నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 103:13వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "తండ్రి తన కుమారుల యెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును'' ప్రకారము నా ప్రియులారా, మీరు దేవుని యందు భయభక్తులు కలిగియున్నారా? మొదటిగా మనము ప్రభువును వెంబడించునప్పుడు, మనము ఆయన యందు భయభక్తులు కలిగియుండాలి. మొట్టమొదటిగా నా జీవితములో ప్రభువు నాకు నేర్పించాడు. ఈ రోజు వరకు ఆలాగుననే పాటించుటకు ప్రభువు ఆ కృపను నాకు ఇచ్చియున్నాడు. బైబిల్‌లో దావీదు భక్తుడు కూడా 2 సమూయేలు 24:14వ వచనములో ఈ విధంగా తెలియజేసియున్నాడు, "అందుకు దావీదు నాకేమియు తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యతగలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండ యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను'' ప్రకారము నేడు మీరు కూడా గొప్ప చిక్కులలో ఉన్నారని ఆలాగుననే విలపిస్తున్నారేమో? అప్పుడు దావీదు ఏమన్నాడు? మరియు 1 దినవృత్తాంతములు 21:13వ వచనములో చూచినట్లయితే, "అందుకు దావీదు నేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను; యెహోవా మహా కృపగలవాడు, నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను.'' ఆలాగుననే, దావీదు, ' నా దేవుడు కృపాకనికరము గలవాడు' అని చెప్పగలిగాడు. అవును, అన్నిటిలోను మన దేవుడు కృప గలిగినవాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మీరు బాధలలో ఉన్నారా? మీరు బాధతో లేదా నిస్సహాయతతో చుట్టుముట్టబడియున్నారా? గుర్తుంచుకోండి, ప్రభువు కనికరముతో నిండిన దేవుడై ఉన్నాడు; ఆయన చేతులలో పడండి, ఆయన మిమ్మల్ని ఎన్నటికిని ఓటమిపాలు చేయడు.
అదేవిధముగా, బైబిల్‌లో దేవుని కృపను అత్యధికముగా పొందుకున్న దానియేలును చూద్దాము. బైబిల్‌లో దానియేలు 9:9వ వచనములో చూచినట్లయితే, " మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి; అయితే ఆయన కృపాక్షమాపణలుగల దేవుడైయున్నాడు'' అని దానియేలు భక్తుడు చెబుతున్నాడు. ఆలాగుననే, భక్తుడైన యోనా కూడా ఈలాగుననే చెబుతున్నాడు. బైబిల్ నుండి యోనా గ్రంథము 4:2వ వచనములో చూచినట్లయితే, " యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని'' అని చెప్పినట్లుగానే, యోనా భక్తుడు కూడా దేవుని కృప కొరకు మొఱ్ఱపెట్టాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మీ జీవితములో ఈ విషయాలన్నిటిని కూడా జ్ఞాపకము చేసుకొనండి. మీరు ఒక మనుష్యుని లేక ఒక స్రీ వైపు చూస్తున్నారా?, 'నేను ఒక కష్టమైన స్థితిలో ఉన్నాను, ఎవ్వరు వచ్చి నాకు సహాయము చేస్తారు? అని మీరు ఏడుస్తున్నారా?' అయితే, మీరు ఏమి చేయాలంటే, దేవునికి మొఱ్ఱపెట్టాలి. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 4:16 వ వచనమును చదివినట్లయితే, ఈలాగున వ్రాయబడియున్నది, "గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము'' ప్రకారము అవును, స్నేహితులారా, మన దేవుడు కృపాకనికరము గలిగిన దేవుడు. మన జీవితములో కష్టాలను మరియు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, మనము ప్రభువు వైపు మాత్రమే చూడాలి. హల్లెలూయా! ఆ పరిస్థితులన్నిటిలో నుండి విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మిమ్మును మీరు తగ్గించుకొని, దీన హృదయంతో దేవుని వద్దకు వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని తన సన్నిధిలోకి ఆహ్వానిస్తాడు. అక్కడ, మీరు క్షమాపణ, బలం మరియు సమాధానమును పొందుకుంటారు. మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టును ఆయన చూస్తున్నాడు. ఇంకను మీ హృదయంలోని ప్రతి నిట్టూర్పును ఆయన వింటున్నాడు. మీ సహాయం కొరకు చేయుచున్న ప్రతి కన్నీటికి ఆయన దయతో జవాబును ఇస్తాడు. హల్లెలూయా!
నా ప్రియ స్నేహితులారా, దేవుని కరుణ మన సత్‌క్రియలకు ఆధారంగా ఉండదు. అది ఆయన ప్రేమ నుండి ఉచితంగా ఇవ్వబడుతుంది. అందుకే బైబిల్ నుండి తీతుకు 3:4-5వ వచనములలో చూచినట్లయితే, "మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను'' ప్రకారము మనము ఎంత గొప్ప రక్షకుని కలిగియున్నాము కదా! కాబట్టి, ఇప్పుడు మనలను మనము తగ్గించుకొని, ప్రభువు వైపు చూస్తూ, ఆయనకు మొఱ్ఱపెడదాము. నా ప్రియులారా, మనం విరిగినలిగి యున్నప్పుడు ఆయన కనికరము మనలను పైకి లేవనెత్తుతుంది. ఆయన దయ మన ఓటమిలను విజయంగా మారుస్తుంది మరియు ఆయన ప్రేమా వాత్సల్యత ప్రతి ఉదయం మనలను పునరుజ్జీవింపజేయుచున్నది. నేడు, మీ పరిస్థితి ఏదైనా - అనారోగ్యం, ఒంటరితనం, అపరాధం లేదా గందరగోళం ఉన్నను సరే, మీరు ధైర్యంగా ఆయన కృపాసింహాసనమునొద్దకు రండి. ప్రభువు చేతులు మీ కొరకు తెరువబడియున్నవి. కనుకనే, ఆయన మిమ్మును తృణీకరించడు. "తండ్రి తన కుమారుల యెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును' అని చెప్పబడినట్లుగానే, తండ్రి బాధలో ఉన్న తన బిడ్డను కౌగిలించుకున్నట్లుగా ఆయన మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకొని, మిమ్మును కౌగలించుకుంటాడు. ఆయన కనికరము మీ జీవితాన్ని పునర్నిర్మిస్తుంది మరియు మీ హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. ఈ దయగల దేవుని మనలను మనము దీనమస్సుతో తగ్గించుకుని, ఆయన పొంగిపొర్లుతున్న కృపను పొందుకుందాం. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ యెడల జాలి చూపించి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైనటువంటి పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నిరాశ మరియు నిస్పహృలో ఉన్న మమ్మును చూచి, మా జీవితాలను తాకి, మా మీద నీ కనికరమును చూపించుము. దేవా, ఇప్పుడే నీ దయయు, కనికరమును మా మీదికి వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదములనన్నిటిని మేము పొందుకొనునట్లుగాను, నీ సన్నిధితో మమ్మును నింపుము. ప్రభువా, మేము అలసిపోయి, నలిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మమ్మును చూడుము. దేవా, నీ దయ మా కలత చెందిన హృదయాన్ని ఓదార్చుము. యేసయ్యా, మా పాపాలను క్షమించి, నీ కృపతో మమ్మును పవిత్రపరచుము. దేవా, మా ఇంటిని సమాధానముతోను మరియు దైవీక శక్తితోను నింపుము. ప్రభువా, మా జీవితం నుండి ప్రతి అనారోగ్యం, భయం మరియు బాధను తొలగించుము. దేవా, నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి, మా హృదయాన్ని నూతనంగా పునరుద్ధరించుము. ప్రభువా, ఎల్లప్పుడూ మేము నీ యందు భయభక్తులతో నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ సన్నిధితో మేము నిత్యము ఉల్లసించునట్లుగా నీ కృపను మాకు దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


