నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు తెలిజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 కొరింథీయులకు 5:14వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది...'' ప్రకారము ఇది ఎంతటి గొప్ప వాగ్దానము కదా! అవును నా ప్రియ స్నేహితులారా, మీ స్వంత జీవితములో క్రీస్తు ప్రేమను మీరు అనుభవించియున్నారా? బైబిల్ నుండి 1 యోహాను 3:1 వచనమును చూచినట్లయితే, "మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు'' ప్రకారం మన పరలోకపు తండ్రి మనకు యెట్టి ప్రేమను అనుగ్రహించియున్నాడని మనము ఈ వచనములో చూడగలము. యేసు క్రీస్తు మనందరికి తన ప్రేమను కనుపరచడానికై సిలువలో ఆయన బాధించబడియున్నాడు. బైబిల్ నుండి హోషేయ 11:4వ వచనములో చూచినట్లయితే, "ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి అకర్షించితిని'' ప్రకారం దేవుడు స్నేహబంధములతో ఆయన మనలను బంధించి, తన యొద్దకు ఆకర్షించుకొనియున్నాడని ప్రభువు అంటున్నాడు. కనుకనే, నేడు మీరు అటువంటి దేవుని ప్రేమను అనుభూతి చెందియున్నారా? ఇంకను కొలొస్సయులకు 3:14లో చెప్పబడినట్లుగానే, "...వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి'' ప్రకారం మనము ఆయన ప్రేమను ధరించుకొనువారమై యుండాలి. కనుకనే, నేడు మీరు దేవుని ప్రేమచేత నింపబడినప్పుడు, ఆయన ప్రేమ పరిపూర్ణతను కలిగి ఉంటారు.

నా జీవితములో చూచినట్లయితే, మునుపు ఇటువంటి దైవీకమైన ప్రేమను గురించి నాకు తెలియదు. నేను 16 సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు మా కన్న తండ్రి ప్రేమను నేను కోల్పోయాను. నేను వసతి పాఠశాలలో ఉన్నప్పుడు, ఆయన ప్రతినెల నన్ను సందర్శించేవారు. ప్రతినెల నా యొద్దకు వచ్చి నన్ను చూచేవారు. ఒక నెల మా నాన్న నా యొద్దకు రాలేదు. మా నాన్నగారు రాలేదని మా తండ్రి ప్రేమను నేను గుర్తు చేసుకుంటూ, ఏడుస్తూ ఉండిపోయాను. ఆ రోజున ప్రభువు వచ్చి, నా ప్రక్కన కూర్చుని, అద్భుతమైన రీతిలో నన్ను తన దైవీకమైన ప్రేమతో నింపియున్నాడు. ఆ రోజు నుండి తండ్రియైన దేవుని ప్రేమ మరియు కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ, ఇంకను పరిశుద్ధాత్ముని యొక్క ప్రేమ మనలను ఎలా బలపరుస్తుందో నేను గుర్తించాను. ఆనాటి నుండి నేను దేవుని బిడ్డగా మారిపోయాను. అవును, నా ఆత్మలో నేను దేవుని ప్రేమను ధరించుకోవడం ప్రారంభించాను. అందును బట్టి నా జీవితము ఎంతగానో మారిపోయింది. ఇంకను కొలొస్సయులకు 3:13లో చెప్పబడినట్లుగానే, " ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి'' అని సెలవిచ్చిన ప్రకారముగానే, నేడు మీరు ఇతరులను క్షమించగలిగినట్లయితే, మీరు కూడా క్రీస్తువలె పరిపూర్ణంగా రూపాంతరపరచబడతారు.

నా ప్రియ స్నేహితులారా, ఇటువంటి దైవీకమైన ప్రేమను మీ జీవితములో మీరు అనుభూతి చెందియున్నారా? ఆలాగైతే, బైబిల్‌లో యూదా 1:20వ వచనములో చూచినట్లయితే, "నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి'' అని చెప్పబడిన ప్రకారము ఈ ప్రేమను మీరు పొందుకొనియున్నారా? యేసుక్రీస్తు యొక్క దైవీక ప్రేమను పొందుకొనియున్నారా? ఆ సిలువలో ఆయన పొందిన శ్రమల వలన మనకు ఆయన తన ప్రేమను ఇచ్చియున్నాడు. ఇంకను రోమీయులకు 5:5వ వచనములో చూచినట్లయితే, " ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి యున్నది'' అన్న వచనము ప్రకారం మనము పరిశుద్ధాత్ముని యొద్ద నుండి ఆ ప్రేమను పొందుకొని యున్నాము. ఇప్పుడు కూడా ప్రార్థించి ఆ అనుభవమును పొందుకొనబోవుచున్నాము. నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నీ అచంచలమైన ప్రేమకు ధన్యవాదాలు. యేసయ్యా, నీవు మా కొరకు సిలువపై మరణించడానికి నీవు వచ్చినందుకై నీకు వందనాలు. దేవా, నీ ప్రేమ యొక్క ద్వారా మమ్మును నీ బిడ్డ అని పిలిచినందుకై నీకు స్తుతులు. ప్రభువా, మా హృదయాన్ని పరిశుద్ధాత్మతో మరియు నీ దైవిక ప్రేమతో నింపుము. దేవా, క్రీస్తు మమ్మును క్షమించినట్లుగా మేము ఇతరులను క్షమించడానికి సహాయం చేయుము. తండ్రీ, నీ ప్రేమను చవిచూడని మా జీవితములను నీవు ఇప్పుడే తాకి, నీ యొక్క ప్రేమను పొందుకొనునట్లుగా సహాయముచేయుము. దేవా, నీ ప్రేమచేత రక్షణను పొందుకున్న మాకు నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేమతో మా జీవితాలు పొంగిపొర్లునట్లుగా చేసి, మమ్మును దీవించుము. ప్రభువా, నీ ప్రేమ ద్వారా మమ్మును నీ పోలికలోనికి మార్చుము. దేవా, మా యొక్క ప్రతి బలహీనతలోనూ నీ ప్రేమచేత మమ్మును బలపరచును. ప్రభువా, మమ్మును ఇతరుల పట్ల కనికరమును మరియు దయగల పాత్రగా చేయుము. దేవా, నిత్యజీవము వరకు మమ్మును ఎల్లప్పుడూ నీ ప్రేమలో దాచి ఉంచుమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.