నా ప్రియ స్నేహితులారా, నేడు మీకు అభినందనలు తెలియజేయుడము నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. ఈ రోజు, ప్రభువు నుండి పొందబోయే విజయ దృక్పథాన్ని మనం కలిగియుందాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా గ్రంథం 20:11వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో, "అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించు వారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు'' అని వ్రాయబడినట్లుగానే, ఆ విధంగానే ఆయన తన పిల్లలను నడిపించుచున్నాడు, ఒక పరాక్రమముగల శూరునివలె మనకు ఒకదాని వెంబడి ఒకటిగా విజయమును అనుగ్రహించుచున్నాడు. ఆయన మన కొరకు నూతన మార్గములను తెరవజేయుచున్నాడు మరియు మన జీవితములలో దేవుని చిత్తమును జరిగించుటకు ఆటంకముగా ఉన్న ప్రతి వ్యతిరేకతను వర్థిల్లకుండా నిర్మూలము చేయుచున్నాడు. అవును, నా స్నేహితులారా, ఈ రోజు కూడా, అన్ని విషయములలో ఆయనే మన యొక్క పరాక్రమముగల శూరునివలె మనం అంగీకరించుదాము. అయినప్పటికిని, కొన్నిసార్లు మనం ఆయనను ఎందుకు అనుభూతి చెందలేకపోతున్నామో? ప్రభువు మన పరాక్రమముగల శూరునివలె మన పక్షమున ఎందుకు నిలబడటం లేదని ఆశ్చర్యపోతుంటాము. ఎందుకనగా, మనము, 'నేను ఇది చేయవలెను, నేను విజయం సాధించవలెను, నేను సమస్తమును చక్కబెట్టవలెను' అని తలంచుకుంటూ, మన ఆందోళనలన్నింటిని, భయాలన్నింటిని ఆయన మీద మోపకుండా, ఆయనకు ముందుగా మనమే వాటన్నిటిని భరిస్తుంటాము. అంతమాత్రమే కాదు, మనము మోయుచున్న భారమునంతటిని, మన మీద మనమే వేసుకుంటాము. అలాగున కాదు నా ప్రియులారా, మీరు పోరాడుచున్న ప్రతి పోరాటములో ప్రభువును మీ యొక్క పరాక్రమశాలియైన శూరుని వలె మీలో ఉండనిచ్చినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీ పక్షమున పోరాడి, మీకు విజయమును అనుగ్రహిస్తాడు.
నా జీవితములో చూచినట్లయితే, నా చిన్నవయస్సులో విద్యార్థుల బృందము యెదుట నా యొక్క మొదటి సందేశమును వినిపించాను. అది మా తాతగారు సంసిద్ధము చేసిన ఒక ప్రసంగము. అయితే, ఆ సందేశమును నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు, కేవలం క్రిందికి చూస్తూ అంతా చక్కగా చదువుచున్నాను. కానీ, నేను విద్యార్థులను చూడగానే, నాకు చెమటలు పట్టడం, భయము నాలో ప్రారంభించినది. ఆ భయముతో నేను వణికిపోతూ, నా యొక్క సందేశమును అతి తక్కువ సమయములోనే, త్వరగా ముగించాను. ఒక చిన్న పిల్లవాడిని నేను అందరి మధ్య ఎలా మాట్లాడగలనో అని ఆలోచించి, నాలో నాకు ఎంతో కంగారుగా అనిపించింది. నేను పరిచర్య ప్రారంభించి, కొంతకాలం గడిచిన తర్వాతనే, 'ఓ ప్రభువా, నా అంతరంగంలో నీవు ప్రత్యక్షము కావలెను. నాలో నీవు పైకి లేచి, ప్రభువా, నాతో నీవే మాట్లాడుము. ఈ కార్యాన్ని నా నిమిత్తం నీవే నెరవేర్చుము,' అని ప్రార్థించడం నేను నేర్చుకున్నాను. ఇంకను, 'ప్రభువా, నీవు నా ద్వారా అద్భుతములను జరిగించుము' అని తెలియజేయుచూ, నేను సర్వస్వమును ప్రభువైన యేసుక్రీస్తునకు సమర్పించుకొనుటకు ప్రారంభించాను; అప్పుడు పరిశుద్ధాత్మ నా హృదయంలో నుండి పైకి లేచి, ఒక పరాక్రమముగల శూరునివలె నా పక్షమున నిలిచి, పోరాడి, నాకు విజయమును అనుగ్రహించెను.
అంతమాత్రమే కాదు, అటుపిమ్మట ఆయన జ్ఞానం, ఆయన కృప మరియు సమస్త సామర్థ్యము నాలో ప్రవహించడం ప్రారంభించెను. అప్పటి నుండి దేవుని శక్తి నాలో ప్రవహించి, గొప్ప ప్రభావమును మరియు గొప్ప విజయమును నా జీవితములో తీసుకువచ్చినది. దేవునికే మహిమ కలుగును గాక. అవును, నా ప్రియ స్నేహితులారా, అదేవిధంగా, ఈనాడు ప్రభువు మీ పక్షమున నిలిచి, మీ యొక్క ప్రతి పోరాటములోనూ మీకు విజయమును అనుగ్రహించును గాక. కనుకనే, నా ప్రియులారా, మీ భారమును మీరు ఒంటరిగా మోయకండి; మీ పక్షమున ఆయన పోరాడుటకు మీలో ఆయనకు చోటు ఇవ్వండి. మనం ఇప్పుడే ఈ వాగ్దానమును మన సొంతం చేసుకుని, ఆయన విజయ మార్గంలోనికి నడుద్దామా? ఆలాగు చేసినట్లయితే, నిశ్చయముగా, ఆయన ఒక పరాక్రమముగల శూరుని వలె మీతో కూడ ఉండి, మీలో నుండి పైకి లేచి, మీ పక్షమున పోరాడి నేటి వాగ్దానము ద్వారా మీకు విజయమును అనుగ్రహించి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరాక్రమముగల శూరుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, నీవే మా పరాక్రమముగల శూరునివిగాను, ప్రతి యుద్ధంలో బలవంతుడవు మరియు విజయశీలుడవుగా నీవు మా పక్షమున ఉండి, మమ్మును విజయవంతులనుగా చేయుము. దేవా, మమ్మును మోయమని నీవు అడగని భారములను మేము మోయుచున్నందుకై మమ్మును క్షమించి, మా భారములన్నిటిని నీ మీద వేయుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, ఈ రోజు, మాలో ఉన్న ప్రతి భయమును, ప్రతి పోరాటమును మరియు ప్రతి సవాలును నీకు అప్పగించుచున్నాము. ఓ ప్రభువా, మాలో నీవు పైకి లేచి మా పక్షమున పోరాడి మాకు విజయమును, నీ యందు గుప్తములై యున్న జ్ఞానము మరియు సర్వసంపదలను, కృప, మరియు బలమును మా జీవితంలో పొంగి ప్రవహించునట్లుగా చేయుము. దేవా, ఎవరూ మూయలేని ద్వారములను మా కొరకు తెరువుము మరియు మా యొక్క ప్రతి వ్యతిరేకతను నిర్మూలము చేయుము. ప్రభువా, నీ సన్నిధిలో ధైర్యంతోను, విశ్వాసంతోను మేము ముందుకు కొనసాగుటకు మమ్మును నీ బలముతోను, శక్తితోను నింపుము. ప్రభువా, మా యొక్క పోరాటములలో మేము సంపూర్ణ విజయంలో ముందుకు నడుచునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


