నా ప్రియమైనవారలారా, ఈ రోజు ప్రభువు మీ జీవితము మీద తన ఆశీర్వాదపు వర్గమును కురిపించబోవుచున్నాడు. ఇది నూతనత్వమును, అభివృద్ధిని మరియు ఫలభరితమైన జీవితమును అనుగ్రహించే దీవెనకరమైన వర్గముగా ఉండబోవుచున్నది. అంతమాత్రమే కాదు, మీ జీవితములో ఎండిపోయినవన్నియు కూడా వర్ధిల్లునట్లుగా చేస్తాడు. అలాగైతే, దేవుడు సంకల్పించినవన్నియు నిశ్చయముగా నెరవేర్చబడతాయి. ఆయన ఆశీర్వాదములను పరిపూర్ణతను మీరు అనుభవించునట్లుగా ఆయన కృప మీ మీద కుమ్మరించబడుచున్నది. కాబట్టి నిరుత్సాహపడకండి, ఎందుకంటే ప్రభువు మిమ్మును ఎన్నటికి మరువడు. యేసు నామములో, ఈ దీవెనకరమైన వర్గము మీ మీద కురిపించి, మీ జీవితములోని ప్రతి అంశమును నింపును గాక. అంతమాత్రమే కాదు, మీ కన్నీరంతయు తుడిచివేయబడి, మీ కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోవును గాక. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లేవీయకాండము 26:4వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును '' అని చెప్పబడినట్లుగానే, నిశ్చయముగా, నేడు ప్రభువు మీ చేతి పనులకు తగిన ప్రతిఫలమును అనుగ్రహించుచున్నాడు. మీరు చూపిన ప్రేమ, చేసిన దయగల కార్యములు మరియు మీరు చేసిన త్యాగములు ఎన్నటికిని మరచిపోడు. ప్రభువు తన వాగ్దానము ప్రకారము మీకు సమృద్ధియైన ఆశీర్వాదములను, ప్రతిఫలములను అనుగ్రహిస్తాడు.
దేవుని ప్రేమ అనే వర్షము: ప్రభువు కురిపించు వర్షము అందరి మీద కురిపించబడుతుంది. అందుకే బైబిల్ నుండి మత్తయి 5:45వ వచనములో యేసు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, " ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, ఇది దేవుని హృదయమును తెలియజేయుచున్నది. కొందరు ఇలాగున చెప్పవచ్చును, 'నేను చక్కగా జీవించుచున్నాను. నాకంతా సమృద్ధిగానే ఉన్నది. నాకు యేసు గానీ, దేవుడు గానీ అవసరం లేదు. నా జీవితములో అంతయు చక్కగా కొనసాగుచున్నది, ఇంకను నేను దీర్ఘాయువును కూడా కలిగియున్నాను' అని గర్వముతో చెప్పుకుంటారు. కానీ, ఈ ఆశీర్వాదములన్నియు ప్రభువు యొక్క కనికరం మరియు కృప వలననే లభించినవని వారు గ్రహించరు. చెడు చేయువారు, అధికారమును దుర్వినియోగం చేయువారు, ఇతరులను నాశనము చేయడానికి ప్రయత్నించువారు, తమ స్వంత పేరు మరియు విజయాన్ని కోరుకొనువారు లేదా పేదలు మరియు అవసరమైన వారి పట్ల అన్యాయంగా ప్రవర్తించేవారు కూడా దేవుని వర్షమును పొందుకుంటారు. ఇది దేవుని సహనము మరియు ప్రేమను కనుపరుస్తుంది. ఆయన మానవాళినంతటి ప్రేమించుచున్నాడు మరియు ప్రతి ఒక్కరు ఆయన ప్రేమను గుర్తెరుగునట్లుగా, చెడు మార్గములు నుండి వైదొలగి, ఆయన వైపునకు తిరిగి రావలెనని కోరుకుంటాడు. కాబట్టి, మనము ఇతరులను నిందించకూడదు. అందుకు బదులుగా, మనము వారందరిని ప్రేమించవలెను మరియు దేవుని ప్రేమను అందరితో పంచుకొనవలెను. భయము, అసూయ, కోపము లేదా చిరాకు మన హృదయములలోనికి ప్రేరేపించునట్లుగా మనము అనుమతించకూడదు. ప్రభువు అందరి మీద తన వర్షమును కురిపించునట్లుగానే, మనము కూడా ఇతరుల పట్ల ఆయన ప్రేమ అను వర్షమును కురిపించవలెను.
దేవుని వర్షపు ఆశీర్వాదాన్ని అనుభవించెదరు: వర్షము అందరి మీద కురిపించబడుతుంది. కానీ, అది మంచి నేల మీద పడినప్పుడు మాత్రమే పంటలను ఇచ్చుచున్నది. కొందరు దేవుని ఆశీర్వాదములను పొందుకుంటారు. కానీ, వాటిని అర్థం చేసుకోలేకపోవుదురు. ఇతరులు తమ పరిస్థితులను గురించి గుర్తించకుండా, దేవుని ప్రణాళికలలో దాగి ఉన్న ఆశీర్వాదములను కోల్పోతారు. అందుకే బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 7:14వ వచనమును చూచినట్లయితే, " నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును '' అని చెప్పబడినట్లుగానే, దేవుని ప్రజలు ఆయన యెదుట తమను తాము తగ్గించుకొని, ఆయన ముఖమును వెదకి, పాపపు మార్గములను విడిచిపెట్టవలెను. ఆలాగుననే, మనము ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆయన క్షమాపణను, స్వస్థతను, మరియు పునరుద్ధరణను మనకు సంపూర్ణంగా అనుగ్రహించబడుతుంది.
దానియేలు విశ్వాసము మరియు దేవుని కాపుదల: ఇందుకు దానియేలునకు ఉన్న అచంచలమైన విశ్వాసమునకు ఒక నిదర్శనం. తనకు వ్యతిరేకంగా రహస్యంగా ఒక చట్టము చేయబడినప్పుడు కూడా, దానియేలు ప్రార్థన చేయుచూ, దేవునిని ఆశ్రయించడం కొనసాగించాడు. తద్వారా, తాను సింహముల బోనులో పడవేయబడతాడని తెలిసినప్పటికిని, అతను ప్రభువు యందు నమ్మకము కలిగియుండుట మానలేదు. దేవుడు దానియేలును సింహముల నుండి కాపాడాడు. సింహములు అతనికి ఏ హానియు చేయలేకపోయినవి. అతను ప్రాణముతో బయటపడి, ఉన్నతమైన అధికారమును పొందుకున్నాడు. నా ప్రియులారా, దానియేలును కాపాడిన అదే దేవుడు, తన యందు నమ్మకముంచి వారి జీవితాలలో కూడా కార్యములు చేయడానికి నేటికిని సమర్థుడుగా ఉన్నాడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, మనము విశ్వాసముగలవారమై ఉంటూ, దేవుని మార్గములను వెదకడము కొనసాగించుదాము. ఆయన యెదుట మనలను మనము తగ్గించుకొని, ఆయన సత్యమార్గంలో మరియు నీతిమార్గములో నడుచుకున్నప్పుడు, ఆయన మన జీవితాలలోనికి మరియు దేశములలోనికి తన యొక్క శాంతిని, పునరుద్ధరణను మరియు ఆశీర్వాదమును తీసుకువస్తాడు.
ఆలాగుననే, మీ పని మరియు భవిష్యత్తుపై ఆశీర్వాదములు: మీ కఠినమైన శ్రమ, మీ చేతుల కష్టార్జితము, చదువు, ప్రయత్నాలు మరియు మీ భవిష్యత్తు మీద ప్రభువు తన వర్షమును కురిపించుచున్నాడు. తద్వారా, ఆయన మిమ్మును జీవితములో స్థిరపరుస్తాడు, మీ కుటుంబమును బలపరుస్తాడు, మీ ఇంటిని నిర్మిస్తాడు మరియు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రేమ ప్రవాహము వలె మీమీదికి దిగివచ్చి, మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ తన మంచితనాన్ని నింపుతుంది. కాబట్టి, ధైర్యంగా ఉండండి మరియు ఆయన వాగ్దానములను నమ్మండి. దేవుని దీవెనకరమైన వర్షమును అనుభవించండి.
ఇంకను ఆధ్యాత్మిక వర్షపు వాగ్దానము: బైబిల్ నుండి యాకోబు 5:17-18వ వచనములలో చూచినట్లయితే, ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను '' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మానవుల జీవితాలపై మరియు దేశాలపై ఆత్మీయ వర్షాన్ని కురిపించాలని ఆశించుచున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క తొలకరి మరియు కడవరి వర్షం ఈ తరము మీద కురిపించబడును గాక. ఆయన వాగ్దానము ప్రకారము కుమారులు, కుమార్తెలు లేచి దేవుని వాక్యమును ప్రకటించుదురు గాక. నా ప్రియులారా, నేడు ప్రభువు తన ఆత్మీయ వర్షముతో మీ హృదయాలను నింపి, జీవితాలను మార్చి, అనేకులు ఆయన ప్రేమను గుర్తెరుగునట్లుగా నడిపించును గాక. ఆయన నిత్యమైన కృప ద్వారా కుటుంబముల మీద, దేశముల మీద ఆయన ఆశీర్వాదము, శాంతి, రక్షణ నిలిచి యుండును గాక. దేవుడు నేడు మనకు ఇచ్చిన అమూల్యమైన వాగ్దానము కొరకు దేవునికి వందనములు చెల్లించండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్య, నీ అమూల్యమైన ఆశీర్వాదపు వాగ్దానమునకై నీకు వందనములు. దేవా, నీ యొక్క పరిపూర్ణ సమయమునందు విశ్వాసము ఉంచి, మా జీవితముల మీద నీ యొక్క కృపా వర్షాన్ని పొందునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా హృదయములో నీ వాక్యమును అంగీకరించి, సమృద్ధిగా ఫలములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సారవంతమైన మంచి నేల వలె ఉండునట్లుగా మమ్మును మార్చుము. దేవా, మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించుము, మా కుటుంబములను స్థిరపరచి, బలపరచి మరియు నీ మార్గములలో మమ్మును నడిపించుము. ప్రభువా, ఇతరుల మీద నీ యొక్క ప్రేమను కుమ్మరించడానికి మరియు నీ యెదుట మమ్మును మేము తగ్గించుకొని, విధేయతతో నడవడానికి మాకు నేర్పించుము. ప్రభువా, నీ యొక్క ఆత్మీయ వర్షం మా జీవితాలలోను మరియు దేశాలలోను పొందుకొని, సేదదీరునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క మంచితనమును మేము అనుభవించునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


