నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎజ్రా 7:6 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును'' అన్న వచనము ప్రకారము నేడు మీరు ఏ మనవి చేసినను దేవుడు మీకు జవాబిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. అవును, ఎజ్రా ఒక శాస్త్రిగా ఉంటూ, దేవుని వాక్యమును మరియు ధర్మశాస్త్రమును ఆ దేశ ప్రజలందరికి బోధిస్తూ, నేర్పిస్తూ ఉండేవాడు. అయితే, అతడు దేవుని వాక్యమును ప్రకటించుచుండగా, దేవుని యొక్క హస్తము అతనికి తోడుగా ఉండి, అతనిని నడిపించెను.
నా ప్రియులారా, దేవుని హస్తము మనకు తోడుగా ఉండడము అనగా ఏమిటి? అనగా, దేవుడు తానే మన మధ్యన ఉండడము. అవును, ఇశ్రాయేలీయులు అరణ్యములో సంచరించినప్పుడు, ప్రభువు తానే వారి మధ్యన ఉండియున్నాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను వెంబడించి, వారిని తరుముతూ ఉన్నప్పుడు మరియు వారిని హింసించినప్పుడు కూడా ప్రభువు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉండి, వారిని రక్షించియున్నాడు. ప్రభువు ఐగుప్తీయుల మీదికి తొమ్మిది తెగుళ్లును పంపించినప్పుడు, ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుడు నివసించియున్నాడు. కనుకనే, వారికి సంభవించిన తెగుళ్లన్నిటిలో నుండి దేవుడు వారిని తప్పించియున్నాడు. అయితే, ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రగాళ్లు కూడా అటువంటి అద్భుతములను చేయవలెనని ఎంతగానో ప్రయత్నించారు. కానీ, ఒకానొక సమయము తర్వాత, వారు కూడా అవేవియు చేయలేకపోయారు. అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 8:19వ వచనములో చూచినట్లయితే, వారు ఈలాగున చెప్పియున్నారు, "శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను'' ప్రకారము దేవుని బిడ్డలకు శత్రువులైన ఐగుప్తీయులు ఇది దేవుని యొక్క హస్తమై యున్నదని వారు తెలియజేసియున్నారు.
అవును, నా ప్రియులారా, శత్రువులు కూడా ఇశ్రాయేలీయులతో దేవుడు ఉన్నాడు అని గుర్తెరిగియున్నారు. అందుకే బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 5:15వ వచనములో చూచినట్లయితే, " నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహు బలముచేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందుచేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను'' అని సెలవిచ్చుచున్నది. అవును, దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉండియున్నది. అదేవిధముగా, నా ప్రియులారా, దేవుని యొక్క గొప్ప సన్నిధి మీకు కూడా తోడుగా ఉంటుంది. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 11:20-21వ వచనములలో మనము చూచినట్లయితే, "కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి; ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి'' అని చెప్పబడినట్లుగానే, అవును, వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించుచుండగా, వారికి దేవుని యొక్క హస్తము తోడుగా ఉండి, వారిని తన యొక్క శక్తితో నింపియున్నాడు.
నా ప్రియులారా, పాతకాల దినములలో సువార్తను లేక దేవుని వాక్యమును ప్రకటించుట అనగా అంత సుళువైన విషయము మాత్రముకాదు. అయినప్పటికిని, వారు ఎప్పుడు దేవుని సువార్తను ప్రకటించినను కూడా దేవుడు వారిని పరిశుద్ధాత్మ శక్తితో బలపరచియున్నాడు. అది దేవుని హస్తమై ఉంటున్నది. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 1:8వ వచనములో చూచినట్లయితే, "అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.'' అవును, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు ప్రపంచమంతయు సువార్తను ప్రకటించగలిగారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే దైవజనులు ప్రపంచమంతట కూడా సంచరించుచూ సువార్తను అనేకులకు ప్రకటించగలిగారు.
అవును, నా ప్రియ స్నేహితులారా, మా కుటుంబములో కూడ చూచినట్లయితే, మేము ఎప్పుడైతే, కుటుంబముగా ప్రార్థనలో చేరుకున్నప్పుడు దేవుడు ప్రవచనాత్మకమైన వాక్కులను మాకు ఇస్తాడు. ఆయన ఇచ్చిన ప్రవచన వాక్కులను మేము విన్న వెంటనే, మేము ఎంతగానో ధైర్యమును పొందుకుంటాము. అప్పుడు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని మేము గుర్తించగలుగుతాము. అవును, ప్రియ స్నేహితులారా, దేవుని హస్తము మీకు కూడా తోడుగా ఉంటుంది. అతని యొక్క ప్రభువైన దేవుని కృపా హస్తము ఎజ్రాకు తోడుగా ఉన్నదని వాక్యము సెలవిచ్చుచున్నది. నా ప్రియులారా, ఈ రోజు కూడా దేవుని యొక్క హస్తము మీకు తోడుగా ఉండి, మిమ్మును బలపరచి, శక్తితో నింపును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నిన్ను ఎల్లవేళల, మాతో కలిగియుండు గొప్ప భాగ్యమును మాకు దయచేయుము. తండ్రీ, నీవు ఇమ్మానుయేలు దేవుడు నిరంతరము మాతో ఉండుటకు ఈ లోకమునకు వచ్చినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు మాకు తోడుగా ఉన్నావన్న ధైర్యమును మాకు దయచేయుము. దేవా, మేము నీ వాక్కులను ఎప్పుడు ప్రకటించినను సరే, కొలతలేకుండా, నీ సన్నిధానము మాకు తోడుగా ఉండునట్లుగా మమ్మును నీ సన్నిధితో నింపి, నీవు మాతో వచ్చి, మా ద్వారా అద్భుతములను జరిగించుము. యేసయ్యా, నీవు మాకు యుగసమాప్తివరకు తోడుగా ఉండుము. ప్రభువా, శాస్త్రియైన ఎజ్రాతో నీ హస్తము తోడుగా ఉన్నట్లుగానే, నీవు మాతో కూడా ఉండునట్లుగా కృపను దయచేయుము. దేవా, నీ మహిమార్థమై మమ్మును నీ సువార్తను ప్రకటించువారినిగా మమ్మును వాడుకొనుము. దేవా, నీ సేవకులైన మేము నీ వాక్యమును ప్రకటించినప్పుడల్లా, నీవు మాతో వచ్చి, మా ద్వారా అద్భుతములు జరిగించుము. యేసయ్యా, నీవు శిష్యులను పంపి, యుగసమాప్తి వరకు వారికి తోడుగా ఉండునని వాగ్దానము చేసినట్లుగా, నీవు యుగసమాప్తి వరకు తోడుగా ఉండి, మా ద్వారా సూచక క్రియలు, అద్భుతాలు చేయునట్లుగా కృపను దయచేయుము. దేవా, మేము ఆశీర్వాదములకు మార్గము చూపునట్లుగా సహాయము దయచేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


