నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము ద్వారా మిమ్మును కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 37:18వ వచనమును మనము నేడు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును'' ప్రకారం దేవుడు మీ చర్యలను గుర్తిస్తాడు. అవును, ప్రియులారా, "నిర్దోషత్వము అనగా ఏమిటి? యథార్థముగా జీవించడమే. ఎవ్వరు మనలను చూస్తున్నను, చూడకపోయినను, అది రహ్యముగా మనము చేసే పనియైనను సరే, మన జీవితమును మనము యథార్థముగాను మరియు నమ్మకముగా జీవించినప్పుడు, దానినే నిర్దోషంగా జీవించడము అని అనవచ్చును. స్నేహితులారా, ఈ రోజులలో అలాగున ఎవరు ఉన్నారు? అని మీరు అనవచ్చును. ఒకరోజు ఒక విధంగా, ఇంకొక రోజు మరొక విధంగా జీవించుచున్నారు. అనేకులు స్వార్థపూరితంగా ఉంటున్నారు. ఎవరు చూడనప్పుడు మరియు విననప్పుడు మోసాలు చేస్తుంటారు. ఈ లోకము ఆ విధంగానే ఉన్నది. కానీ, నిర్దోషంగా మనము జీవించినప్పుడు, ప్రభువు మనలను ఘనపరుస్తాడు. మన అవసరతలన్నిటిని తీరుస్తాడు. మన కుటుంబము మన స్వాస్థ్యము దీవించబడుతుంది.
బెంగుళూరు పట్టణములో చూచిన నిజ జీవితములో జరిగిన ఒక సంఘటనను మనము చూడగలము. రెండు సంవత్సరముల క్రితము వార్తలలో ఈ సంఘటన వినబడినది. ఆటో నడిపించే ఒక వ్యక్తి ఉండేవాడు. ఉదయము మరియు రాత్రి పూట అతడు ఆటో నడుపుచుండేవాడు. ఒకరోజు ఆటో వెనక సీటులో అతని తల్లి ఒక సంచి నిండ డబ్బును చూశారు. ఈ ఆటో ్రడైవరుకు ఈ సంగతి కూడా తెలియదు. వారు ఆ బ్యాగ్‌ను తెరచి చూచినప్పుడు, 5 లక్షల రూపాయల డబ్బు ఆ సంచిలో ఉండెను. వారి జీవితాలలో అంత డబ్బును వారు ఎప్పుడు కూడా చూడలేదు. వారు ఆ డబ్బును తీసుకొని, వారి యొక్క బ్యాంకు ఆకౌంటులో వేసుకొని, చక్కగా అనేక సంవత్సరములు సంతోషంగా జీవించి ఉండవచ్చును. కానీ, ఈ వ్యక్తి ఏమి చేశాడో తెలుసా? అతడు ఆ డబ్బుల సంచిని, తీసుకొని అతని ఆటోలో ప్రయాణించిన వ్యక్తిని ఎక్కడ దించాడో అక్కడకు వెళ్లి, ఆ వ్యక్తికి ఆ డబ్బుల సంచిని ఇచ్చివేశారు. ఆ డబ్బులన్నియు ఆసుపత్రిలో వైద్యము నిమిత్తము ఖర్చు చేయుట కొరకై ఎంతో అవసరము. ఆ డబ్బు తీసుకున్న వ్యక్తి అన్నాడు కదా, నిజంగానే, మాకు ఎంతగానో అవసరమైనటువంటి ధనము ఇది. నీవు మాకు తిరిగి ఇవ్వడము ఎంతో సంతోషము అని చెప్పారు. పోలీసు డిపార్టమెంటు వారు ఈ విషయమును గురించి తెలుసుకొని, ఆ ఆటో ్రడైవరును ఘనపరచారు. దేశమంతట అతని పేరు ప్రచురింపబడి, అతడు యథార్థవంతుడు అని చెప్పారు. వార్తాపత్రిక ప్రతినిధులు అతని యింటికి వచ్చి, అతనిని ఇంటర్య్వూలను తీసుకున్నారు. అందరు అతని పేరును తెలుసుకున్నారు. అతనిని మాత్రమే కాదు కానీ, అతని తల్లి, తన కుటుంబ సభ్యులు, ఇంకను ఎంతగానో అందరి చేత కూడా వార్తలలో వారు ఘనపరచబడ్డారు.
అదేవిధముగా, నా ప్రియులారా, మీరు నిర్దోషముగా జీవించినప్పుడు, యధార్థముగా ఉన్నప్పుడు, ప్రభువు మిమ్మును గురించి మీ పట్ల జాగ్రత్త వహిస్తాడు. అంతమాత్రమే కాదు, మీరు ఘనపరచబడతారు. మీ స్వాస్థ్యము నిరంతరము నిలిచి ఉంటుంది. ఇంకను మీ పేరు అంతటా ప్రచురించబడుతుంది. ప్రభువు మీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. ప్రభువు మిమ్మును ఘనపరుస్తాడు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, నిర్దోషంగా జీవించండి. ప్రభువు దానిని ఎంతో విలువైనదిగా భావించుచున్నాడు. మీ నిర్దోషత్వమును బట్టి ప్రభువు మీకు ప్రతిఫలమును ఇస్తాడు. మీ అవసరతలన్నిటిని తీరుస్తాడు. మిమ్మును మరియు మీ స్వాస్థ్యమును సదాకాలము నిలుచునట్లుగా చేస్తాడు. ప్రభువు మీ పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. ప్రభువు ఈ వాగ్దానమును బట్టి, ఆయనకు వందనాలు చెల్లిస్తూ, ఈ రోజు ఒక నిర్ణయమును తీసుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నిర్దోషంగా జీవించుటకు మరియు యధార్థముగా మేము జీవించుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా ఉద్యోగములో, ఇంటిలో, పాఠశాలలో, సమాజములో, ఎవరు గమనించలేదు గనుకనే, ఇది మేము సులభముగా ఈ పనిని చేయవచ్చును అని మేము అనుకొనకుండా, నీవు మమ్మును ఎల్లప్పుడు చూస్తున్నావని మేము గుర్తెరుగునట్లుగా, నీ బలమును, నీ యొక్క నడిపింపును మాకు దయ చేసి, నిర్దోషంగా మరియు యధార్థముగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించుము. ప్రభువా, మేము చేయు ప్రతి కార్యములోను యధార్థముగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మమ్మును దీవించి, నీ యొక్క కాపుదలలో ఉంచుకొనుము. దేవా, మా స్వాస్థ్యము సదాకాలము నిలుచుట్లుగా చేయుము. దేవా, నీ యెదుట నిందారహిత జీవితాన్ని గడపడానికి మాకు సహాయం చేయుము. నిర్దోషంగా మరియు యథార్థంగా నడవడానికి మాకు శక్తినిమ్ము. ప్రభువా, మా ప్రతి మాట మరియు చర్య నిన్ను సంతోషపెట్టునట్లుగా చేయుము. దేవా, మా కుటుంబాన్ని నీ సంరక్షణలో భద్రపరచుము. ప్రభువా, మా పిల్లలకు మంచి ఉద్యోగాలు మరియు సురక్షితమైన భవిష్యత్తును అనుగ్రహించుము. ప్రభువా, ప్రజల దృష్టిలో మమ్మును ఘనపరచుము. దేవా, మా ప్రతి ఆటంకమును తొలగించి మా అవసరాలన్నింటిని తీర్చుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.