నా ప్రియమైన వారలారా, తన పిల్లలు అభివృద్ధి చెందాలనేది దేవుని యొక్క హృదయమై యున్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 3 యోహాను 1:2 వ వచనములో మనం చదువుతాము. ఆ వచనము, "ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను'' అని చెప్పబడిన ప్రకారం దేవుడు మన ఆధ్యాత్మిక అభివృద్ధి పట్ల మాత్రమే కాకుండా మన శారీరక ఆరోగ్యం మరియు మన అనుదిన జీవితము ఫలవంతమైన విషయాల పట్ల కూడా శ్రద్ధ వహిస్తాడని ఈ వచనము మనకు కనపరచుచున్నది. బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 30:9వ వచనములో, "నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును'' ప్రకారం ప్రభువు మన చేతుల పనులన్నిటిలో, మన కుటుంబాలలో మరియు మన పిల్లల ఆశీర్వాదాలలో మనము వర్ధిల్లేలా చేస్తానని వాగ్దానం చేయుచున్నాడు. ఇంకను జెఫన్యా 3:17వ వచనములో చూచినట్లయితే, " నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును'' ప్రకారం ఆయన తన ప్రజల పట్ల ఆనందిస్తాడు మరియు సంతోషముచేత ఆయన మన పట్ల హర్షించును. ఆలాగుననే, నా ప్రియులారా, దేవుడు మిమ్మును చూసినప్పుడు, ఆయన మిమ్మును, 'తన ప్రియమైన బిడ్డ' అని పిలిచి, 'నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను వర్ధిల్లజేస్తాను' అని సెలవిస్తాడు. అదియే పరలోకమందున్న మన తండ్రి యొక్క ప్రేమగల హృదయమై యున్నది.
బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 13:22వ వచనములో భక్తుడైన దావీదును చూడండి. ప్రభువు అతని గురించి ఇలా అన్నాడు, "...ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను'' ప్రకారము దేవుడు దావీదును తన హృదయానుసారుడుగా కనుగొన్నాడు, అతడు దేవుని చిత్తమంతయు నెరవేర్చాడు, గనుకనే, దేవుడు దావీదును గురించి సాక్ష్యమిచ్చెను. ఆలాగుననే, నా ప్రియులారా, దేవుడు తన హృదయాన్ని వెదకి తన మార్గాలలో నడిచేవారిని వర్ధిల్లజేస్తాడు. అదేవిధంగా, మనం కూడా దేవుని చిత్తానికి లోబడినప్పుడు, ఆయన మనలో ఆనందిస్తాడు. శ్రమలలో, దుష్టుల పన్నాగాలలోను లేదా దుష్ట మనుష్యులు మనకు విరోధంగా లేచినప్పుడు కూడా మీరు, "ప్రభువా, నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగాలి' అని మనం చెప్పినట్లయితే, ప్రభువు మన విధేయతను ఘనపరుస్తాడు. ఆలాగుననే, బైబిల్ నుండి లూకా 22:42వ వచనములో చూచినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు, సిలువ వేయబడక ముందు గెత్సేమనేలో యేసు స్వయంగా తన యొక్క విధేయతను కనుపరచాడు. చూడండి, "వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని, తండ్రీ, యీ గిన్నె నా యొద్ద నుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను'' ప్రకారము అది బాధను కలిగించినప్పటికిని, ఆయన తన తండ్రి చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డాడు. అదేవిధంగా, మనం దేవుని బలమైన చేతి క్రింద మనలను మనం తగ్గించుకున్నట్లయితే, ఆయన తగిన సమయంలో మనలను పైకి లేవనెత్తుతాడు. వర్ధిల్లత కృషి నుండి కాదు, ఆయన చిత్తానికి లోబడడము నుండి మాత్రమే వస్తుంది. కనుకనే, మీరు దేవుని చిత్తానికి లోబడండి, నిశ్చయముగా మీ జీవితములో వర్థిల్లత మిమ్మును వెంబడిస్తుంది.
కాబట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ భవిష్యత్తు గురించి మీరు భయపడకండి లేదా ఆందోళన చెందకండి. దేవుడు మీ ఆత్మను, మీ ఆరోగ్యాన్ని మరియు మీ చేతుల ప్రతి పనిని వర్ధిల్లజేస్తానని ఆయన మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 2:6-10వ వచనములు మనకు గుర్తు చేయుచున్నట్లుగానే, "ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను'' ప్రకారం యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకున్నాడు. కనుకనే, ప్రతి నామానికి పైన నామంతో ఆయన హెచ్చించబడ్డాడు. ఆలాగుననే, నా ప్రియులారా, మీరు విధేయతతో నడిచినప్పుడు, దేవుడు మిమ్మల్ని కొలతలేకుండా ఘనపరచి, ఆశీర్వదించునట్లుగా కూడా మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. ఇంకను ప్రతి మోకాలు క్రీస్తు యెదుట వంగి సాగిలపడునట్లుగాను, ఆయనలో మీరు కూడా ఆనందం, ఆశీర్వాదం మరియు వర్థిల్లతను పొందుకొని, అనుభవించునట్లుగా చేస్తాడు. అవును, ఈ రోజున దేవుని వాగ్దానం ప్రకారం మీ ఆత్మ, మీ ఆరోగ్యం మరియు మీ జీవితం వర్ధిల్లును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా వర్థిల్లతను కోరుకునే నీ హృదయానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మా ఆత్మ మరియు జీవమును పరిశుద్ధపరచి, మేము పవిత్రత మరియు సమాధానముతో వర్ధిల్లునట్లుగా చేయుము. దేవా, ప్రతిరోజూ మాకు మంచి ఆరోగ్యం మరియు బలాన్ని అనుగ్రహించుము. యేసయ్యా, మా చేతులు మరియు మా కుటుంబం యొక్క పనులను మరియు మా పిల్లలను మరియు తరములను నీ ఆశీర్వాదంలో నడుచునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. దేవా, ఎల్లప్పుడూ నీ పరిపూర్ణ చిత్తానికి మేము లోబడడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, గెత్సేమనే తోటలో నీవలె మేము విధేయత కలిగి ఉండటానికి మాకు నేర్పుము. ప్రభువా, నీ చిత్తానికి మమ్మును సమర్పించుకొనునట్లుగాను, తగ్గించుకొనునట్లుగా కృపను మాకు దయచేసి, మా జీవితాన్ని ఘనతతో నింపుము. దేవా, మా జీవితంలో నీ ఆనందం మరియు సంతోషగానముతో హర్షించునది, మేము అటువంటి అనుభూతిని పొందునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించి మాకు వర్థిల్లతను అనుగ్రహించి, మమ్మును దీవించుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.