నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 89:21వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మీ కొరతలో దేవుని హస్తం మిమ్మల్ని ఆదుకుంటుంది, భయం లేకుండా ముందుకు సాగడానికి ఆయన బాహువు మిమ్మల్ని బలపరుస్తుంది'' ప్రకారం ఇది మీ కొరకైన దేవుని వాగ్దానము. దేవుని హస్తము మిమ్మును ఆదుకుంటుంది మరియు దేవుని బాహువు మిమ్మును బలపరుస్తుంది. ఒకవేళ ఈరోజు, మీరు, 'నేను బలహీనుడను/బలహీనురాలను నా ప్రతిభను ప్రదర్శించలేకపోతున్నాను అని అంటున్నారా? ఈ రోజు నేను ఏమి చేయలేకపోతున్నాను అని అంటున్నారా? నేను ముందుకు సాగి వెళ్లడానికి నాకు చాలినంతగా వనరులు లేరు, జ్ఞానం మరియు నడిపింపు లేదు, మనుష్యుల అనుగ్రహము లేదు అని అనుకుంటున్నారా?' అయితే, ఈ రోజు దేవుని హస్తము మీ మీదికి దిగివస్తుంది. ప్రభువు యొక్క బాహువు ఏలీయా మీదికి వచ్చినప్పుడు, అతడు తన శత్రువులకంటే ముందుగా పరుగెత్తాడు. స్వయంగా రాజైనవాడు ప్రజలను అవినీతిమార్గంలోనికి నడిపిస్తున్నప్పుడు, ఏలీయా రాజుకంటే ముందుగా పరుగెత్తుకొని వెళ్లి, ప్రజలను దైవాశీర్వాదాలకు నడిపించాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, దేవునికి విరోధంగా ఉన్న ప్రజలకంటే మీరు ముందుగా వెళ్లి, అట్టి వారి మీదికి దైవాశీర్వాదాలను తీసుకొని వచ్చెదరు. ఎందుకంటే, ప్రభువు బాహువు మిమ్మును ఆదుకుంటుంది, ఆయన హస్తము మిమ్మును బలపరుస్తుంది.
ఇంకను నా ప్రియులారా, యెహోవా హస్తం బారూకు మీదికి, యిర్మీయా మీదికి దిగి వచ్చినది, అది వారిని శత్రువులందరి నుండి రక్షించియున్నది. అయితే, వారు ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండియున్నప్పటికిని, అవినీతికరమైన మరియు దుష్టులైన ప్రజలు వారిని చంపాలని ప్రయత్నించారు. కానీ, ప్రభువు హస్తం వారిని కాపాడి భద్రపరచియున్నది. నా ప్రియులారా, అదే ప్రభువు హస్తం మిమ్మల్ని ఆదరించడానికి మరియు మీ జీవితానికి కావలసిన సదుపాయాలన్నిటిని మీకు ఇవ్వడానికి మీ మీదికి దిగి వస్తుంది. ఇంకను మీరు ముందుకు సాగిపోవడానికి మరియు బలపరచడానికి ప్రభువు బాహువు మీపైకి దిగివస్త్తుంది. మీరు సైన్యముల మధ్యలో గుండా వెళ్లుదురు. మీరు ప్రాకారముల పైకి ఎక్కుదురు. మరియు దేవుని హస్తం మిమ్మును విశాలమైన మార్గమునకు మిమ్మును లేవనెత్తి నడిపించును. తద్వారా, మీరు ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించెదరు. ఇది మీ కొరకైన దేవుడు ఇచ్చిన వాగ్దానం.
ఆమోసు అనే వ్యక్తి ఈ విధముగా తన సాక్ష్యమును పంచుకున్నాడు. అతను ఒక మైక్రోఫైనాన్స్ కంపెనీ (స్వల్ప ఋణాల సంస్థ)లో పనిచేసేవాడు. అతను తన భార్య మరియు పిల్లలతో కూడా జీవితంలో ఎంతో సంతృప్తి చెందాడు. అయితే ఆకస్మాత్తుగా ఆ కంపెనీ మూతవేయబడినది. అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. తరువాత అతను ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగములో చేరాడు. కానీ, తన కొత్త పదవిలో లక్ష్యాలను చేరడంలో విఫలమయ్యాడు. తద్వారా అతడు ఉద్యోగములో నుండి తొలగించవేయబడ్డాడు. అయినప్పటికిని నిర్మాణ రంగములో వ్యాపారమును ప్రారంభించాడు. చాలా నష్టాలతో బాధపడ్డాడు. 8 నెలల పాటు అతనికి ఉద్యోగము లేదు. ఇంటి అద్దె చెల్లించడానికి కూడా ఎంతగానో బాధపడ్డాడు. బిడ్డలను చదివించడానికి తగినంత లేకపోయెను. కనుకనే, డబ్బును అప్పుగా తీసుకున్నాడు. అప్పులు తిరిగి చెల్లించలేకపోయాడు. చాలా పెద్ద నష్టాలతో బాధపడుతూ, అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. మద్యం సేవించడానికి మరలుకున్నాడు. పరిస్థితులు మరింత దిగజారాయి. అతనిలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయి. అతడు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నాలు చేయుచుండెను. అటువంటి సమయంలో, కడపలో యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా మహోత్సవములు నిర్వహించబడుచుండెను. అతను ఈ సభలకు వచ్చినప్పుడు, నేను పరిశుద్ధాత్మచేత నడిపించబడి, అతనిని పేరును పెట్టి పిలిచాను. నేను, "ఆమోసు, నీవు నీ జీవితంలో కలత చెందియున్నావు. అయితే, యేసు నిన్ను పేరు పెట్టి పిలుచుచున్నాడు. నీ ప్రతి వేదన కనుమరుగైపోతుంది. నీ జీవితానికి కావలసిన సదుపాయాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. దేవుడు నిన్ను మర్చిపోలేదు'' అని చెప్పాను. ఆ మాటలు విన్న అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతమంది జనసమూహంలో మరొక ఆమోసు ఉండవచ్చని అతను అనుకున్నాడు. కానీ, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అతను నూతన వ్యాపారాన్ని ప్రారంభించు సామర్థ్యమును దేవుడు అతనికి దయచేశాడు. వ్యాపారం అభివృద్ధి చెందింది. అతను అప్పుల బాధ నుండి బయటపడ్డాడు. ఆ తరువాత తన కుటుంబాన్ని యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో కుటుంబ ఆశీర్వాద పధకములో భాగస్థులనుగా నమోదు చేసుకున్నాడు. నేడు, అతడు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో ఒక భాగస్థులుగా ఉన్నారు. మరియు ఇశ్రాయేలు ప్రార్థన గోపురము యొక్క స్థాపనకు ఆర్థికంగా వారు తమ సహకారమును అందించారు. నా ప్రియులారా, ఆలాగుననే, నేడు దేవుడు మీ కొరకు దానిని జరిగిస్తాడు. దేవుని హస్తము మిమ్మును ఆదుకొనును. మీరు మరల లేవనెత్తడానికి ఆయన బాహువు మిమ్మును బలపరచును. మీరు దుష్టులకంటె మీరు ముందుగా పరుగెత్తి వెళ్లెదరు మరియు మీరు దేవుని రాజ్యమును స్థాపించెదరు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును బలపరచి, స్థిరపరచి, దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, నీ చేయి మమ్మును ఆదుకుంటుందని మరియు నీ బాహువు మమ్మును బలపరుస్తుందని నీ ప్రేమపూర్వక వాగ్దానానికై నీకు వందనాలు. ప్రభువా, మా బలహీనతలు, మా కొరత మరియు నీ నడిపింపు మరియు సదుపాయము కొరకు మా అవసరం నీకు తెలుసు. దేవా, ఏలీయా, బారూకు మరియు యిర్మీయాతో నీవు చేసినట్లుగా, మేము నీ సన్నిధిలో మొఱ్ఱపెట్టుచున్నాము, దయచేసి మా మీదికి దిగిరమ్ము. యేసయ్యా, మా యొక్క ప్రతి భయం, ప్రతి వ్యతిరేకత మరియు ప్రతి సరిహద్ధులను జయించడానికి మమ్మును బలపరచుము. దేవా, నీ బలమైన చేయి మమ్మును సమస్త కీడు నుండి రక్షించి, నీవు సిద్ధపరచిన విస్తారమైన ఆశీర్వాద చోటుకు మమ్మును హెచ్చించుము. ప్రభువా, నిన్ను వ్యతిరేకించే వారి యెదుట కూడా మా పరుగును ఉద్దేశ్యంతో పరిగెత్తునట్లుగా మరియు చీకటిలోకి నీ వెలుగును తీసుకొని వచ్చునట్లుగా చేయుము. దేవా, మాకు బలంగాను, మాకు కేడెముగాను మరియు మా పోషకునిగా ఉండి, మమ్మును అనునిత్యమము నడిపిస్తావని మేము నీ యందు మా నమ్మకమును ఉంచియున్నాము. ప్రభువా, మా బలహీనతలో నీ బలమును మాకు అనుగ్రహించి, నీ హస్తము ద్వారా మమ్మును ఆదుకొనుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.