసేపు కథ చూచినట్లయితే, ఈ సత్యాన్ని రుజువు చేయబడుతుంది. ఆయనపై దోషారోపణలు మోపబడ్డాయి, చెరశాలలో ఉంచబడ్డాడు మరియు మనుష్యులు అతనిని మరచిపోయారు, కానీ దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్క క్షణంలో, దేవుడు అతనిని చెరశాల నుండి రాజభవనానికి లేవనెత్తి అతనిని ఉన్నతంగా హెచ్చించాడు. అదేవిధంగా, నా ప్రియులారా, దేవుడు మిమ్మల్ని రెట్టింపు స్థాయిలో పైకి లేవనెత్తుతాడు. ప్రజలు మిమ్మును ఎంతగా శపిస్తారో, దేవుడు అంతగా మిమ్మును పైకి లేవనెత్తనై యున్నాడు. మిమ్మును గొప్ప జనాంగముగా చేయుట ద్వారా దేవుడు ఆ రీతిగా మిమ్మును ఆశీర్వదించనై యున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీకు గొప్ప పేరును అనుగ్రహిస్తాడు. తద్వారా, మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 12:2,3వ వచనములలో మనము చూచినట్లయితే, "నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనెను'' ప్రకారము మిమ్మును శపించువారు ఆ రీతిగానే శపించబడెదరు. మీరు వారి గురించి విచారించనవసరము లేదు. మీరు ఆశీర్వాదకరముగా ఉండుటను కొనసాగించుచునే ఉండండి. మిమ్మును ఆశీర్వదించువారు ఆశీర్వదింపబడుదురు. దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు. నా ప్రియులారా, ఈ ఆశీర్వాదము నేడు మీ మీదికి వచ్చును గాక. మీ యొక్క తండ్రిగా ప్రభువైన యేసు మిమ్మును అందరికంటె పైకి లేవనెత్తి మీ కొరకై న్యాయము జరిగించి, మీకు ఆలాగున చేయును గాక. ఇతరులు మీకు ఏమి చేసినా, మీరు ఒక ఆశీర్వాదంగా ఉండండి. మీరు మీ కోర్టుకేసులో రావలసిన న్యాయాన్ని దేవుని చేతులలోనికి వదిలివేసినప్పుడు, ఆయన ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మరియు ప్రతి అవమానాన్ని ఘనత మారుస్తాడు. మీకు తగిన సమయములో మీ పట్ల వ్యాజమాడి, మీకు త్వరగా న్యాయము జరిగిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవు మాకు న్యాయము తీర్చు న్యాయాధిపతిగాను మరియు రక్షకుడిగా ఉన్నందుక నీకు వందనాలు. ప్రభువా, మేము ఎదుర్కొనే ప్రతి అన్యాయాన్ని నీవు చూస్తున్నావు కనుకనే, నీవు మా చేతులలో మా వాదనను పట్టుకొనునట్లుగా మాకు నీ కృపను చూపించుము. ప్రభువా, మా పక్షమున పోరాడి, మా కోర్టుకేసులోను మరియు మా జీవితంలో నీ యొక్క నీతిన్యాయములను జరిగించుము. దేవా, సరైన సమయంలో మమ్మును పైకి లేవనెత్తి మరియు మమ్మును వ్యతిరేకించే వారు మా మీద నీ కృపను చూచునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, మా యొక్క ప్రతి బాధను సమాధానముతోను మరియు ప్రతి నష్టాన్ని రెట్టింపు ఆశీర్వాదంతో భర్తీ చేయుము. దేవా, మేము అన్యాయం చేయబడినప్పుడు నెమ్మదిగా లేక ఊరకయే ఉండటానికి మరియు నిన్ను విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవు నీ పిల్లలను రక్షించే నీతిమంతుడైన దేవుడని మా జీవితం సాక్ష్యమిచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మమ్మును బాధపెట్టిన వారికి కూడా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి మమ్మును ఆశీర్వదించుము. దేవా, నీవు మా కొరకు సిద్ధపరచిన విజయం మరియు ఘనతను మాకు దయచేసి, మా పేరును గొప్ప చేయుము. దేవా, మమ్మును ఆశీర్వదించువారిని, ఆశీర్వదింపబడునట్లుగా చేసి, మాకు రెండంతల ఆశీర్వాదమును ఘనతను దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.