నాకు అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 5:13వ వచనమును మన ధ్యాన నిమిత్తము తీసుకొనబడినది. ఆ వచనము, "మీరు లోకమునకు ఉప్పయి యున్నారు...'' ప్రకారం అవును, మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారని ఈ వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. కనుకనే, మీరు దేవుని ప్రేమను రుచి చూచినట్లయితే, మీరు కూడా లోకమునకు ఉప్పు వలె సారము కలిగి ఉంటారు.
అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు. ఉప్పు ఎంతో ప్రాముఖ్యమైనదని మనందరికి చాలా బాగా తెలుసు కదా! మనము తయారుచేసిన వంటకాలలో ఉప్పును సరిగ్గా వేయకపోయినట్లయితే, తినే వారందరు కూడా సరిగ్గా లేదని అంటారు. ఇది అస్సలు బాగోలేదో, ఇందులో ఏదో ఒకటి కొదువుగా ఉన్నది అని అందరు అంటారు. అందుకే ఉప్పు ఎంతో ప్రాముఖ్యమైనదని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆలాగుననే, బైబిల్ నుండి మార్కు 9:50వ వచనము మనకు ఇలాగు గుర్తు చేయుచున్నది, "ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైన యెడల దేనివలన మీరు దానికి సారము కలుగుజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను '' అన్న ఈ వచనం ప్రకారం దేవుని వాక్యానుసారంగా మన జీవితములో మనకు కావలసినంత ఉప్పును మనము కలిగి ఉండాలి. అనగా, మన చుట్టు ఉన్నవారందరి కి దీవెనకరముగా మనము ఉండాలి. ఏలాగనగా, మనము మాట్లాడే ప్రతి మాట, మనము చేయుచున్న ప్రతి పని కూడా ఉప్పువలె సారము కలిగియున్నట్లుగా ఉండాలి. అది ఆహారములో ఉప్పు కలిపినంత రుచికరంగా ఉండాలి. బైబిల్ నుండి ఆదికాండము 49:22వ వచనములో మనము యోసేపు జీవితమును చూచినట్లయితే, అతని జీవితము కూడా ఆ విధంగానే ఉప్పు వలె సారము కలిగియుండెను. అతని జీవితము ఫలించెడి ద్రాక్షవల్లివలె ఉండెను. ఉప్పు సారముతో నిండియున్నట్లుగానే, అతని జీవితము ఉండెను. అదేవిధముగా, మన జీవితములో, మీరు మరియు నేను ఉప్పు వలె సారమును మనము కూడా కలిగి ఉండాలి. మన ఆహారములో లేక మన జీవితములో ఉప్పును కలిగి ఉండాలంటే, మనము ఏమి చేయాలి? బైబిల్ నుండి యోహాను 15:7,8వ వచనములలో మనము చదివినట్లయితే, "నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి యుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, నేడు మనము ఉప్పుగా ఉండాలంటే, మనము ఆయన యందు నిలిచియుండాల ని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది.
నా ప్రియ స్నేహితులారా, మీ జీవితములను ఈ రోజు పరీక్షించుకోండి. మీరు ఫలించెడి వృక్షము వలె ఉన్నారా? మీ కార్యములలో ఉప్పు సారము కలిగినట్లుగా ఉన్నదా? ఆలాగున ఉన్నట్లయితే, ప్రభువు మిమ్మును ఎల్లప్పుడు దీవించుచు, మీరు ప్రభువు మహిమార్థమైన ప్రకాశించునట్లుగా చేస్తాడు. కనుకనే, మీరు సారవంతమైన జీవితము కావాలంటే, మీరు ఆయన సన్నిధితో నింపమని వేడుకొనండి. ఆలాగుననే, ఆయన మిమ్మును నడిపిస్తాడు, మీరే ఉప్పు సారమును పొందుకొనునట్లుగా ప్రభువు మీకు సహాయపడతాడు. నా ప్రియులారా, మన జీవితాలలో అట్టివిధంగా జీవించాలని ప్రార్థన చేద్దామా? ఇప్పుడే మీరు కూడా దేవుని అడగండి, 'ప్రభువా, సారము లేని నా జీవితమును ఉప్పు వలె సారమును కలిగి నీలో నిలిచి ఉండునట్లుగా కృపను దయచేయుము' అని మిమ్మును మీరు ఆయన హస్తాలకు అప్పగించుకున్నట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా మీరు ఉప్పు వలె సారము కలిగియుంటూ, దేవుని మహిమార్ధముగా ప్రకాశించే జీవితమును జీవించునట్లుగా మీకు కృపనిచ్చి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మమ్మును ఈ లోకమునకు ఉప్పుగా పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ యొక్క అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనాలు. దేవా, నీవు మా మధ్యలో ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మా హృదయాలను చూడుము, మా జీవితములో ఉప్పు సారమును కలిగి ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితములో తగినంత ఉప్పు సారమును కలిగి ఉండుటకు మాకు సహాయము చేయుము. దేవా, దయచేసి ఇతరులను ఆశీర్వదించే, సమాధానమును కాపాడే మరియు మంచి ఫలాలను ఇచ్చే జీవితాన్ని గడపడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ వాక్యం మాలో సమృద్ధిగా నిలిచి ఉండునట్లుగాను, తద్వారా, మేము ప్రతిరోజు నీలో నిలిచి ఉండటానికి మాకు నేర్పించుము. దేవా, మా హృదయాన్ని నీ పరిశుద్ధాత్మతో నింపుము, తద్వారా మేము నీ ప్రేమతో ఇతరులతో మాట్లాడుకును, నీ ఉద్దేశ్యంతో ప్రవర్తించునట్లుగాను మరియు నీ మహిమ కొరకు ప్రకాశించునట్లుగా మమ్మును మార్చుము. దేవా, మా జీవితం నీ మంచితనాన్ని ప్రతిబింబించునట్లుగాను మరియు మేము ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు యొక్క మధురమైన సువాసనను వెదజల్లునట్లుగా మమ్మును మార్చుమని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.