నా ప్రియమైన స్నేహితులారా, నేడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. జీవమునిచ్చు తన వాక్యము చేత మనలను పోషించుచున్నాడు. ఆయన జీవము మిమ్మును బలపరచనివ్వండి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 66:12వ వచనమును మన కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, " నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్ము రప్పించియున్నావు'' ప్రకారం దేవుడు ఎందుకు ఈలాగున జరుగనిస్తాడు? ప్రజలు మన నెత్తి మీద ఎక్కునట్లుగా ఎందుకు అనుమతిస్తాడు? నిప్పులలోను, నీళ్లలోను పడునట్లుగా ఆయన ఎందుకు అనుమతిస్తాడు? సైన్యములో వారు ఇచ్చు శిక్షణను మీరు చూచినట్లయితే, సామాన్యమైన మీలాంటి మరియు నాలాంటి వారే సైనిక శిక్షణలో ప్రవేశిస్తారు. ప్రతి ఉదయకాలము చాలా పెందలకడనే వారు నిద్రలేవాలి. తమను తాము శుద్ధీకరించుకొని, సిద్ధపడి, హాజరు కొరకు లేచి నిలువబడాలి. ముందు రోజు ఎంత కష్టము ఉన్నను సరే, తదుపరి రోజు చాలా పెందలకడనే వారు నిద్రలేవాలి. ఆ తరువాత వారు కిలోమీటర్ల వెంబడి వారు పరుగెత్తాలి. వారు చేయలేకపోయినను, తప్పనిసరిగా వారు చేయవలసి ఉంటుంది. ఆ విధంగా బురదలో ప్రాకుతూ వెళ్లునట్లుగా వారికి నేర్పిస్తారు. ఎక్కువ దూరం పరుగెత్తాలి, బురదలో పాకడం మరియు గోడలు ఎగిరి దూకవలసి ఉంటుంది. వారు ఎదుర్కొనే ఆటంకాలన్నిటిని వారు దాటి ముందుకు వెళ్లవలసి ఉంటుంది. కొంతమంది ఈ బాధలన్ని ఎందుకని మధ్యలోనే వెళ్లిపోతారు. కానీ,చివరి వరకు నిలిచియున్నవారు మాత్రమే సైన్యిక సేవా శిక్షలో నిలిచియుండుటకు అర్హులుగా ఎంపికచేయబడతారు. అయితే, కొంతమంది ఎంతకష్టమైన వారు మధ్యలో విడిచి పెట్టి వెళ్లపోకూడదని నిర్థారించుకుంటారు. వారు బలమైనవారుగా ఉండాలని కోరుకుంటారు. ప్రభువు కూడా అటువంటి వారి కొరకై ఆయన ఎదురు చూచుచున్నాడు. ఎందుకనగా, మన జీవితం పట్ల ఆయన పిలుపు చాలా గొప్పది. మనము సిద్ధముగా ఉన్నామా? లేదా? అని చూస్తుంటాడు. అడ్డకంకులను అధిగమించడం ద్వారా శిక్షణ ఇచ్చినట్లుగానే, దేవుడు మన జీవితములో సవాళ్లను ఎదుర్కొని స్థిరంగా నిలిచియుండాలని మనలను బలపరచడానికి అనుమతిస్తాడు. ఈ శ్రమలు మనలను శిక్షించడానికి కాదు, ఆయన పిలుపునకు మనలను సంసిద్ధపరచడానికి మరియు క్లిష్టమైన పరిస్థితులలో కూడా మనం పట్టుదలతో మరియు చివరి వరకు నమ్మకంగా ఉంటామో లేదో చూడటానికి, ఆయన మనకు శ్రమలను అనుమతిస్తాడు.

నా ప్రియులారా, జీవితములో పరీక్షలు, అవి మన వ్యక్తిగత నడకలో, వ్యాపారంలో లేదా సంబంధాలలో అయినా, దేవునికి ఓర్పు, నమ్మకం మరియు విధేయతను ప్రదర్శించే అవకాశాలు. కష్టాలు ఎదురైనప్పుడు చాలామంది తమ పనిని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్లిపోతారు, కానీ విమర్శలు, పోరాటాలు మరియు అసాధ్యమైనవిగా అనిపించే పరిస్థితులలో పట్టుదలతో ఉన్నవారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆలాగుననే, మనం ఆయనను అగ్నిలోను మరియు నీటిలోను విశ్వసించడం కొనసాగించినప్పుడు, విశ్వాసం మరియు సమర్పణను చూపినప్పుడు, ఆయన మన పిలుపుకు తగినట్లుగా నడిపింపును అనుగ్రహిస్తాడు మరియు ఆయన వాగ్దానం చేసిన సమృద్ధిగల చోటికి మనలను తీసుకు వెళ్తాడు. కఠినమైన శిక్షణ ద్వారా సైనికులు సేవకు సిద్ధంగా ఉన్నట్లుగానే, జీవిత సవాళ్ల ద్వారా మనలో ఉన్న పట్టుదల దేవుడు మన యెదుట ఉంచబడిన ఆశీర్వాదాలు మరియు బాధ్యతల కొరకు మన యొక్క సంసిద్ధతను ఋజువుపరుస్తుంది.

నా ప్రియులారా, ఈరోజు మీ మార్గం కష్టతరంగాను మరియు నిశ్చయత లేకుండా ఉన్నప్పటికిని, దేవుని యందు పరిపూర్ణంగా నమ్మకమును కలిగి ఉండాలని నిర్ణయించుకొన్నట్లయితే, మనకు వ్యతిరేకంగా ఎన్ని సవాళ్లు లేదా శోధనలు అడ్డు వచ్చినా, మనం ప్రభువు కొరకు పట్టుదలతో మరియు నమ్మకముతో ముందుకు పరిగెత్తెదము. అవును ప్రియ స్నేహితులారా, నేడు మీరు కూడా విశ్వాసంతో ఆయనను హత్తుకున్నప్పుడు, ఆయన మీ శోధనలలో కూడా మిమ్మును బలపరుస్తాడు, మిమ్మును ఆదుకుంటాడు మరియు సమృద్ధి గల చోటికి మిమ్మును తీసుకొని వెళ్తాడు. దేవుడు తన ప్రజలు బలంగా, దృఢంగా, నమ్మకంగా ఉండాలని, వారి జీవితాలపై ఆయన ఉంచిన పిలుపును నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి, ఆలాగున చేయుటకు మిమ్మును మీరు ఒక సైన్యకులవలె సిద్ధపరచుకున్నట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, ఎన్నడు నిన్ను విడిచిపెట్టని హృదయాన్ని మాకు దయచేయుము. దేవా, ప్రతి శోధనలలోను నిన్ను సంపూర్ణంగా విశ్వసించునట్లుగా మమ్మును బలపరచుము. ప్రభువా, విశ్వాసం మరియు పట్టుదలతో మేము నీ యందు దృఢంగా నిలిచి ఉండునట్లుగా చేయుము. ప్రభువా, శ్రమలు మరియు శోధనలు మరియు సవాళ్లను సహించడానికి మరియు వాటిని అధిగమించడానికి మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. దేవా, మేము ఎదుర్కొనే పరీక్షలు, శోధనలు మమ్మును శిక్షించడానికి కాకుండా, నీ పిలుపుకు మమ్మును సంసిద్ధం చేయుము. దేవా, మా జీవితాలలో మేము ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులలో కూడా మేము పట్టుదలతో, చివరి వరకు నీలో నమ్మకంగా నిలిచి ఉండగలిగే కృపను మాకు దయచేసి, మమ్మును బలపరచుము. ప్రభువా, మమ్మును నీ పిలుపును నెరవేర్చగల సమృద్ధిగల చోటికి మమ్మును తీసుకొని వెళ్లుటకు నీ మార్గములో మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.