నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 85:12వ వచనమును మనము ధ్యానము చేయబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా ఉత్తమమైన దానిననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును'' ప్రకారము దేవుడు మీకు నేడు ఉత్తమమైనదానిని అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. ప్రియులారా, నేడు మీ జీవితములో అంతా నష్టమైపోయినదని మీరు అంటున్నారా? మేము కలిగియున్నదేదియు మా కొరకు పనిచేయలేదు మరియు మా ఉద్యోగములో మేము ఒక వైఫల్యము నొందిన వ్యక్తులముగా ఉన్నాము మరియు మా వ్యాపారము అంతయు నష్టముతో నిండియున్నది, మా బాంధవ్యమంతయు వైఫల్యముగా ఉన్నది అని అంటున్నారా? మా ఇంటిలో అసలు సమాధానము లేదు అని అంటున్నారా? మా చదువులలో మేమెంతగానో కష్టపడుచున్నామని అంటున్నారా? మేమేమి చేసినను మాకు ప్రతి ఫలము లభించలేదు, మేము ఎంతో కష్టపడి పనిచేయాలని అనుకుంటున్నాము. కానీ, మా శరీరము సహకరించలేదు. ఇంకను మా ఉద్యోగములోను, చదువులలోను, బాంధవ్యములలోను మరియు అన్నిటిలోను కష్టపడి పనిచేస్తున్నాము. కానీ, ఏదియు మాకు తగిన ప్రతిఫలమును ఇవ్వలేదు అని అంటున్నారా? అయితే, మీరు చింతించకండి, ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువు మిమ్మును దీవిస్తాడు. ఆయన ఉత్తమమైనదానిని మీకు అనుగ్రహిస్తాడు. నేటి నుండి మీరు మీ యొక్క ప్రతిఫలమును పొందుకొని అనుభవిస్తారు.
నేడు నేను మీతో ఒక సాక్ష్యమును పంచుకోవాలని కోరుచున్నాను. ఏలూరుకు చెందిన ఈ ప్రియ సహోదరుడైన బాబీ జీవితములో అదే జరిగియున్నది. ఆ సహోదరుడు ఏలూరు పట్టణములో ఒక ఉపాధ్యాయునిగా పనిచేయుచున్నారు. అతడు ఒక వ్యాపారమును ప్రారంభించాలనుకొని తాను చేయుచున్న ఉద్యోగమును మానివేసి, 2023వ సంవత్సరములో తాను ఒక వ్యాపారమును ప్రారంభించారు. వ్యాపారమును ప్రారంభించిన ఆరంభ దినములలో ఆ వ్యాపారములో ఎటువంటి ఫలితములు లేవు. అన్ని నష్టాలు మాత్రమే ఎదుర్కొనుచుండెను. అయితే, అతని స్నేహితులందరు అతనిని హేళన చేయడానికి ప్రారంభించారు. అతనిని అణగద్రొక్కుచుండేవారు. అతని స్వంత కుటుంబ సభ్యులు కూడా, అతనిని నిరాశపరచేవారు. నీవు ఎందుకు పనికిరానివాడవు అని అంటుండేవారు. నీవు ఏమియు కూడా చేయలేవు, కనుకనే, నీవు ఎందుకు పనికిరానివాడవు అని చెప్పేవారు. ఈ వ్యాపారము చేయుచూ, నీవు పనికిరాని వాటి వెంబడి వెళ్లుచున్నావు, అని వారు అతనిని నిరాశపరచే మాటలు మాట్లాడేవారు. అందువలన, అతని హృదయములో ఎంతో వేదనను మరియు బాధను కలిగించెను. అతడు ముందుకు సాగలేకపోయాడు. ఈ మాటల వలన అతడు ఎంతో నిరాశ నిస్పృహలోనికి వెళ్లిపోయాడు. అతని వ్యాపారములో తాను ఎటువంటి విజయమును చూడలేదు ఇంక సమయము లేదు కనుకనే, ఇక అన్నిటిని మూసివేయాలని తలంచుకున్నాడు.
కానీ, 2024వ సంవత్సరము, అక్టోబర్ 19వ తారీఖున, అటువంటి విరిగిన పరిస్థితిలో యేసు పిలుచుచున్నాడు తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో, "ఈ రోజు వాగ్దానము'' అను శీర్షికను అతడు వీక్షించాడు. ఆ కార్యక్రమములో డాక్టర్. పాల్ దినకరన్‌గారు వర్తమానమును అందించి, ప్రార్థించడము అతడు వీక్షించాడు. అతడు కూడా మా నాన్నగారితో కలిసి ప్రార్థించారు. ప్రార్థన సమయములో ఆకస్మాత్తుగా, అతని పేరును పెట్టి పిలిచారు, 'యేసు నామములో నీవు విడుదల నొందియున్నావు బాబీ, నేటి నుండి దేవుడు నిన్ను దీవించుచున్నాడు ' అని చెప్పారు. బాబీ అను తన పేరును వినగానే, అతడు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. ఎందుకనగా, అతడు ఎప్పుడు కూడా తన సమస్యలను డాక్టర్. పాల్ దినకరన్‌గారితో చెప్పలేదు. ప్రార్థన ముగించిన తర్వాత, అతని బంధకాలన్నిటి నుండి అతడు విడుదల నొంది, అతడు స్వాతంత్య్రమును పొందుకొని, ప్రభువు సమాధానమును అతడు అనుభూతి చెందాడు. తన జీవితములో ఉన్న సమస్యలన్నియు కూడా కనుమరుగై పోయినట్లుగా అతడు చూడగలిగాడు. దేవుడు అతని వ్యాపారాన్ని కూడా ఆశీర్వదించడానికి ప్రారంభించాడు. ఈ రోజు తాను పది రెట్లు అభివృద్ధిని అతడు చూడగలిగాడు. అవును, స్నేహితులారా, అతడు ప్రారంభించిన వ్యాపారములు ఎటువంటి ఫలితాలు లేవు అని అతడు ఎంతగానో నిరాశపడ్డాడు. తన చుట్టు ఉన్న ప్రజలందరు కూడా అతనిని హేళన చేశారు. కానీ, ప్రభువు అతనికి ఉత్తమమైన వాటిని అనుగ్రహించాడు. ప్రభువు తనను దర్శించి, అతనిని హెచ్చించి, తన ఫలములను అభివృద్ది నొందించి, చక్కగా ఉత్తమమైన వాటితో అతనిని బహుగా దీవించాడు. అతని భూమి ఫలితాలను ఇవ్వడము ప్రారంభించినది. హల్లెలూయా!
అవును నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీ జీవితములో కూడా అంతా వైఫల్యము కలుగుచున్నదని చింతించుచున్నారేమో? నేను ఈ కుటుంబములో ఎందుకు జీవించుచున్నాను? ఈ పాఠశాలలో ఎందుకు చదువుచున్నాను? ఈ ఉద్యోగమును మరియు ఈ వ్యాపారమును ఎందుకు చేస్తున్నాను? అని అనేక ప్రశ్నలు మీరు అడుగుచున్నారేమో? అయితే, మీరు ఈ రోజు నుండి, 'ప్రభువా, ఈ ఉద్యోగమును మాకిచ్చినందుకై నీకు వందనాలు' అని చెప్పండి. మీరు ఏదైనను సరే, ' మా కొరకు నీవు ఉత్తమమైనదానిని అనుగ్రహిస్తావు' అని చెప్పండి. మరి ముఖ్యముగా, 'నా భర్త కొరకై, నా బిడ్డల కొరకై నీకు వందనాలు, నా మేలు కొరకే ఇదంతయు జరిగిందని' చెప్పండి. ఇంకను, ' నా పాఠశాలకై మరియు నా ఉద్యోగము కొరకై వందనాలు, నీవు ఉత్తమమైన వాటిని నాకిచ్చినందుకై నీకు వందనాలు' అని చెప్పండి. అనుదినము మీకున్నవాటిని బట్టి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువు మీకిచ్చిన వాటిని బట్టి, మీరు ఫలితములను, పంటలు ఫలించడము మీరు చూచెదరు. మీ గృహములో సమాధానము మరియు ఆనందమును మీరు చూచెదరు. మీ ఉద్యోగములో అద్భుతమైన హెచ్చింపును మీరు చూచెదరు. మీ వ్యాపారములో ఫలితములను, మేలులను, లాభాలను మీరు చూచెదరు. మీ చదువులలో మీరు ఇంతకు ముందు ఎన్నడూ చూడని మీ చదువులలో మంచి మార్కులను చూచెదరు. నా ప్రియులారా, నేటి నుండి మీకు కలిగియున్నవాటన్నిటి నిమిత్తము మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడము ప్రారంభించి, 'ప్రభువా, నీవు నాకు మేలులను అనుగ్రహించావు' అని చెప్పినప్పుడు, మీ జీవితంలోని ప్రతి రంగంలో అభివృద్ధిని, ప్రతిఫలం మరియు పంటను కోయడం మీరు చూచుటకు ప్రారంభిస్తారు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహా కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా విరిగిన స్థితిలో, మా జీవితములో ఏమియు పనిచేయడం లేదని మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మేము ఎంత కష్టపడి పనిచేసినను, దాని ప్రతిఫలమును మేము చూడలేకున్నాము. కనుకనే, ఈ రోజు మేమము నిన్ను విశ్వసించాలని ఎంచుకున్నాము. ప్రభువా, మా జీవితంలో నీవు మాకు ఇచ్చిన మరియు మమ్మును ఆశీర్వదించిన ప్రతిదానికి, మా చదువులు, కుటుంబము, బాంధవ్యము, ఉద్యోగము, పంటలను, వ్యాపారమును బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాము. కనుకనే మేము పంటను చూడనప్పుడు కూడా, నీవు మా పక్షమున కార్యములు జరిగించుచున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, నీవు మాకు ఇచ్చినది మంచిదని మరియు మా ఆశీర్వాదం కొరకు అని మేము సంపూర్తిగా నమ్ముచున్నాము. ప్రభువా, దయచేసి మా హృదయాన్ని నీ సమాధానము మరియు ఆనందంతో నింపుము మరియు అవి నిత్యము మా ఇంట్లో పొంగిపొర్లునట్లుగా చేయుము. దేవా, మేము ఎదుర్కొంటున్న ఓటమిలన్నిటిని తొలగించి, మా జీవితములో విజయ ద్వారాలను తెరిచి, మా చేతుల పనిని ఆశీర్వదించుము. ప్రభువా, మా శ్రమకు, తగిన సమయంలో దాని ప్రతిఫలమును మరియు పంటను ఇస్తుందని మేము విశ్వసించుచున్నాము. దేవా, మా కొరతలను తీర్చి మమ్మును సమృద్ధిగా ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.