నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 8:17వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుని జాగ్రత్తగా వెదకువారు ఆయనను కనుగొంటారు అని లేఖనము తెలియజేయుచున్నది. ఆలాగుననే మరొక తర్జుమాలో, "నన్ను ఉదయముననే వెదకువారు నన్ను కనుగొందురు'' అని తెలియజేయబడుచున్నది. మనము రోజంతటిలో మొదటి భాగములో ఆయనను మొట్టమొదట వెదకినట్లయితే, మనము ఆయనను కనుగొనగలము. కనుకనే, మీ రోజులో ఉన్నటువంటి నిశ్శబ్ద నిర్మలమైన సమయములోనే ప్రభువు కొరకు ఎన్నుకొనండి. అది తెల్లవారకముందే, ఇంకను చీకటిగా ఉన్నప్పుడు కావచ్చును, ఆ సమయములో ప్రభువును జాగ్రత్తగా వెదకండి. అప్పుడు నిశ్చయముగా, ఆయనను కనుగొందురు. ఆయనను దొరుకు కాలములోనే ఆయనను వెదకండి. నా భర్తగారు చాలాసార్లు ఈ మాటను చెబుతుంటారు. ఉదయము 3 గంటలకు లేవవలసినటువంటి సమయము. ప్రభువు తానే ఆ సమయమున నన్ను లేపుతుంటాడు. ఆ సమయములో ప్రభువు మనతో మాట్లాడడానికి ఎంతగానో ఇష్టపడుతుంటాడు అని చెప్పేవారు. ఆ సమయములోనే నా భర్తగారితో ప్రభువు ప్రవచన వాక్కు ద్వారా మాట్లాడుతుంటారు. ప్రభువు సెలవిచ్చినట్లయితే, అది నిశ్చయముగా నెరవేరుతుందని చెప్పబడియున్నది. ఉదయమున ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానములు ఆ రోజు అంతమైపోక ముందే, ఏలాగైన సరే, నెరవేరుతుంది. ఎంత మంచి దేవునిని మనము కలిగియున్నాము కదా! అందుకే బైబిల్ నుండి యిర్మీయా 29:13వ వచనములో చూచినట్లయితే, " మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మనము ఆయనను జాగ్రత్తగా వెదకినట్లయితే, నిశ్చయముగా ఆయనను కనుగొంటాము.
నా ప్రియులారా, అందుకే బైబిల్‌లో, "ఆత్మతోను, సత్యముతోను ఆయనను మనము ఆరాధించాలి'' అని సెలవిచ్చుచున్నది. కనుకనే, పూర్ణ హృదయముతో మనము ప్రభువును ప్రేమించాలి. అందుకే యోహాను 14:21వ వచనములో చూచినట్లయితే, ప్రభువు, ' నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను'' ప్రకారము దేవుని ఆజ్ఞలను మనము అంగీకరించినప్పుడు, మనము ఆయనను ప్రేమించినవారముగా ఉంటాము. అవును, నా ప్రియ స్నేహితులారా, మనము ఆయనను పూర్ణ హృదయముతో ప్రేమించినప్పుడు, ఆయన తన్ను తాను మనకు నిశ్చయముగా కనుపరచుకొంటాడు. మనము దేవునిని చూడగలుగుతాము. రోజులోని, 24 గంటల సేపు మనము ప్రభువు సన్నిధానమును అనుభూతి చెందుతాము. మేము కుటుంబముగా ప్రభువును వేకువనే వెదకుతాము. మా తండ్రిగారైన సహోదరులు డి.జి.యస్ దినకరన్‌గారు ఈ లోకములో జీవించినప్పుడు, ఆయన వేకువనే లేచి, కుటుంబ సభ్యులందరిని 6 గంటలకంతయు ఒక దగ్గర చేర్చుతారు. నేను, నా భర్త, నా పిల్లలు అప్పుడప్పుడు ఆలస్యము చేస్తున్నట్లయితే, ఆయన ఉదయముననే లేచి, ఈ విధంగా పాడడము ప్రారంభించేవారు, ' ఉదయముననే, ప్రభువును వెదకండి,' ఆ పాట మేము వినగానే, వెంటనే, మేము పరుగెత్తుకుంటూ, హాల్(వరండాకు) వెళ్లి మా తల్లిదండ్రులతో పాటు కూర్చుని, కుటుంబముగా ప్రార్థించేవారము. అదెంతో అద్భుతమైనటువంటి ప్రార్థన సమయముగా ఉండేది. మేము ఏమైయున్నామో అది కేవలము అది మా ప్రార్థన వలననే అయియున్నాము. హల్లెలూయా!
కనుకనే, నా ప్రియ స్నేహితులారా, మనము ఉదయముననే, ప్రభువును వెదకినట్లయితే, నిశ్చయముగా మన కుటుంబము దీవించబడుతుంది. మీరు ప్రభువుచేత ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు అని మీ చుట్టు ఉన్న వారందరు కూడా మనలను చూచి చెబుతారు. మనము ఆయనను జాగ్రత్తగా వెదకిన యెడల మనము ఆయనను కనుగొనగలము. ప్రభువును వెదకి కనుగొనగలగడమే మనము కుటుంబముగా పొందుకొనగలిగిన గొప్ప దీవెనగా ఉంటుంది. కుటుంబముగా ప్రభువును ప్రేమించండి. కుటుంబముగా ఆయనను సేవించండి, ఎల్లప్పుడు కుటుంబముగా కలిసి దేవునిలో గడపండి మరియు అందరు ఐక్యముగా ఉండండి. అప్పుడు ప్రభువు మనలను కూడా ప్రేమిస్తాడు. తన్నుతాను ఆయన మనకు కనుపరచుకుంటాడు. అందుకే ఇప్పుడు మేము కుటుంబముగా ప్రభువు యెదుట సాక్షులముగా నిలబడగలము. నా ప్రియ స్నేహితులారా, అదే దేవుడు నేడు మీతో కూడా తోడై ఉండును గాక. వేకువ జామున లేవగలిగే కృపను ప్రభువు నేడు మీకు ఇచ్చును గాక. నమ్మకముగా మీరు ప్రభువును వెదకగలిగే కృపను దేవుడు మీకిచ్చును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, దయచేసి మేము ఉదయాన్నే లేచి నీ పరిశుద్ధ సన్నిధిలో మా దినమును ప్రారంభించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను నిన్ను ప్రేమించుటకు మాకు నేర్పించుము. దేవా, మా ఆలోచనలు మరియు క్రియలు నీ నామానికి మహిమ తీసుకువచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి ప్రతి ఉదయం మమ్మును నీ సన్నిధిలోనికి నడిపించుము. దేవా, దయచేసి మా హృదయాన్ని నీ సమాధానము మరియు శక్తితో నింపుము. యేసయ్యా, గడిచే ప్రతి రోజు మమ్మును నీ దగ్గరకు చేర్చుము. ప్రభువా, మేము కలిసి నిన్ను వెదకడానికి మరియు నీకు సేవ చేయడానికి నీకు లోబడి ఉండునట్లుగాను తద్వారా, మా కుటుంబము ఆశీర్వదింపబడునట్లుగా సహాయము చేయుము. దేవా, నీ సన్నిధి రోజంతా మాతో ఉండునట్లుగాను, నీ యందు మేము విశ్వాసముంచునట్లుగాను, నీవు సిద్ధపరచిన ఆశీర్వాదములన్నియు మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, నీ పరలోకపు వాకిళ్లను తెరచి, నీ ఆశీర్వాదములను మా మీదను కుమ్మరించుము, ప్రభువు చేత ఆశీర్వదింపబడిన ప్రజలని మా చుట్టు ఉన్న వారందరు మమ్మును చూచి చెప్పునట్లుగా చేయుము. ప్రభువా, ఉదయమునే లేవలేకపోవుచున్న మమ్మును, దయతో, వేకువ జామున లేచి, నీ పాద సన్నిధిలో కూర్చుండే కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మా శరీరములో ఉన్న ప్రతి బలహీనతలను ఇప్పుడే తొలగించి, ఉదయమమునే, మమ్మును లేపి, నీ సన్నిధిలో గడిపే కృపను మాకు దయచేయుము. యేసయ్యా, ఉదయముననే, మమ్మును లేపి, నిన్ను జాగ్రత్త వెదకుటకును, నీలో ఆనందించి, ఉల్లసించునట్లుగాను, ఇప్పుడే ప్రార్థన ఆత్మతో మమ్మును నింపుము. పరిశుద్ధాత్మ దేవా, ప్రార్థించలేని మా హృదయాలలోనికి నీ యొక్క విజ్ఞాపన ఆత్మ మా మీద దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, మేము ఇతరుల కొరకు ప్రార్థించే శక్తిని మాకు ఇమ్ము, మమ్మును నీ కొరకు బలముగా వాడబడే కృపను మాకు దయచేయుము. దేవా, నీ యొక్క స్వాస్థ్యమును మేము అనుభవించునట్లుగాను, ఉన్నత శిఖరములపై మమ్మును ఎక్కించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


