నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 119:99వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు'' ప్రకారము మనము దేవుని కార్యములను, శాసనములను, సాక్ష్యములను ధ్యానము చేయుచున్నప్పుడు, మనము అంతర్గత జ్ఞానమును పొందుకొని విజయవంతులమవుతాము. ఒక దేశమునకు సంబంధించిన రాణి దానియేలును గురించి ఈలాగున చెప్పెను, అందుకే బైబిల్ నుండి దానియేలు 5:11వ వచనమలో చూచినట్లయితే, " నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు; నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీవిద్యగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై యధిపతిగా అతని నియమించెను'' ప్రకారము అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు మరియు అంతర్గత జ్ఞానముగలవాడు అని చెప్పబడియున్నది. నా ప్రియులారా, నేడు మీకు కూడా ఆలాగుననే, దేవుడు ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. ఇది పరిశుద్ధాత్మ కృపావరముల వలన వస్తుంది. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 12:8వ వచనములో మనము చూచినట్లయితే, "ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును...అనుగ్రహింపబడుచున్నవి '' అని చెప్పబడిన ప్రకారముగానే, దీనినే జ్ఞానవాక్యము అని పిలువబడుచుచున్నాము. అవును, పరిశుద్ధాత్మ మరియు యేసు ఆత్మ మీలోనికి వచ్చియున్నప్పుడు, దేవుని జ్ఞానము మీలోనికి వస్తుంది. అప్పుడు మీరు సమస్యలను చూడగానే, ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఈ సమస్యకు పరిష్కారము ఏమైయున్నదని క్షుణ్ణంగా తెలుసుకొనగలుగుతారు.

యేసు స్వయంగా తన సేవలో ఈ జ్ఞానం మరియు వివేకాన్ని ప్రదర్శించాడు. బావి యొద్ద నుండి నీళ్లు తీసుకొని వెళ్లడానికి వచ్చిన ఒక స్త్రీని యేసు చూచియున్నప్పుడు, ఆమెను తనకు దాహమునకు నీళ్లు ఇమ్మని అడిగెను. ఇంకను, "యేసు నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే; నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను. అప్పుడా స్త్రీ అయ్యా, నీవు దేవుని ప్రవక్తవని గ్రహించుచున్నాను మరియు నేను నీకు చెప్పకుండానే, నీవు ఎవరని నాకు తెలియకుండానే, నా గురించి చెబుతున్నావు, నీవు నా జీవితములోనికి చూడగలుగుచున్నావు. నా వివాహ జీవితములో ఉన్న సమస్యలను నీవు చూడగలుగుచున్నావు, నిజముగా నీవు దేవుని ప్రవక్తవై యున్నావు అని చెప్పెను.'' యేసు ప్రభువు ఆమె కొరకు దేవుని యొద్ద నుండి జీవజల నదులను ప్రవహించు ఆశీర్వాదములను ఇచ్చియున్నాడు. అదేవిధముగా, దుష్టులైన ప్రజలు యేసు ఆవరించియున్న సందర్భములో ఏమి జరిగింది? అని బైబిల్ నుండి మత్తయి సువార్త 9:3,4వ వచనములలో చూచినట్లయితే, "ఇదిగో శ్రాస్తులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?'' అని చెప్పబడిన ప్రకారము ఆయన వారి యొక్క చెడు హృదయములను, చెడు ఉద్దేశములను ఎరిగినవాడై యుండెను. వారి ఉద్దేశములను దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానము చేత నింపబడిన జవాబులు చేత ఆయన జయించియున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించిన జ్ఞానము మరియు వివేకము ద్వారా మీరు కూడా దుష్టులైన ప్రజలందరిని అధిగమించినవారుగా ఉండవచ్చును.

అందుకే బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 1:10వ వచనములో చూచినట్లయితే, " ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము'' అని సొలొమోను ప్రార్థన చేసెను. ఆలాగుననే, దేవుడు అతనికి జ్ఞానమును, తెలివిని, వివేకమును మరియు సమస్తమును అర్థము చేసుకొను అంతర్గత దృష్టిని కలిగించు జ్ఞానమును అనుగ్రహించియున్నాడు. ఆయన అన్నిటిని అనగా, దేనినైనను అర్థము చేసుకొనగలడు. కనుకనే, ఐశ్వర్యము మరియు సంపద అతని యొద్దకు వచ్చెను. నేడు నా ప్రియులారా, మీకు కూడా ఇటువంటి జ్ఞానమును దేవుడు అనుగ్రహించాలని మీ పట్ల కోరుచుచున్నాడు. కనుకనే, మీరు, 'ప్రభువా, నన్ను నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపుమని' మొఱ్ఱపెడతారా? 'నేను జ్ఞానమును కలిగియుండి, ఆ రీతిగా వర్థిల్లతను పొందాలి, ఇతరులకు జీవితములోని సమస్యలను చూచి, వారి సమస్యలకు పరిష్కారము అందించుటలో వారికి దీవెనగా ఉండాలి. లోకపరమైన దుష్ట ప్రజలకు సంబంధించిన దుష్టత్వమును అధిగమించుటకు కావలసిన అంతర్గత దృష్టిని నేను కలిగియుండాలి' అని మీరు ఆయనను అడిగినప్పుడు, ఆయన ఇప్పుడే, తన జ్ఞాన వివేకములతో మిమ్మును నింపుతాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, అంతర్గత జ్ఞానమును పొందుకొను ఇట్టి కృపను నేడు మా మీదికి దిగివచ్చునట్లుగా సహాయము దయచేయుము. ప్రభువా, ఇప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క జ్ఞానముచేత మమ్మును నింపునట్లుగా చేయుము. దేవా, అన్నిటికిని, అందరికి సంబంధించిన విశేష జ్ఞానమును మాకు దయచేయుము. సమస్త జ్ఞానానికి మరియు అవగాహనకు మూలంగా ఉన్నందుకు నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.దేవా, పరిపాలన చేయుటకును, ఐశ్వర్యమును కలిగయుండుటకు మాకు తగిన జ్ఞానమును అనుగ్రహించుము. ప్రభువా, మేము ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడునట్లుగా మమ్మును దీవించుము. ప్రభువా, మా జీవితములో సమస్యమును పునరుద్ధరింపజేసి, స్వస్థపరచి, మమ్మును ఆనందింపజేయుము. దేవా, నీ జ్ఞానము మాలో ప్రవహించనిమ్ము. ప్రభువా, బాహ్య రూపాలకు అతీతంగా చూడటానికి మరియు నీ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మాకు దైవిక అంతర్దృష్టిని అనుగ్రహించుము. దేవా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మరియు నీ శాసనాల ప్రకారం నడవడానికి మాకు నేర్పుము. ప్రభువా, సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి మాకు వివేచన మరియు కృపను అనుగ్రహించుము. దేవా, నీ జ్ఞానం ద్వారా ప్రతిరోజూ మా మాటలు, చర్యలు మరియు నిర్ణయాలను నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లంచుచూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున పార్థించుచున్నాము తండ్రీ ఆమేన్.