నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున మీకందరికి నా శుభములు. ఈరోజు ధ్యానమునిమిత్తము బైబిల్ నుండి సామెతలు 21:21వ వచనము ఇది అద్భుతమైన వాగ్దానము. ఆ వచనము, "నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును'' అని ఈ లేఖనము సెలవిచ్చుచున్నది. ఎటువంటి విధముగా ప్రభువు మిమ్మును ఆశీర్వదిస్తాడు? అందుకే బైబిల్ నుండి కీర్తనలు 17:15వ వచనములో చూచినట్లయితే, "నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును'' అని చెప్పబడిన ప్రకారముగా వాక్యమును చదువుతూ, ప్రార్థిస్తూ, మీరు హృదయపూర్వకముగా ఆయనను వెదకినట్లయితే, మన జీవితాలు రూపాంతరపరచబడతాయి. ఆలాగున చేసినప్పుడు, ప్రభువు మనకు ఏమి జరిగిస్తాడు? అందుకే బైబిల్ నుండి యెషయా 41:10వ వచనమును చూచినట్లయితే, "నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును'' అని చెప్పబడినట్లుగానే, ఆయన తన నీతియను దక్షిణ హస్తముతో మనలను ఆదుకుంటాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

ఇంకను నా ప్రియులారా, మనము బైబిల్ నుండి యెషయా 61:10వ వచనములో చూచినట్లయితే, " శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లి కుమారు ని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, రక్షణ వస్త్రములను మనకు ధరింపజేసి, తన యొక్క నీతి అను పైబట్టను మనకు ధరింపజేస్తాడు. అవును నా ప్రియ స్నేహితులారా, మనము ప్రభువును వెదకినప్పుడు మన జీవితాలు రూపాంతరపరచబడతాయి. ప్రభువు మిమ్మును తన రక్షణ వస్త్రములతో ఉద్ధరింపజేస్తాడు. కనుకనే, యేసయ్యను మీ స్వంత రక్షకునిగా మీరు కలిగి ఉంటారు. తద్వారా, ప్రభువు మిమ్మును నీతి వృక్షములుగా మారుస్తాడు. మీ ద్వారా ప్రభువు యొక్క నామము మహిమపరచబడుతుంది. ఇంకను బైబిల్ నుండి యాకోబు 3:18వ వచనములో మనము చూచినట్లయితే, "నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును'' అని చెప్పబడినట్లుగానే, నీతి ఫలములను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు.

నా ప్రియులారా, ఒకవేళ అనేకమంది, 'మాకు సమాధానము లేదు ఈ రోజు ప్రజలు అంటుంటారు, 'ఉద్యోగములో సమాధానము లేదు, ఇంకను ఏ కారణము లేకుండా ప్రజలందరు మాకు వ్యతిరేకముగా ఉన్నారు, గృహములో భార్యభర్తల మధ్య సమాధానము ఉండడము లేదు. ఇంకను తల్లిదండ్రులకు మరియు బిడ్డల మధ్య సమాధానము ఉండడము లేదు.' ఎందుకని? మనము ఆయనను వెదకవలసిన రీతిలో వెదకడము లేదు గనుకనే. దేవుని వాక్యమును అస్సలు చదవనే చదవము. ప్రార్థన సమయము అస్సలు ఉండదు. ఏదో నామాకార్థముగా చేస్తాము అంతే! అయితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదములను మీరు కోల్పోతారు. హల్లెలూయా! మీరు ప్రభువును యథార్థముగా వెదకినట్లయితే, సామెతలు 21:21వ వచనములో చెప్పబడినట్లుగానే, ప్రభువు మిమ్మును సమృద్ధిగా దీవిస్తాడు. మొదటిగా మీ గృహము సమాధానముతో నిండిన గృహముగా ఉంటుంది. అన్నిచోట్ల సమాధానము ఉంటుంది. ఇంకను భార్యభర్తల మధ్య సమాధానము ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్లినను సమాధానమును మీరు చూచెదరు. ఎందుకనగా, యేసయ్యా, మీ కార్యములన్నిటిని చూచుకుంటాడు. ఇప్పుడు మనము కలిసి ప్రార్థించుకుందాము. ప్రభువు మీ జీవితములో అటువంటి సమాధానమును నేడు ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, ఆ సిలువలో మాకిచ్చిన దీవెనల కొరకై నీకు వందనములు. యేసయ్యా, మేమెల్లప్పుడు పాపపు జీవితమును కలిగియుంటూ నీకు దూరమైపోయి ఉన్నాము, కనుకనే, నీవు సిలువలో చేసినటువంటి సమకూర్పుకై నీకు వందనములు. యేసయ్యా, మా పాపముల నుండి మేము విడుదల పొందాలని మా కొరకు నీవు శ్రమనొందియున్నావు మరియు వ్యాధుల నుండియు, శాపముల నుండియు, నీ సమాధానముతో మమ్మును నింపడానికి నీవు మా కొరకు బలిగా మారినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మా కుటుంబములో ప్రతి ఒక్కరు ఇటువంటి గొప్ప సమాధానమును పొందుకొనునట్లుగా కృపను మాకు దయచేయుము. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మేము యథార్థమైన హృదయంతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, మేము చేయుచున్న ప్రతి పనిలో నీతిని వెంబడించడానికి దయచేసి మాకు సహాయం చేయుము. యేసయ్యా, నీ వాక్యాన్ని చదవడం మరియు ప్రార్థన ద్వారా ప్రతిరోజూ నిన్ను మా హృదయపూర్వకంగా వెదకడానికి మాకు నేర్పించుము. దేవా, రక్షణ మరియు నీతి అనే వస్త్రాన్ని మాకు ధరింపజేసి, నీ యొక్క నీతిగల దక్షిణ హస్తముతో మమ్మును బలపరచుము. ప్రభువా, నీ శాంతి మా హృదయాన్ని, మా గృహమును మరియు మేము వెళ్లు ప్రతి చోట నింపబడునట్లుగా చేయుము. దేవా, నీ మహిమ కొరకు నీతి వృక్షము వలె మమ్మును స్థిరపరచుము. ప్రభువా, మా జీవితం నీ ప్రేమను ప్రతిబింబించేలా మరియు ఇతరులకు సమాధానమును కలిగించునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.