నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మీకు శుభములు తెలియజేయుటలో నేను ఎంతో సంతోషించుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 2:8వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను'' అను వచనం ప్రకారం, నా స్నేహితులారా, దేవుడు జనములను మీకు స్వాస్థ్యముగా చేయుచున్నాడు. ఒకవేళ ఈరోజు మీరు ఇలా చెప్పవచ్చును: 'నాకు ఉద్యోగం ఉంటే, నాకు ఒక గృహము ఉంటే, కుటుంబం ఉంటే, అది నాకు చాలు. నేను సంతృప్తి చెందుతాను.' కానీ నా స్నేహితులారా, దేవుడు జనములను మీకు స్వాస్థ్యముగా ఇవ్వాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. ఆయన మిమ్మును ఉన్నత స్థలములలో ఉంచుతాడు, మీకు ఒక గొప్ప పేరును కలిగిస్తాడు, తద్వారా ఆయన నామం మీ ద్వారా మహిమపరచబడుతుంది. అవును, బహుశా! మీరు వేరే స్థలములో, మంచి కంపెనీలో, వేరొక దేశంలో, మీ యొక్క ఉద్యోగం కొరకు లేదా మీ భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎదురు చూస్తున్నారా? కానీ, ఈ రోజు మీరు ఇలాగున అనవచ్చును, 'నా భవిష్యత్తులోను లేక ఉద్యోగములో నేను ముందుకు సాగిపోవుటకు ఒక మార్గము నాకు కనిపించడం లేదు' అని అంటున్నారా? కానీ నా స్నేహితులారా, 'జనములు మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్నాను' అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మిమ్మును ఉన్నత స్థానాలలో ఉంచుతాడు. కనుకనే, మీరు భయపడకండి.

సహోదరి రాణి, తన కుమారుని గురించిన సాక్ష్యమును ఈలాగున పంచుకున్నారు. ఆమె కుమారుని జీవితములో అదే జరిగియున్నది. తన కుమారుడైన వైశాక్, అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో 7 సంవత్సరములుగా ఉద్యోగము చేయుచుండెను. అమెరికా దేశములో అతడు ఉంటు న్నప్పుడు, అతనికి చక్కగా ప్రాజెక్టులన్నియు వచ్చుచుండెను. కనుకనే, అతనికి ఎటువంటి సమస్య లేకుండా, చక్కగా అక్కడ ఉద్యోగము చేయుచుండెను. అంతమాత్రమే కాదు, అతనికి వీసాతో పాటు అక్కడ సంతోషంగా జీవించుచుండెను. అయితే, అకస్మాత్తుగా అతను చేయుచున్న ప్రాజెక్టులన్నియు ముగిసిపోయినదని ఆ కంపెనీ తెలియజేసెను. కనుకనే, అతడు ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలి. కానీ, అతని వీసాలో ఇంకా 3 సంవత్సరములు గడువు ఉన్నప్పటికిని, అమెరికాలో చేయుచున్న ప్రాజెక్టు ముగిసిపోవడము వలన అతడు భారత దేశమునకు తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడినది. కాబట్టి, అతడు త్రివేండ్రం ముందు ఉద్యోగము చేసిన సంస్థలో తాను మరల ఉద్యోగమును సంపాదించుకోవాలని అనుకున్నాడు. ఆ సంస్థవారు కూడా మా యొద్ద ఎటువంటి ప్రాజెక్టు అందుబాటులో లేవని చెప్పడము చేత, అతనికి అక్కడ కూడా ఉద్యోగము రాలేదు. అతనికి ఏమి చేయాలో తెలియక, ఎక్కడ ఉద్యోగము లేకుండా ఎంతగానో వేదనపడ్డాడు. ఆ సమయములో వారు డాక్టర్. పాల్ దినకరన్‌గారికి ఒక ఉత్తరము వ్రాశారు. అమెరికాలోని ఐటి సంస్థలో ఉద్యోగము రావాలని ప్రార్థించమని కోరారు. అయితే, డాక్టర్. పాల్ దినకరన్‌గారు, ' దేవుడు మీ కుమారునికి నిశ్చయముగా ఉద్యోగమును ఇస్తాడు' అని ఉత్తరము వ్రాసి, వారిని విశ్వాసములో ఎంతగానో ప్రోత్సహించి, వారికి జవాబును పంపించారు. డాక్టర్. పాల్ దినకరన్‌గారు ప్రార్థించిన రీతిగానే, అమెరికాలో ప్రభుత్వ రంగములో ఉన్నటువంటి ఐటి సంస్థలో ఉద్యోగమును ప్రభువు ఇచ్చాడు. అందును బట్టి, అతని తల్లిగారు ఎంతో సంతోషముతో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ, ఒక టి.వి. కార్యక్రమమును స్పాన్సర్ చేశారు. వెంటనే, అతడు గ్రీన్ కార్డు పొందుకోవడానికి కూడా ప్రభువు అతనికి సహాయము చేశాడు. నా స్నేహితులారా, ఉద్యోగము మాత్రమే కాదు, ఆ దేశములో ఉండడానికిని ప్రభువు ఒక గ్రీన్ కార్డు పొందుకొనడానికి అతనికి సహాయము చేసి, అతనిని దీవించాడు. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియులారా, బైబిల్‌లో యిర్మీయా 23:23వ వచనమును మనము చూచినట్లయితే, " నేను సమీపముననుండు దేవుడను మాత్రమేనా? దూరముననుండు దేవుడను కానా?'' అని చెప్పబడినట్లుగానే, కాబట్టి, మనము దేనిని గురించి చింతించనవసరము లేదు. మన కొరకు అన్నియు చేయగల సమర్థుడు మన ప్రభువు. ఎందుకంటే, ప్రపంచము ఆయన చేతులలో ఉన్నది. జనములు ఆయన చేతిలో ఉన్నవి. స్నేహితులారా, ఈ రోజు మీ కొరకు ఆయన గొప్ప ప్రణాళికలను కలిగియున్నాడు. ఈ రోజు మీరు స్థిరపడాలి అని మాత్రమే ప్రభువు కోరుకోవడము లేదు కానీ, మిమ్మును ఉన్నత స్థలమునకు తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నాడు. మీ విశ్వాసమును బట్టి, మిమ్మును ఘనపరచాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, నేడు మీరు ఆయనకు విధేయులు గనుకనే, మీ జీవితములో మీరు ప్రభువు నామమును కలిగి ఉన్నారు గనుకనే, మీ ద్వారా, ప్రభువు నామము ఘనపరచబడుతుంది. కనుకనే, దేనిని గురించి చింతించకండి, ప్రియులారా, మీ భవిష్యత్తు ప్రభువు హస్తాలలో ఉన్నది. మీరు ఇంతటి గొప్ప దీవెనలను పొందుకోవాలంటే, మీరు ఆయనకు లోబడుచూ, ఆయనయందు ఆయన హస్తముల క్రింద దీనమనస్కులై ఉన్నప్పుడు, నిశ్చయముగా, దేవుడు మీకు జనములను స్వాస్థ్యముగా ఇచ్చి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా మరొక స్థానమునకు హెచ్చించి, మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కనికరముగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు జనములను మాకు స్వస్థ్యముగాను మరియు భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తావని నీ యొక్క శక్తివంతమైన వాగ్దానానికై నీకు వందనాలు. ప్రభువా, కొన్నిసార్లు మేము కలిగియున్నవాటితో సంతృప్తి చెందకుండునట్లుగా కాకుండా, నీవు మాకు దాచియుంచిన మేలు గొప్పవని మేము గుర్తించునట్లుగా చేయుము. ప్రభువా, నీవు మా కొరకు సిద్ధపరచి స్థలమునకు మమ్మును హెచ్చించుము. యేసయ్యా, నీవు సమీపమునకును మరియు దూరానికిని దేవుడివి. కనుకనే, మమ్మును ఘనపరచడానికిని మరియు ఉన్నత స్థలములకు తీసుకెళ్లడానికి నీవు మా పట్ల గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నావని మేము నమ్ముచున్నాము. దేవా, మేము విశ్వాసంతో నీలో నడవడానికి, నీ స్వరాన్ని పాటించడానికి మరియు ధైర్యంగా నీ నామాన్ని మోయడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ మహిమ మాలో ప్రత్యక్షపరచబడునట్లుగాను, మా జీవితం పట్ల నీ ఉద్దేశము పరిపూర్ణంగా నెరవేరునట్లుగా కృపనిమ్ము. ప్రభువా, మా ఉద్యోగములో మరొక స్థాయికి వెళ్లుటకును, పదోన్నతి కొరకు, బదిలీ కొరకు, వీసా వచ్చుట కొరకు మాకు సహాయము చేయుము. దేవా, మా ఉద్యోగములోను, జీవితములోను మూయబడిన ద్వారములు తెరవబడుటకు సహాయము చేయుము. దేవా, మా ఉద్యోగములో ఉన్నత స్థాయికి లేవనెత్తుటకు, ఉన్నతముగా హెచ్చింపబడునట్లుగా కృపనిమ్ము. ప్రభువా, మేము నిన్ను ఘనపరచుటకును, నీకు విధేయత కలిగి ఉండునట్లుగాను, మా జీవితములో నీ చిత్తమును జరిగించునట్లుగా కృపనిమ్ము. దేవా, మేము ఎన్నడును, ఎక్కడ కూడను అవమానింపబడకుండా, మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.